ఉగాది పచ్చడి

Ugadi 2018

ఉగాది పచ్చడి చేద్దామా!

రెండు తెలుగు రాస్ట్రాల్లోనే కాదు…అన్ని రాష్ట్రాల్లో, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న తెలుగోళ్ళందరికీ ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా కళా ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు, పంచాంగ శ్రవణాలు ఎన్నెన్నో వేడుకలుంటాయి. అలాంటి అపురూపమైన ఉగాది ఈసారి తేదీల వారీ చూస్తే గతేడాది కన్నా ముందుగానే ఈ నెల 18నే స్వాగతం పలుకుతోంది.  ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ.
”ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతుంటారు. అలాంటి ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలో తెలుసా?

కావాల్సిన పదార్థాలు:
వేపపువ్వు- తగినంత,Ugadipachadi
చిన్న చెరుకు ముక్క – ఒకటి,
చిన్న కొబ్బరి ముక్క -ఒకటి,
అరటిపళ్లు- రెండు,
చింతపండు – తగినంత,
చిన్న మామిడికాయ- ఒకటి,
బెల్లం- 100 గ్రాములు,
పచ్చి మిరపకాయ – ఒకటి,
ఉప్పు- తగినంత, నీళ్లు – సరిపడా.

తయారుచేయు విధానం:
ముందుగా చెరుకు, కొబ్బరి, బెల్లం, మిర్చి, మామిడికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని పెట్టుకోవాలి. వేప పువ్వును శుభ్రంగా కడిగి రేకుల్నితీసి పెట్టుకోవాలి. తగినన్ని నీళ్లలో చింతపండును బాగా కలిపి తీసి పులుపును చిన్న గిన్నెలో పోయాలి. అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, చెరకు, కొబ్బరి, మిర్చి, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా అరటిపండు ముక్కలు వేయాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ చేసినట్లే…….మరెందుకాలస్యం? ఉగాది పచ్చడితో ఆత్మీయులకు ఆహ్వానం పలుకుదాం.

 

Send a Comment

Your email address will not be published.