మాస్ యాక్షన్ మూవీ… మాక్స్


హీరోగా కన్నడ లో దూసుకుపోతోన్న కిచ్చా సుదీప్ ప్రస్తుతం మాక్స్ అనే ఓ మాస్ యాక్షన్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీని క్రిస్మస్ సందర్భంగా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చాడు. ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం..

కథ
ముక్కుసూటిగా, నిజాయితీగా ఎవ్వరినీ లెక్కచేయకుండా పోయే పోలీస్ అధికారి అర్జున్ అలియాస్ మాక్స్ (కిచ్చా సుదీప్). సస్పెన్షన్‌లో ఉన్న ఆ సీఐ మరో పోలీస్ స్టేషన్‌ని ట్రాన్స్ ఫర్ అవుతాడు. అలా సస్పెన్షన్ నుంచి డ్యూటీలోకి ఎక్కే ఒక్క రాత్రిలోనే ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఇక పోలీస్ స్టేషన్‌లో అడుగు పెట్టక ముందు మంత్రుల కొడుకుల్ని అరెస్ట్ చేసి లోపల వేస్తాడు. అప్పటికే ఆ మంత్రులు ఇద్దరూ కూడా సీఎంని దించేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. పోలీస్ స్టేషన్‌లోనే ఆ ఇద్దరు ఆకతాయిలు చనిపోతారు. ఆ మినిస్టర్ కొడుకులు ఎలా చనిపోతారు? ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? ఈ కథలో క్రైమ్ ఇన్ స్పెక్టర్ రూపా (వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్ స్టర్ గని (సునీల్) పాత్రలు ఏంటి? చివరకు మాక్స్ తన తోటి ఉద్యోగుల్ని కాపాడేందుకు ఏం చేస్తాడు? అన్నదే కథ.

పోలీస్ స్టేషన్‌ కేంద్రంగా
పోలీస్ స్టేషన్‌లో జరిగే ఈ డ్రామా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఒక చిన్న లైన్‌ను పట్టుకుని ఇంత పెద్ద సినిమా కథను, కథనాన్ని ఇంత గ్రిప్పింగ్‌గా ఎలా రాశారా అని దర్శకుడి గురించి కచ్చితంగా ఆలోచిస్తారు. ఇక మాస్ ఆడియెన్స్‌కు నచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు, హై మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. థ్రిల్లింగ్ మూమెంట్స్ కావాలని అనుకునే ఆడియెన్స్‌కి అవి కూడా ఉంటాయి. కొన్ని చిన్న ట్విస్టులు ఉంటాయి. ఆడియెన్స్ ఊహించే ట్విస్ట్‌కి భిన్నంగానూ ఆ ట్విస్టులు ఉంటాయి. సోషల్ మెసెజ్ కూడా ఉంటుంది. అలా అన్ని రకాలుగా మాక్స్ మూవీని డైరెక్టర్ పకడ్బందీగా రాసుకున్నాడు.

ఉత్కంఠ రేకెత్తించేలా సెకండాఫ్
సినిమా ఆరంభం బాగానే ఉంటుంది. హీరో ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఆ తరువాత కాస్త గందరగోళంగా, ఇంకాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్‌కు ఇచ్చే షాక్ అదిరిపోతుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ రేకెత్తించేలా సెకండాఫ్ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ సమస్య నుంచి పోలీసులు ఎలా బయటపడతారు? నిజం బయట పడిపోతే పరిస్థితి ఏంటి? అని ఆడియెన్స్ కూడా ఉత్కంఠతో చూస్తారు.
ఇక ప్రీ క్లైమాక్స్‌లో అసలు ట్విస్ట్ ఉంటుంది. దాన్ని కొంత వరకు ఆడియెన్స్ గెస్ చేస్తారు కూడా. ఇక క్లైమాక్స్ ఫైట్ అయితే ఖైదీ, విక్రమ్ రేంజ్‌లో మోత మోగిపోతుంది.

టెక్నికల్ టీం ఫుల్ సపోర్ట్‌
ఈ సినిమాకు టెక్నికల్ టీం ఫుల్ సపోర్ట్‌గా నిలిచింది. సినిమా అంతా రాత్రి పూటే, ఒకే లోకేషన్‌లో జరుగుతుంది. అయినా బోర్ కొట్టించుకుండా కెమెరామెన్ చక్కగా హ్యాండిల్ చేశాడు. ఇక అజనీష్ మన తమన్‌ను మించి పోయి బాదేసినట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల అదిరిపోతే.. ఇంకొన్ని చోట్ల మోతాదు మించినట్టుగా అనిపిస్తుంది. మాటలు బాగుంటాయి. పాటలు అంతగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌లో కలిసిపోయినట్టుగా అనిపిస్తాయి. చాలా రిచ్‌గా తీసినట్టు అనిపిస్తుంది.

నటన తీరు
సుదీప్ తన పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ హీరోగా తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. ఆ కటౌట్‌ను వాడుకుంటే ఎలా ఉంటుందో చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్ అయితే ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌లానే ఉంటుంది. ఓ ఎదురులేని, తలవంచని పోలీస్ ఆఫీసర్.. మొండిఘటమైన అధికారిలా నటించేశాడు. అన్యాయాన్ని సహించని పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ అదరగొట్టేశాడు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రకు తగిన ప్రాధాన్యత అయితే ఉంది. వరలక్ష్మీ తన నటనతో ఆడియెన్స్‌ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సునీల్ పాత్ర మరీ రెగ్యులర్ అయిపోయిందనే భావన కలుగుతుంది. ఇళవరసుకి మళ్లీ ఓ మంచి పాత్ర దొరికినట్టు అనిపిస్తుంది. ఇలా ప్రతీ పాత్రకు సరైన స్కోప్, ఇంపార్టెన్స్‌ను ఇస్తూ డైరెక్టర్ కథను చక్కగా రాసుకున్నాడు.

నటులు:కిచ్చా సుదీప్,వరలక్ష్మీ శరత్ కుమార్,సునీల్,ఇళవరసు
దర్శకుడు: విజయ్ కార్తికేయ

Scroll to Top