
సీరియల్ యాక్టర్ గా రాణిస్తూ బుల్లితెర నుంచి వెండితెరకి వెళ్ళిన అమర్దీప్ చేసిన ప్రయత్నాలలో భాగమే తాజాగా విడుదలైన ‘సుమతీ శతకం’ సినిమా. సాదాసీదాగా సాగి సగటు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయిందనే చెప్పాలి.
కథ:
తూర్పుగోదావరిలోని వైకుంఠపురానికి చెందిన కృష్ణకి (అమర్దీప్) చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే చాలా ఇష్టం. ఊరిలో జరిగే ప్రతి పెళ్లి లోకి వెళ్లి నాకు పెళ్లి చేయండ్రా బాబూ అంటూ తెగ గోల చేస్తూ ఉంటాడు. అయితే పెద్దయిన తర్వాత ఊరిలో అందరికీ పెళ్లిళ్లు అవుతాయి కానీ కృష్ణ కి మాత్రం ఏ సంబంధం సెట్టు కాదు. దీంతో ఒక జ్యోతిష్యుడ్ని కలిస్తే నీకు దేవత లాంటి అమ్మాయి భార్యగా వస్తుందని చెప్తాడు.
అలా తన దేవతని వెతుక్కునే క్రమంలో పక్క ఊరిలోని అంగన్వాడీ టీచర్ సుమతీ (సైలీ చౌదరి)ని తొలిచూపులోనే చూసి ప్రేమిస్తాడు కృష్ణ. అయితే ఆ అమ్మాయి కూడా కృష్ణని కొన్నాళ్లకి ఇష్టపడుతుంది. కానీ తనని పెళ్లి చేసుకోవాలంటే ధైర్యం కావాలి.. ఒకసారి శుక్రవారం మా ఊరికి రా అని పిలుస్తుంది. చాలా కాన్ఫిడెన్స్‌గా శుక్రవారం వాళ్ల ఊరెళ్లిన కృష్ణకి ఊహించని షాక్ తగులుతుంది. సుమతీ గురించి ఒక విషయం తెలుస్తుంది. అది చూడగానే సుమతీ పైన ఉన్న ప్రేమ కాస్తా భయం గా మారుతుంది. అసలు కృష్ణ ఆరోజు ఏం చూసాడు? తనలోని ప్రేమ భయంగా మారడానికి కారణం ఏంటి? ఇంతకీ చివరికి సుమతీ-కృష్ణల పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ.
వర్కవుట్ కాని కామెడీ
సుమతీ శతకం ట్రైలర్ చూసినప్పుడు ఇదేదో వర్కవుట్ అయ్యేలా ఉందే అనే ఫీలింగ్ కలిగింది. కానీ థియేటర్లో మాత్రం ఆడియన్స్‌ని ఈ సినిమా నిరాశపరిచింది. సినిమా మొత్తం అమర్.. తన అసిస్టెంట్ టేస్టీ తేజ మధ్య నడిచే కామెడీ ట్రాక్ చాలా ఎక్కువే ఉంది. కానీ ఇది ఎక్కడా వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా టేస్టీ తేజ కామెడీ చేస్తున్నాననే ఫీలింగ్‌తో వేసిన ప్రతి డైలాగ్ ఓవరాక్షన్‌లా, సాగదీసినట్లుగా అనిపించింది.
ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా అలా అలా నాలుగు కామెడీ సీన్లతో సాగుతుంది. ఊరి ప్రెసిడెంట్ బుల్లిరాజుగా మహేష్ విట్టా కాస్త నవ్వించాడు. సినిమాలో అమర్ కనిపించిన తీరు, ఆహార్యం, యాక్టింగ్ అన్నీ తన ఫేవరెట్ హీరో రవితేజని ప్రతిబింబిచేలానే ఉంటాయి. ఎక్కడా అమర్ తన మార్క్ చూపించినట్లు కనిపించలేదు.
విఫలయత్నం
అమర్ ఈ సినిమాలో తన టాలెంట్ చూపించాడు. కానీ కథ, కథనంలో పెద్దగా పస లేకపోవడం, కామెడీ పూర్తి స్థాయిలో పండకపోవడంతో అతని ప్రయత్నం సఫలం కాలేదు. ఇక సినిమాకి మరో డ్రా బ్యాక్ హీరోయిన్ సైలీ. లవ్ స్టోరీ వరకూ ఆమె యాక్టింగ్ ఓకే కానీ దేవత ఆవహించినప్పుడు ఆమె నటన మాత్రం తేలిపోయింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సంగీతం విషయంలో మాత్రం మార్కులు వేయొచ్చు. సాంగ్స్ అన్నీ కూడా చాలా ప్లజెంట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా చిట్టి చిట్టి సుమతీ సాంగ్ బాగుంది.
నటులు:అమర్దీప్ చౌదరి,సైలీ చౌదరి,టేస్టీ తేజ,మహేష్ విట్టా
దర్శకుడు:ఎమ్ ఎమ్ నాయుడు
