
యువ హీరో శర్వానంద్ ఇప్పటివరకూ కెరీర్లో చేసిన ప్రతి సినిమాలోనూ ఫలితాలతో సంబంధం లేకుండా తన పాత్రకి న్యాయం చేస్తూ ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఒక ఫైనస్ట్ యాక్టర్ అనిపించుకున్నాడు. ఇక ఇటీవల సంక్రాంతికి హిట్టు కొట్టిన శర్వానంద్.. ఇప్పుడు బైకర్ అంటూ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాలో హీరో రాజశేఖర్.. శర్వాకి తండ్రిగా చేయడం మరో విశేషం.
కథ:
వికాస్ నారాయణ్ (శర్వానంద్)కి ఫ్యామిలీయే లోకం. తన భార్య అనన్య (మాళవిక నాయర్), కొడుకు ఇషాన్‌లతో కలిసి హాయిగా లైఫ్‌ని లీడ్ చేస్తుంటాడు. ముఖ్యంగా తన కొడుకు చదివిననా చదవకపోయినా నవ్వుతూ నవ్విస్తూ ఆడిస్తూ గడిపేస్తుంటాడు. అయితే ఒకరోజు స్కూల్లో తన నాన్న గురించి ఫ్రెండ్ తప్పుగా మాట్లాడాడని వాడ్ని రక్తం కారేలా కొడతాడు ఇషాన్. ఈ విషయం తెలుసుకున్న వికాస్ ఒక్కసారిగా తన తండ్రిని గుర్తుచేసుకొని బాధపడతాడు. వికాస్ తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్).. ఒక మోటోక్రాస్ రేసింగ్ కోచ్. ఒకప్పుడు ఎన్నో రేసుల్లో ఛాంపియన్ అయిన సునీల్ సరైన ప్రోత్సాహం, ఇండియాలో మోటోక్రాస్ రేసింగ్‌కి అంతగా ఆదరణ లేకపోవడంతో మరోస్థాయికి వెళ్లలేకపోతాడు. దీంతో తన కొడుకు వికాస్‌ని ఒక ఛాంపియన్‌గా తీర్చిదిద్దాలని కోచింగ్ ఇస్తూ ఉంటాడు. తండ్రిని ఎవరైనా ఒక్కమాట అన్నా విక్కీకి ఎక్కడ లేని కోపం వస్తుంటుంది. తన కొడుకుని ఎప్పటికైనా మోటోక్రాస్ వరల్డ్ ఛాంపియన్‌గా చూడాలని సునీల్ అనుకుంటాడు. అందుకోసం ఒక బడా స్పాన్సరింగ్ కంపెనీని కలుస్తాడు. దాని ఓనర్ ఇంద్రనీల్ (అతుల్ కులకర్ణి).. విక్కీలో టాలెంట్ చూసి తమ కంపెనీతో సునీల్-విక్కీ ఇద్దరూ ఆరేళ్లు వర్క్ చేసేలా బాండ్ రాయించుకుంటాడు. అయితే ఒక్క ఛాంపియన్ షిప్ రేసులో మాత్రమే పాల్గొని తండ్రికి కనీసం చెప్పకుండా ఒక్క లెటర్ మాత్రం రాసి విక్కీ వెళ్లిపోతాడు. అసలు విక్కీ ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది.. తనకి ప్రాణమైన రేసింగ్‌ని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది.. మళ్లీ తిరిగి విక్కీ రేసింగ్ చేశాడా? తన తండ్రి కలని నెరవేర్చాడా? అనేది మిగిలిన కథ.
బైక్ రేసింగ్‌తో :
ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ ఫిలిం ఇదేనంటూ బైకర్ని బాగా ప్రమోట్ చేశారు. గతంలో కొన్ని సినిమాల్లో ఈ స్పోర్ట్స్ గురించి టచ్ చేసినా కూడా పూర్తి స్థాయిలో దీని మీదే సినిమా రావడం అయితే ఇండియాలో ఇదే మొదటిది. బైక్ రేసింగ్‌తో ఒక కథని తెరకెక్కించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఇండియన్ ఆడియన్స్ క్రికెట్‌కి కనెక్ట్ అయినంతగా ఈ రేసింగ్‌కి కనెక్ట్ కాలేరు. అయినా కూడా డేరింగ్‌గా ఈ సబ్జెక్ట్‌ని తీసుకొని తమ పెర్ఫామెన్సు, కథ, కథనం, ఎమోషన్‌తో సినిమాని మరోస్థాయిలో ప్రేక్షకుల ముందు ఉంచాడు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి. ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్లన్నీ కూడా థియేటర్లో చూసేటప్పుడు బాగా అనిపించాయి. రియల్ రేసింగ్‌ని చూస్తున్న ఫీలింగ్ ఆడియన్స్‌కి కలిగించడంలో టీమ్ సక్సెస్ అయింది.
నటీనటుల నటన:
ఈ సినిమా కోసం శర్వానంద్ ఒక రేసర్‌లా కనిపించడం కోసం పడిన కష్టం, ఆ తపన స్క్రీన్ మీద వృథాపోలేదు. శర్వా బైక్ రేసింగ్ చేసిన ప్రతిసారి స్క్రీన్ మీద ఒక హీరో కాదు రేసర్నే చూసిన ఫీలింగ్ వచ్చింది. అలానే ఫాదర్ సెంటిమెంట్‌ని కూడా శర్వా చాలా బాగా పండించాడు.
సినిమాలో బుల్లెట్ నారాయణ పాత్రలో నటించిన రాజశేఖర్ చాన్నాళ్ల తర్వాత ఒక మంచి పాత్రలో మెప్పించారు. నిజానికి రాజశేఖర్ ఇందులో హీరో పాత్ర చేయలేదు కానీ ఈ కథకి మాత్రం రాజశేఖర్ కూడా హీరోనే. ఎందుకంటే సునీల్ నారాయణ పాత్రే ఈ కథకి ప్రాణం. అలాంటి పాత్రని తన అనుభవంతో, నటనతో మరో స్థాయిలో నిలబెట్టారు రాజశేఖర్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో శర్వానంద్‌కి హగ్గు ఇచ్చే సీన్లో రాజశేఖర్ నిజంగా ఏడిపించారు. మాళవిక నాయర్‌కి కూడా ఒక మంచి పాత్ర దక్కింది. ఫస్టాఫ్‌లో గ్లామర్‌తో మెప్పించిన మాళవిక.. ఇంటర్వెల్ ముందు, సెకండాఫ్‌లో నటనతో మెప్పించింది. కథలో ఆమె పాత్ర కూడా కీలకం కావడంతో చాన్నాళ్ల తర్వాత మాళవికకి మంచి పాత్ర దక్కినట్లయింది. ఇక విలన్‌గా అతుల్ కులకర్ణి మెప్పించారు. చాలా సెటిల్డ్‌గా యాక్ట్ చేశారు. అలాగే అన్వర్ పాత్రలో యాక్ట్ చేసిన నటుడి నటన కూడా బాగుంది. ఇక బ్రహ్మాజీ, తులసి సహా మిగిలిన యాక్టర్లు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.
సాంకేతికత:
ఈ సినిమాకి జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయింది. సినిమాలో రేసింగ్ సీన్లకి, ఎమోషనల్ సీన్లకి జిబ్రాన్ ఇచ్చిన బీజీఎమ్ బాగా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక సినిమా డైలాగులు ఎక్కువగా లేకపోయినా కూడా ఉన్న డైలాగులన్నీ కథని మరింత బలంగా ఆడియన్స్‌ని తాకేలా రాశారు.
నటులు: శర్వానంద్, రాజశేఖర్, మాళవిక నాయర్, తులసి, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి
దర్శకుడు: అభిలాష్ రెడ్డి
