మెప్పించలేకపోయిన ‘డెకాయిట్’


నటుడు అడివి శేష్ హీరోగానే కాకుండా రైటర్‌గా, డైరెక్టర్‌గా కూడా ఇప్పటికే ఒక గుర్తింపు పొందాడు. హిట్ 2 తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తో తాజాగా ‘డెకాయిట్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ వంటి యాక్టర్స్ కీలకపాత్రలు పోషించడంతో డెకాయిట్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రేక్షకుల్ని మెప్పించడం లోనే తడబాటుకు గురైనట్టు అనిపిస్తుంది.

కథ :
ఈ సినిమాకి ‘ఒక ప్రేమ కథ’ అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చినప్పుడే ఇందులో మంచి లవ్ స్టోరీ చూపించబోతున్నారని ఆడియన్స్ సహా అందరూ అనుకున్నారు. అయితే డెకాయిట్ అనే టైటిల్ పెట్టడంతో యాక్షన్ ప్లస్ లవ్ రెండూ బ్లెండ్ చేస్తారని అర్థమైంది. ఇక కథ విషయానికొస్తే హరి (అడివి శేష్).. కడప సెంట్రల్ జైలులో అత్యాచారం, హత్య కేసులో 15 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. అయితే తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సరస్వతి (మృణాల్ ఠాకూర్) ఈ కేసులో హరి జైలుకి వెళ్లడానికి సాక్ష్యం చెప్తుంది. దీంతో జైలులో ఏళ్లకి ఏళ్లు ఇదే విషయం గురించి ఆలోచించి చించి.. చివరికి సరస్వతి తనని కావాలనే ఈ కేసులో ఇరికించేసిందని ఫిక్స్ అవుతాడు. తన లైఫ్ తిరిగి తనకి కావాలని బలంగా అనుకున్న హరి.. జైల్లో పరిచయమైన ఇసాక్ భాయ్ (అతుల్ కులకర్ణి)ని తాను తప్పించుకునేందుకు హెల్ప్ అడుగుతాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత తిరిగి సరస్వతిని చూస్తాడు. మరి సరస్వతి అప్పుడు ఏ స్థితిలో ఉంది.. అసలు హరిని ఈ కేసులో సరస్వతి ఎందుకు ఇరికించింది..? ఇద్దరూ కలిసి అసలు ఎందుకు దొంగతనాలు చేయాల్సి వచ్చింది..? చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ.

స్క్రీన్‌ప్లే స్లో :
అడివి శేష్ సినిమాల్లో సాధారణంగా స్క్రీన్‌ప్లే చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్‌ని చివరి క్షణం వరకూ సీటు ఎడ్జ్‌ని కూర్చోబెట్టేలా గ్రిప్పింగ్‌గా కథనం రాసుకుంటాడు. ఇక ఈ సినిమాకి కూడా కథ, స్క్రీన్‌ప్లే అడివి శేష్‌యే డీల్ చేశాడు. అయితే డెకాయిట్‌లో మాత్రం స్క్రీన్‌ప్లే కాస్త స్లోగా అనిపిస్తుంది. హరి జైలు జీవితం నుంచి కథని మొదలుపెట్టి తన లవ్‌స్టోరీని కొంచెం కొంచెం రివీల్ చేస్తారు. ఇక అసలు హరి-సరస్వతి లవ్‌కి ఎందుకు సడెన్ బ్రేకులు పడ్డాయ్.. హరి ఎందుకు జైలుకి రావాల్సి వచ్చిందనే సీన్లతో ఫస్టాఫ్ అలా అలా ముగిసింది. ఇక జైలు నుంచి తప్పించుకున్న తర్వాత హరి.. తన మాజీ ప్రియురాలు సరస్వతి కష్టాలు, కన్నీళ్లు చూడటం.. తనని ఇంతగా ఇరికించినా కూడా తన లవర్‌కి హెల్ప్ చేయాలనుకోవడం.. దాని కోసం పాట్లు పడటం లాంటి సీన్లు చూసినప్పుడు గతంలో చూసిన కొన్ని సినిమా సీన్లు గుర్తొస్తాయ్. అయితే సరస్వతి.. హరిని జైలుకి వెళ్లేలా ఎందుకు చేసింది.. అనే విషయాలు రివీల్ అయినప్పుడు కాస్త సినిమాపై ఆసక్తిని పెంచింది.
అయితే సినిమాని నిలబెట్టింది మాత్రం క్లైమాక్స్‌. ఎందుకంటే ‘ఒక ప్రేమ కథ’ అని ఇచ్చిన క్యాప్షన్‌కి జస్టిఫై అయితే చేశారు. ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాని కాస్త గట్టెక్కించింది. ఎందుకంటే మొత్తం రెండున్నర గంటల సినిమాలో కాస్త యాక్షన్, కాస్త లవ్ ఇలా చూపిస్తూ.. దేనికీ సరైన న్యాయం చేయలేదని పించింది.

నటన :
అడివి శేష్.. హరి పాత్రని ఆడుతూ పాడుతూ చేసేశాడు. జైలులో ఉన్నప్పుడు కాస్త మాస్ లుక్‌, యాటిట్యూడ్‌తో కనిపించిన శేష్.. లవ్ స్టోరీలో కాస్త అమాయకంగా, క్యూట్‌గా కనిపించాడు. ఇక ఎమోషనల్ సీన్లలో ఎప్పటిలానే తన మార్క్ చూపించాడు. అయితే సినిమాలో మృణాల్‌ది బలమైన పాత్ర. సీతారామం తర్వాత మృణాల్‌కి మళ్లీ అంతలా కన్నీళ్లు కార్చే అవకాశం ఇచ్చిన సినిమా ఇదే. సరస్వతి పాత్రని మృణాల్ తనదైన స్టయిల్లో చేసుకుంటూ వెళ్లిపోయింది. సినిమాలో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ లాంటి బలమైన నటులు ఉన్నారు. కానీ వీరిని ఎందుకో సరిగా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పాత్రని పరిచయం చేసిన తీరు.. ఎండ్ చేయకుండా వదిలేసిన తీరు అంతగా కనెక్ట్ కాదు. అనురాగ్ కశ్యప్ లాంటి నటుడికి ఇంకాస్త బలమైన సీన్లు పడుంటే బావుండేది. ఇక సునీల్, ఝాన్సీ, అతుల్ కులకర్ణి సహా మిగిలిన పాత్రలన్నీ ఓకే.

సాంకేతికత :
సినిమాకి బీజీఎమ్ బావుంది.. కానీ సాంగ్స్ విషయంలో భీమ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఎడిటింగ్ విషయంలో ఫర్వాలేదు. అయితే ఎక్కడా ఖర్చుకి వెనకాడలేదు. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. అయితే ఎటొచ్చి సినిమా టైటిల్ అయిన ‘డెకాయిట్‌’ కంటే.. క్యాప్షన్‌గా ఇచ్చిన ‘ఒక ప్రేమ కథ’ డామినేషన్‌యే ఎక్కువ ఉంది.

నటులు: అడివి శేష్,మృణాల్ ఠాకూర్,ప్రకాష్ రాజ్,అనురాగ్ కశ్యప్
దర్శకుడు: షానియల్ డియో, నిర్మాత: సుప్రియ.

Scroll to Top