అభిమానులను ఆకట్టుకునే “పెద్ది”


మెగాహీరో రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిన ‘పెద్ది’ భారీ అంచనాల మధ్య తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఉప్పెన’తో దర్శకుడిగా తన ముద్ర వేసిన బుచ్చిబాబు సాన, ఈసారి పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకుని ఒక గ్రామం ఆత్మగౌరవ పోరాటాన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఆవిష్కరించాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు విజువల్స్ సినిమాపై ముందే భారీ అంచనాలు పెంచాయి. కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ యాక్షన్, స్పోర్ట్స్ డ్రామా, ఎమోషనల్ జర్నీ.. ఈ నాలుగు అంశాలను ఒకే కథలో కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ప్రయత్నమే ‘పెద్ది.

కథ:
విజయనగరం సమీపంలోని కొండ కింద ఉన్న ఒక చిన్న గిరిజన గ్రామంలో పెరిగిన యువకుడు పెద్ది (రామ్ చరణ్). ఆ గ్రామానికి సరైన గుర్తింపు ఉండదు. కనీసం రైలు కూడా అక్కడ ఆగదు. గ్రామ ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆ గ్రామానికి గుర్తింపు తీసుకురావాలన్నది గ్రామ పెద్ద అప్పలసూరి (జగపతిబాబు) జీవిత లక్ష్యం. గ్రామం అభివృద్ధి చెందాలంటే రైల్వే స్టేషన్ రావాలని ఆయన దశాబ్దాలుగా పోరాడుతుంటాడు. మరోవైపు పెద్ది అద్భుతమైన క్రికెటర్. స్థానిక టోర్నమెంట్లలో డబ్బులు ఇచ్చే వారి తరఫున ఆడుతూ జీవనం సాగిస్తుంటాడు. ఇదే సమయంలో స్థానిక రాజకీయ నాయకుడి కుమార్తె అచ్చమ్మ (జాన్వీ కపూర్)తో ప్రేమలో పడతాడు. ఒక సంఘటన కారణంగా పెద్ది జీవితంలో భారీ మార్పు వస్తుంది. క్రికెట్ నుంచి కుస్తీ వైపు, అక్కడి నుంచి పరుగుల ప్రపంచంలోకి అడుగుపెడతాడు. తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తూ, తన గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఢిల్లీ వరకు ప్రయాణిస్తాడు. అసలు పెద్ది ఎందుకు మూడు క్రీడల్లో పాల్గొనాల్సి వచ్చింది? అతని జీవితాన్ని మార్చిన సంఘటన ఏమిటి? చివరికి తన గ్రామానికి గుర్తింపు తీసుకురాగలిగాడా? రైలు ఆ గ్రామంలో ఆగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ.

విశ్లేషణ:
‘పెద్ది’ని కేవలం స్పోర్ట్స్ డ్రామాగా చెప్పడం సరైంది కాదు. ఇది ఒక గ్రామం ఆత్మగౌరవం కోసం పోరాడిన యువకుడి కథ. అదే సమయంలో యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించే కథ కూడా. బుచ్చిబాబు కథను చాలా నెమ్మదిగా, సహజంగా ప్రారంభిస్తాడు. ఫస్టాఫ్ మొత్తం పెద్ది పాత్ర పరిచయం, గ్రామ జీవితం, అక్కడి సమస్యలు, క్రికెట్ ట్రాక్ చుట్టూ తిరుగుతుంది. కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించిన భావన కలిగించినా, ప్రేక్షకుడు పాత్రలతో కనెక్ట్ అయ్యేలా స్క్రీన్‌ప్లే సాగుతుంది. ప్రీ-ఇంటర్వెల్ నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు పెద్ద బలం. సెకండాఫ్‌లో కుస్తీ, అథ్లెటిక్స్, ఢిల్లీ ఎపిసోడ్స్, రాజకీయ వ్యవస్థతో పోరాటం, గ్రామ భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు ఎమోషనల్‌గా సాగుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే సంఘటనలు ప్రేక్షకులను పూర్తిగా కథలోకి లాక్కెళ్తాయి.

40 నిమిషాల క్లైమాక్స్:
ఈ సినిమా బలం కమర్షియల్ హంగులు కాదు. కథలోని పాత్రల ఎమోషన్స్. అదే దర్శకుడు బుచ్చిబాబు సాధించిన విజయం. 40 నిమిషాల క్లైమాక్స్.. ‘పెద్ది’ గురించి ముందే ఎక్కువగా వినిపించిన అంశం క్లైమాక్స్. సినిమా చూసిన తర్వాత ఆ ప్రచారం ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. చివరి 35-40 నిమిషాలు పూర్తిగా ఎమోషన్, స్పోర్ట్స్ థ్రిల్, గ్రామ ప్రజల ఆశలు, పెద్ది పోరాటం చుట్టూ తిరుగుతాయి. ప్రతి నిమిషం ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టేలా బుచ్చిబాబు ఈ భాగాన్ని డిజైన్ చేశాడు. సాధారణ స్పోర్ట్స్ మూవీ క్లైమాక్స్ కాకుండా, ఒక గ్రామ భవిష్యత్తు అక్కడ నిర్ణయించబడుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

నటన:
‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ నటుడిగా మరోసారి తన స్థాయిని నిరూపించుకున్న చిత్రం ‘పెద్ది’. గ్రామీణ యువకుడి అమాయకత్వం, ప్రేమ, కోపం, బాధ, పోరాటం, ఆత్మగౌరవం.. ప్రతి భావాన్ని అద్భుతంగా పలికించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో చరణ్ నటన సినిమాకు హృదయం గా నిలుస్తుంది. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి మూడు విభిన్న క్రీడలకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్‌ను కూడా ఎంతో సహజంగా ప్రదర్శించాడు. సినిమాలో రామ్ చరణ్ తర్వాత ఎక్కువగా గుర్తుండిపోయే పాత్ర అప్పలసూరి. జగపతిబాబు ఈ పాత్రలో పూర్తిగా జీవించాడు. గ్రామ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా నటించాడు. శివరాజ్‌కుమార్ పోషించిన గౌరీ నాయుడు పాత్ర కూడా కథకు బలాన్నిస్తుంది. ఆయన కనిపించిన ప్రతి సన్నివేశం ప్రభావవంతంగా ఉంటుంది. దివ్యేందు శర్మ పాత్ర పరిమితంగానే ఉన్నా తనదైన ముద్ర వేస్తాడు. జాన్వీ కపూర్ పాత్ర కథలో కీలకమైనప్పటికీ, నటనకు పెద్దగా అవకాశాలు లభించలేదు.

టెక్నికల్‌గా:
ఈ సినిమాకు మరో హీరో ఏఆర్ రెహమాన్. పాటలు మాత్రమే కాదు, నేపథ్య సంగీతం అనేక సన్నివేశాలకు ప్రాణం పోసింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్‌లో రెహమాన్ బిజిఎం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. గ్రామీణ ప్రాంత అందాలను అద్భుతంగా బంధించారు. కొండలు, మైదానాలు, క్రీడా పోటీలు, ఢిల్లీ నేపథ్యం.. ప్రతి ఫ్రేమ్ విజువల్ ట్రీట్‌లా కనిపిస్తుంది. 1980ల నాటి వాతావరణాన్ని సజీవంగా చూపించడంలో ఆర్ట్ టీమ్ విజయం సాధించింది. గ్రామ సెట్స్, క్రీడా మైదానాలు, పీరియడ్ డీటైలింగ్ ఆకట్టుకుంటాయి. సినిమా నిడివి ఎక్కువ అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే కథనం మరింత వేగంగా సాగేదనిపిస్తుంది.

నటులు: రామ్ చరణ్,జాన్వీ కపూర్,జగపతిబాబు,శివరాజ్ కుమార్
దర్శకుడు: బుచ్చిబాబు

Scroll to Top