
ఎన్ని రకాల ప్రేమ కథలు సినిమాలుగా వచ్చినా, అందులో కొత్తదనం, మంచి ఎమోషన్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. అందుకే ప్రతీ సారి లవ్ స్టోరీలతో కొత్త మేకర్స్ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి ఓ కొత్త ప్రేమ కథతో తాజాగా ‘దీవాన’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ
మున్నా (హర్షిత్ రెడ్డి) ఓ ఆవార. డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి తిరగడం, తినడం, తాగడం తప్పా ఇంకో పని ఉండదు. శేఖర్ (నరేష్) తన కొడుకు మున్నాని ఎంతో ప్రేమతో పెంచుతాడు. తాను ఎంత కష్టపడుతున్నా కూడా కొడుకుని మాత్రం రాజులా చూసుకుంటాడు. కానీ మున్నా మాత్రం ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా గాలికి తిరుగుతుంటాడు. అలాంటి మున్నా ఓ సారి అమూల్య (స్మేహా మణి మేఘ లై)ని చూస్తాడు. తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోతాడు. అమూల్య తన లోకంగా మున్నా భావిస్తాడు. ఆమె పని చేసే మీ సేవ కేంద్రం దగ్గరకు నిత్యం వెళ్లి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాడు. “పనీ పాట లేకుండా ఇలా గాలికి తిరిగే ఎలా? నేను నెలకు ఇరవై వేలు సంపాదిస్తున్నాను. నువ్వు కనీసం ఇరవై రూపాయలు కూడా సంపాదించలేవు. ముందు నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుని రా. ఆ తర్వాత చూద్దాం. అప్పటి వరకు నా కంటికి కనిపించకు” అని మున్నాతో అమూల్య తెగేసి చెబుతుంది. మున్నా అమూల్య కోసం కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదిస్తాడా? చివరకు ఏం జరుగుతుంది? అన్నది కథ.
కథలో కొత్తదనం
ప్రేమ అనేది అనంతం. ప్రేమను కేంద్రంగా చేసుకుని ఎన్ని కథల్ని అయినా అల్లుకోవచ్చు. అయితే ఆ కథలో కట్టి పడేసే ఎమోషన్, కొత్తదనం ఉండాలి. అలా ఎమోషనల్ కనెక్టివిటీతో, నిజాయితీగా సినిమాను తీస్తే ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారు. అలాంటి ఓ హానెస్ట్ అటెంప్ట్‌గా ‘దీవాన’ నిలుస్తుంది. ప్రేమకు అర్థం చెప్పేలా ‘దీవాన’ ఉంటుంది. ప్రేమకి అందం ముఖ్యం కాదు. మనసు ముఖ్యం అని చెప్పేలా హార్డ్ హిట్టింగ్ ఎమోషన్‌తో ‘దీవాన’ మూవీని దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి తీశాడు. సినిమా ఆరంభం అంతా రొటీన్ గానే సాగుతుంది. అలా నెమ్మదిగా సాగే కథనం లోకి లవ్ ట్రాక్ వస్తుంది. అప్పటి నుంచి కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఫ్రెండ్స్, గొడవలు, వీధుల్లో ఫైట్స్ ఇలా సాదాసీదాగా సాగుతుంటుంది. ఇక ఇంటర్వెల్‌కి ఇచ్చే ట్విస్ట్ బాగుంది. అప్పటి వరకు సినిమా మీద వచ్చిన ఒపీనియన్ మారుతుంది. ఓ మంచి సినిమా చూడబోతోన్నామనే ఫీలింగ్‌ను ఇంటర్వెల్ బ్లాక్ ఇస్తుంది.
ఎమోషనల్ సీన్స్
సెకండాఫ్‌లో చాలా వరకు ఎమోషనల్ సీన్స్ కంటతడిని పెట్టిస్తాయి. హీరోయిన్ తనలో దాచుకున్న ప్రేమను స్నేహితురాలికి చెప్పుకునే సీన్, పోలీస్ స్టేషన్లో నరేష్ చేసిన సీన్, తండ్రి గొప్పదనాన్ని కమెడియన్ రఘు చెప్పే సీన్ ఇలా ప్రతీ ఒక్కటి గుండెను బరువెక్కేలా చేస్తుంది. చాలా వరకు సీన్స్ కంటతడి పెట్టించేలా ఉంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మరింత బాగుంటుంది. క్లైమాక్స్ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. మధ్యలో పోలీస్ ట్రైనింగ్ సీన్లు. ఒక్క అటెంప్ట్‌లోనే ఉద్యోగం. ఇవన్నీ సినిమాటిక్ లిబర్టీ అనుకోవాల్సిందే.
నటన
నటీనటుల విషయానికి వస్తే.. హర్షిత్ రెడ్డి మెప్పిస్తాడు. పనీ పాటా లేకుండా తిరిగే కుర్రాడిలా నటించి ఆకట్టుకుంటాడు. ఇక సెకండాఫ్‌లో చాలా వరకు ఎమోషనల్ సీన్లతో అందరినీ టచ్ చేస్తాడు. హీరోయిన్‌కి మంచి పాత్ర దక్కింది. అందంగా కనిపించడమే కాదు.. అంతే గొప్పగా నటించింది. హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు ప్రేక్షకులకు ఎక్కువగా రిజిస్టర్ అవుతాయి. వేణు, రఘు పాత్రలు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. నరేష్ మరోసారి తన నటనతో అందరినీ కంటతడి పెట్టించేస్తాడు. ఝాన్సీ పాత్ర రెగ్యులర్ మదర్లానే అనిపిస్తుంది. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.
టెక్నికల్‌గా
టెక్నికల్‌గా చూసుకుంటే ఈ సినిమా ఆకట్టుకుంటుంది. విజువల్స్ నేచురల్‌గా ఉంటాయి. పాటలు గుర్తుండక పోయినా మాటలు మాత్రం గుర్తుంటాయి. బీజీఎం చాలా వరకు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది. టెక్నికల్ టీం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ ఇంపాక్ట్ కలిగించేలా సినిమాను మేకర్స్ రూపొందించడంలో సక్సెస్ అయ్యారు.
