
కామెడీ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణే ఉంది. తాజాగా విడుదలైన “కొరియన్ కనకరాజు” సినిమా మరోసారి ఈ విషయాన్ని రుజువుచేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ కొరియన్ కనకరాజు ’. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటించింది. కమెడియన్ సత్య ప్రధాన పాత్రను పోషించారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు.
కథ
పెనుగొండలో కనకరాజు (వరుణ్ తేజ్) చెక్క భజన బృందాన్ని నడుపుతుంటాడు. అతను కాస్త కోపిష్టి. తప్పు చేసిన వాడిని విడిచిపెట్టకుండా తుక్కు రేగ్గొడుతుంటాడు. స్నేహితుడైన కిష్టప్ప (సత్య) ఫోటో స్టూడియోలోనే ఈ చెక్క భజన బృందం కూడా ఉంటుంది. కనకరాజు తండ్రి చెంగారెడ్డి (సునీల్) వద్ద మునుస్వామి (చిన్నా) అప్పు చేస్తాడు. అప్పు కంటే వడ్డీనే ఎక్కువ కట్టాం కదా అని చెంగారెడ్డి మనుషులతో కనకరాజుకి గొడవ జరుగుతుంటుంది. ఇంకో వైపు చైత్ర (రితికా నాయక్) అక్కడే లోకల్‌గా కియా కంపెనీలో పని చేస్తూ ఉంటుంది. కొరియాలో సెటిల్ అవ్వాలనేది చైత్ర కల. ఇక చైత్రకి, కనకరాజుకి ఏర్పడిన పరిచయం ఎంత వరకు దారి తీస్తుంది? కొరియాలోని డాన్ అస్థికలు కనకరాజు ఒంట్లోకి ఎలా వస్తాయి? కొరియన్ ఆత్మ కనకరాజు ఒంట్లోకి వచ్చాక ఏం జరుగుతుంది? కనకరాజు, చైత్ర, కిష్టప్ప కొరియా వచ్చాక ఏం అవుతుంది? అసలు ఆ కొరియన్ డాన్ గతం ఏంటి? అతడ్ని చంపింది ఎవరు? తిరిగి కనకరాజు కొరియాకు ఎలా వచ్చాడు? ఈ కథలో కనకరాజు అన్న పృథ్వీరాజ్ (అవసరాల శ్రీనివాస్) పాత్ర ఏంటి? అనే విషయాల చుట్టూ ఈ సినిమా కథ రకరకాల మలుపులు తిరుగుతుంటుంది.
నిజానికి కొరియన్ కనకరాజు సినిమాలోని కథ కొత్తదేమీ కాదు. ఎన్నో సార్లు ఎంతోమంది చూసిన కథకే కొత్తగా కొరియన్ టచ్ ఇచ్చి ఫుల్ ఎంటర్టైనింగ్గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఇక అతని మేకింగ్ స్టైల్, అతని సినిమాలోని కామెడీ పరుగులు పెట్టే విధానం అందరికీ తెలిసిందే. అతను ఈ సారి కూడా తన ఫార్మాట్‌ను నమ్ముకుని కామెడీ, యాక్షన్ మూవీని తీశాడు. ఇందులోని లాజిక్స్ పక్కన పెడితే.. కామెడీ మాత్రం ఓ రేంజ్లో అందర్నీ మెప్పిస్తుంది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల్ని నవ్వించడంలో మేర్లపాక గాంధీ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు.
ఆసక్తికరంగా
కొరియాలో సీన్ ఓపెన్ చేస్తారు. అక్కడ ఓ బడా వ్యక్తి చనిపోవడం, అతడి అస్తికలు అలా అలా చేతులు మారి చివరకు పెనుగొండకు వస్తాయి. ఇక అక్కడ కనకరాజు ఎంట్రీ, ఓ పాట, ఓ ఫైట్, ఓ కామెడీ సీన్, ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, కాసేపు లవ్ ట్రాక్, ఇంకాసేపు సత్య కామెడీ, మళ్లీ విలన్‌తో ఫైట్స్ అంటూ ఇలా సాదాసీదాగా సినిమా సాగుతుంది. ఒక్కసారి కొరియన్ దెయ్యం కనకరాజు ఒంట్లోకి రావడంతో కథ మారిపోతుంది. అక్కడి నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు కథ ఆసక్తికరంగా మారుతుంది. సెకండాఫ్ ఇంకెంత స్టైలీష్‌గా, యాక్షన్ మోడల్లో ఉంటుందా? అన్న ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసేలా ఇంటర్వెల్‌ను డిజైన్ చేశారు.
సెకండాఫ్ ఆరంభం పూర్తి స్టైలీష్‌గా అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోతాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెంకడాఫ్‌లో సత్య కామెడీ సీన్స్ మరింత హైలెట్ అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ వరకు సత్య కామెడీ సీన్స్ పగలబడేలా నవ్విస్తాయి. మరీ ముఖ్యంగా రీసెంట్ ట్రెండింగ్ డైలాగ్ (అమెచ్యూరీష్)ని కూడా వాడేశారు. ఆ బ్లాక్ మాత్రం థియేటర్ లో బ్లాస్ట్ అవుతుంది. అయితే క్లైమాక్స్ మాత్రం ఏఐతో నింపినట్టుగా క్లైమాక్స్ కొందర్ని నిరాశ పరిచే అవకాశం ఉంది. కానీ ఈ లోపాలన్నీ కూడా సత్య తన కామెడీ టైమింగ్‌లో కవర్ చేసినట్టు అనిపిస్తుంది.
నటన
నటీనటుల విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఈ సారి యాక్షన్, కామెడీ ఇలా అన్నింట్లోనూ అదరగొట్టేశాడు. ఇక కమెడియన్ సత్య ఈ సినిమాకి ప్రధాన బలం. అతని కామెడీ టైమింగ్‌తో అలరిస్తుంది. రితికా నాయక్ తెరపై ఎంతో అందంగా కనిపిస్తుంది. మురళీధర్ గౌడ, బుల్లిరాజు, వీటీవీ గణేష్ కామెడీ సీన్లు బాగుంటాయి. సునీల్‌కి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కాదనిపిస్తుంది. చిన్నా, అవసరాల శ్రీనివాస్ వంటి ఆర్టిస్టులకు కూడా చాలా తక్కువ స్పేస్ లభించినట్టు అనిపిస్తుంది. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పిస్తారు.
టెక్నికల్‌గా
టెక్నికల్‌గా చూసుకుంటే కెమెరా వర్క్ చాలా స్టైలీష్‌గా అనిపిస్తుంది. విజువల్స్ చాలా రిచ్‌గా కనిపిస్తాయి. తమన్ ఇచ్చిన ఆర్ ఆర్ ఇది వరకే విన్నట్లు అనిపిస్తుంది. పాటలు తెరపై అందంగా కనిపిస్తాయి, వినిపిస్తాయి. మాటలు అయితే మరీ గుర్తుంచుకునే రేంజ్లో ఉండవు. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. ఎడిటింగ్, ఆర్ట్, కాస్ట్యూమ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ మంచి అవుట్ పుట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా ‘కొరియన్ కనకరాజు’ నవ్విస్తాడు. లాజిక్స్‌తో చూస్తే మాత్రం కొన్ని చోట్ల నిరాశపర్చే అవకాశం ఉంటుంది. రొటీన్, రెగ్యులర్, ప్రిడిక్టబుల్ స్టోరీనే అయినా కామెడీ మాత్రం వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. పాటలు, ఫైట్స్, కడుపుబ్బా నవ్వుకునేలా కామెడీ ఉంటే చాలు అని అనుకునే వారికి మాత్రం ‘కొరియన్ కనకరాజు’ బెస్ట్ ఆప్షన్.
నటులు:వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, మురళీధర్ గౌడ్
దర్శకుడు:మేర్లపాక గాంధీ
