ఆస్ట్రేలియాలో తెలుగు భాష వారసత్వం

ఆస్ట్రేలియాలో తెలుగు భాష వారసత్వం: సవాళ్లు, పరిష్కారాలు మరియు అవసరం
ఇటీవల జరిగిన జాతీయ గణాంకాలలో లక్షే లక్ష్యంగా “ఇంట్లో మాట్లాడే భాష – తెలుగు” అని వ్రాయమని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్దించడం జరిగింది.  దానికి అనూహ్య స్పందన రావడం ద్వారా తెలుగు సమాజం ఈసారి ఈ లక్ష్యానికి మించి ఫలితాలు రాగలవని ఆశాజనకంగా ఉన్నారు.  కొంతమంది 1,20,000 గా, ఇంకొంతమంది 1,50,000 నమోదు కావచ్చని ఎవరికి వారు వాదనలు వినిపిస్తున్నారు.  ఇది ప్రస్తుతం 2021 గణాంకాలలో నమోదైన సంఖ్యా కంటే రెండు రెట్లు అంతకంటే ఎక్కువ.  ఇది మంచి శుభపరిణామం.  ఇందులో భాగస్వామ్యులై గత రెండు నెలలుగా ఈ విస్తృత ప్రచారానికి సహాయం చేసిన వారందరికీ వందనాలు.

ఆస్ట్రేలియాలో తెలుగు మాట్లాడే కుటుంబాలు పెరిగాయి, పెరుగుతున్నాయి. అయినప్పటికీ, తరువాతి తరానికి తెలుగు భాషను అందించడంలోని కొన్ని సవాళ్ళను చూద్దాము.

  • ఆంగ్ల ఆధిపత్యం: పాఠశాలలు, స్నేహిత వర్గాలు, సామాజిక మాధ్యమాలు అన్నీ ఆంగ్లం ఆధారంగా ఉండటం వల్ల పిల్లలు తెలుగు మాట్లాడే అవకాశాలు తగ్గుతున్నాయి.
  • సంస్కృతి విస్మరణ: పండుగలు, సాహిత్యం, కళలు పిల్లలకు చేరకపోవడం వల్ల వారిలో భాషా అనుబంధం తగ్గిపోతోంది.
  • సంస్థాగత మద్దతు లోపం: శిశుబాల శిక్షణా కేంద్రాల స్థాయిలో తెలుగు నేర్పే కార్యక్రమాలు తక్కువగా ఉండటం, తల్లిదండ్రులకు సమాచారం లేకపోవడం.
  • కుటుంబ భాషా విధానం లోపం: ఇంట్లో తల్లిదండ్రులు తెలుగు మాట్లాడకపోవడం లేదా మిశ్రమ భాషా వాడకం వల్ల పిల్లలు తెలుగు నేర్చుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి.
  • అంకాత్మక (డిజిటల్) ప్రభావం: పిల్లలు ఎక్కువగా ఆంగ్ల డిజిటల్ విషయాలకు ఆకర్షితులవుతుండటం.

అమ్మబాష అవసరం

  • గుర్తింపు: అమ్మబాష మన సంస్కృతి, మన మూలాలు, మన గుర్తింపును నిలబెడుతుంది.
  • బహుభాషా ప్రయోజనం: శాస్త్రీయ పరిసోధనల్లో బహు భాషలు మాట్లాడే పిల్లలు విద్యా, సామాజిక రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నది నిర్వివాదాంశం.  అందునా మాతృ భాష మాట్లాడే వారు మరింత చురుగ్గా ఉంటారని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
  • సాంస్కృతిక వారసత్వం: తెలుగు సాహిత్యం, కవిత్వం, సంగీతం తరతరాలకు చేరుతుంది.  తెలుగు భాషలో ఉన్న వైవిధ్యం ఇతర భాషలలో లేదనే చెప్పాలి.  నన్నయ మొదలుకొని ఈనాటి వరకూ భాషలో వచ్చిన మార్పులు గమనిస్తే తెలుగు భాష ఒక గొప్ప ప్రాచీన భాషనే చెప్పాలి.
  • సమాజ బలం: అమ్మబాష ద్వారా సమాజ ఐక్యత, సమగ్రత, పరస్పర సహకారం పెరుగుతుంది.

సాధ్యమైన పరిష్కారాలు

  • ఇంట్లో తెలుగు వాడకం: తల్లిదండ్రులు పిల్లలతో నిరంతరం తెలుగు మాట్లాడాలి. “ఒక తల్లి – ఒక భాష” విధానం లేదా ఇద్దరూ తెలుగు మాత్రమే మాట్లాడే విధానం విజయవంతమని పరిశోధనలు సూచిస్తున్నాయి.
  • తెలుగు భాషపై మమకారం: పిల్లలకు తెలుగు భాషపై మమకారం పెంచే ప్రయత్నాలు చేయాలి.  పుస్తకాలలో ఉండే విషయాలకంటే మాట్లాడే భాషపై ఎక్కువ ప్రాధాన్యత చూపించాలి.  మన భాషలో ఉన్న సాహిత్యంపై మంచి అవగాహన కల్పించాలి.  అప్పుడు వాళ్ళకి వాళ్ళే వారికి కావలసిన సాహిత్య సంపదను వెదికి చదువుకుంటారు.
  • సామాజిక విద్యా కేంద్రాలు: ఆస్ట్రేలియాలో తెలుగు సంఘాలు నిర్వహించే వారాంతపు తరగతులకి హాజరై  సుమారు 800 మంది పిల్లలు తెలుగు భాషను నేర్చుకుంటున్నారని ఒక అంచనా. అయితే ఇది పిల్లలు ఎదిగి ఉన్నత పాఠశాల చేరినంత వరకే అని చాలామంది చెబుతూ ఉంటారు.  ఆస్ట్రేలియా బడులలో తెలుగు భాష ఒక పాఠ్యాంశంగా లేకపోవడం వలన తరువాత కొనసాగించడం ఎలా అన్నది ప్రశ్నగా మారుతుంది.
  • అంకాత్మక (డిజిటల్) వనరులు: తెలుగు కథలు, పాటలు, యాప్‌లు, అంతర్జాతీయ తరగతుల ద్వారా పిల్లలకు ఆకర్షణీయంగా నేర్పాలి.
  • పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు: సంక్రాంతి, దీపావళి, బతుకమ్మ, బోనాలు, ఉగాది వంటి కార్యక్రమాల్లో పిల్లలను భాగస్వామ్యం చేయాలి.
  • ప్రభుత్వ మద్దతు: జనగణనలో “మాతృభాష: తెలుగు” అని నమోదు చేయడం ద్వారా పాఠశాలలు, వైద్యశాలలు, సమజానికి మద్దతు పెరుగుతుంది.  ఆస్ట్రేలియా బడులలో తెలుగు పాఠ్యాంశంగా ఉన్నట్లయితే తెలుగు సంఘాలు నిర్వహిస్తున్న వారాంతపు బడులకు కొనసాగింపుగా ఉంటుంది.

 ముగింపు
ఆస్ట్రేలియాలో తెలుగు భాషా వారసత్వాన్ని నిలబెట్టడం మన బాధ్యత, మన గర్వం. తల్లిదండ్రులు, తెలుగు సమాజం, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే తెలుగు తరతరాలకు చేరుతుంది. “అమ్మబాష – మన శక్తి, మన భవిష్యత్తు” అనే నినాదంతో ప్రతి తెలుగు కుటుంబం ముందుకు రావాలి.

Scroll to Top