
తెలుగు సినిమాల్లో టాలెంటెడ్ యాక్టర్ గా వైవిధ్యమైన కథలతో అలరించే శ్రీవిష్ణు తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) పుట్టినరోజు సందర్భంగా “ఇది మన అందరి కథ” అంటూ చిత్ర బృందం సోమవారం అనౌన్సమెంట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. చిన్ననాటి కలలు, ఎదుగుతున్న క్రమంలో పడే బాధ్యతలు, సవాళ్ల నేపథ్యంతో నేటి యువత జీవితానికి అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. హారిక సూర్యదేవర నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
‘ఇది మన అందరి కథ’ అంటూ విడుదల చేసిన ఈ చిన్న గ్లింప్స్.. సినిమా కాన్సెప్ట్ ఏంటనేది తెలియజేసింది. ”చిన్నప్పుడు మనం స్కూల్ లో చాలా కలలు కంటాం. అదై పోవాలి.. ఇదై పోవాలి అని. ఆ తర్వాత మన స్థోమత మేరకు ఒక మామూలు కాలేజీలో చదువుకుంటాం. పెద్దయ్యాక మన కుటుంబ బాధ్యతలు మీద పడ్డాక, ఒక ఉద్యోగం చేయడం మొదలు పెడతాం. అది నచ్చినా నచ్చకపోయినా చేస్తూనే ఉంటాం. కానీ ఈ ప్రయాణంలో మనం ఏమి అవ్వాలని అనుకున్నామో మర్చిపోతాం. జీవితం ఇచ్చే జీతాన్నే తీసుకుంటాం. ఇది మనందరి కథ. అందరిలాగే నా కథ” అంటూ శ్రీవిష్ణు వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ‘మరుగేలరా.. ఓ రాఘవ’ అంటూ బ్యాగ్రౌండ్ లో వినిపించే త్యాగరాజ కృతి అలరిస్తోంది. ఇది మంచి మ్యూజికల్ చిత్రంగా రూపొందగలదని అంతా భావిస్తున్నారు.
