
పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన బ్లాక్బస్టర్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’. 2022లో తెలుగు తమిళ భాషల్లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ గా రూపొందిన ‘సర్దార్ 2’ మూవీ ట్రైలర్ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్, సామ్ సి.ఎస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్జే సూర్య నెగెటివ్ రోల్లో నటించగా, మాళవిక మోహనన్, రజిషా విజయ్, ఆషికా రంగనాథ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘సర్దార్’ సినిమాలో కార్తీ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ లో కనిపించారు ‘సర్దార్ 2’ ట్రైలర్ లో తండ్రి పాత్రను ప్రధానంగా ఆవిష్కరించారు. ఫ్లాష్ బ్యాక్ లో చంద్రబోస్ అనే వ్యక్తి ఏజెంట్ సర్దార్ గా ఎలా మారాడు? అతను చేపట్టిన సీక్రెట్ మిషన్ ఏంటి? అనేది చూపిస్తూనే.. ప్రజెంట్ తనయుడు విజయ్ ప్రకాష్ తో కలిసి ఏదో మిషన్ కోసం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. బ్లాక్ డాగర్ అనే విలన్గా ఎస్జే సూర్య నటించారు. మాళవిక మోహనన్ ఏజెంట్ గా యాక్షన్ రోల్ లో కనిపించగా, కార్తీ భార్యగా రజిషా విజయ్ నటించారు. కొడుకు పాత్రకు జోడీగా ఆషికా రంగనాథ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్, విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ప్రిన్స్ పిక్చర్స్ – ఐవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రూపొందుతున్న ‘సర్దార్ 2’ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చారు. జార్జి సి. విలియమ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాని తెలుగులో ఈనెల 10న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
