బుర్రకథ కళాకారిణి జీవితం ‘గరివిడి లక్ష్మి’


బుర్రకథతో ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలూగించి, చివరికి కన్నీళ్ళు పెట్టించే కళాకారిణి జీవితం ‘గరివిడి లక్ష్మి’సినిమా. ఆనంది, వీకే నరేష్, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద కృతి ప్రసాద్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఈ సినిమాని గౌరి నాయుడు జమ్ము తెరకెక్కించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విశెషాలు..

కథ:
విజయనగరం జిల్లాలోని గరివిడి గ్రామంలో ఈ కథ అంతా సాగుతుంది. గరివిడి గ్రామంలో దేవుడమ్మ (రాశి) కూతురు లక్ష్మి (ఆనంది). సన్యాసం తీసుకోవడంతో దేవుడమ్మ తన భర్తకు వేరే పెళ్లి చేసి పంపిస్తుంది. అప్పటి నుంచి లక్ష్మిని దేవుడమ్మే చూసుకుంటుంది. కానీ నాన్న దూరమైన లక్ష్మి ఒంటరిగా బాధను అనుభవిస్తుంటుంది. అలా కొన్నేళ్లకు లక్ష్మికి పెళ్లి చేస్తుంది దేవుడమ్మ. కానీ ఆ పెళ్లి రెండు నెలలకే పెటాకులవుతుంది. అలా ఒంటరిగా ఉన్న లక్ష్మి జీవితంలోకి బుర్రకథ వస్తుంది. బుర్రకథ ద్వారా లక్ష్మి జీవన ప్రయాణంలో వచ్చిన మార్పులు ఏంటి? ఈ క్రమంలో పరిచయమైన సత్తిబాబు (రామ్ మయూర్), రాంబాబు (నరేష్) వల్ల లక్ష్మి జీవితం ఎటు వైపు వెళ్తుంది? అందరికీ దూరంగా అజ్ఞాతంలోకి గరివిడి లక్ష్మి ఎందుకు వెళ్తుంది? గరివిడి లక్ష్మి జీవితాన్ని కథగా తీయాలని, ఆమె గొప్పదనాన్ని ప్రపంచాన్ని పరిచయం చేయాలనే ప్రయత్నం రాజేష్ (అంకిత్ కొయ్య) తన గమ్యాన్ని చేరుతాడా? అన్నదే కథ.
గరివిడి లక్ష్మి కథను తెరపైకి తీసుకు రావాలి.. ఆమె కోల్పోయిన గుర్తింపుని, ఆమె నుంచి లాక్కున్న ఆ గుర్తింపుని తిరిగి ఆమెకు ఇప్పించాలని, ఆమె గొప్పదనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనే దర్శకుని ప్రయత్నాన్ని అయితే కచ్చితంగా అభినందించాలి. అయితే ఆ ప్రయత్నం తెరపైకి వచ్చినప్పుడు పూర్తిగా ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదన్నట్టుగా కనిపిస్తుంది. ఆమె జీవితంలో సినిమాకి కావాల్సినంత డ్రామా, కథలో వ్యథ ఇలా అంతా ఉంది. గ్రామీణ స్థాయి నుంచి ఉత్తరాంధ్రను ఊపేసే స్థాయికి వెళ్లడం, నమ్మిన వాళ్ల చేతిలోనే మోసపోవడం, అందరూ తన పేరుని వాడుకుని చివరకు తననే అనాథలా మూలకు వదిలేయడం. ఇలా కావాల్సినంత డ్రామా ఉంది. మామూలుగానే బయోపిక్ అంటే ఇప్పుడు అంతా కూడా ‘మహానటి’ మూవీతో పోల్చుతారు. ఈ సినిమాలోనూ అదే టెంప్లెట్ వాడుతారు. గరివిడి లక్ష్మి కోసం ఇద్దరు యాస్పిరెంట్ యంగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ వెతకడం.. మెల్లిగా కథలోకి తీసుకు వెళ్లడం.. చిన్న చిన్నగా లక్ష్మి కథను రివీల్ చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుంది.

ఫస్ట్ హాఫ్ అంతా లక్ష్మి ప్రయాణమే కనిపిస్తుంది. లక్ష్మి జీవితంలోకి బుర్రకథ ఎంట్రీ ఇవ్వడం, నేర్చుకోవడం, స్టేజ్ మీద మొదటి పర్ఫామెన్స్ ఇవ్వడం, అవమానాలు ఇలా అన్నీ ముందుకు సాగుతుంటాయి. ఇక గరివిడిలక్ష్మిగా మారడంతో కథ సగభాగం పూర్తవుతుంది. సెకండాఫ్‌లో గరివిడిలక్ష్మి వైభవాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. ఆమె పేరుని, గాత్రాన్ని చివరకు సినీ ప్రముఖులు కూడా ఎంతలా వాడుకున్నారు.. తన పేరు చెప్పుకుని ఎవరెవరికే స్టేజ్ మీదే ప్రభుత్వ పురస్కారాలు అందుకోవడం ఇవన్నీ మనసుని కదిలిస్తుంటాయి. నమ్మిన వారే మోసం చేయడం, చివరకు అన్నీ కోల్పోయి అనాథగా మిగలడం ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించేలా ఉంటాయి. క్లైమాక్స్ గుండెల్ని హత్తుకునేలా ఉంటుంది.

టెక్నికల్‌గా:
టెక్నికల్‌గా చూసుకుంటే మాత్రం సినిమా పర్వాలేదు. అయితే క్యాస్టూమ్స్, ఆర్ట్, సెట్, కెమెరా ఇలా ఏది తీసుకున్నా కూడా.. 1970, 80, 90ల కాలాన్ని చూపించినట్టుగా అనిపించదు. పాటలు మాత్రం థియేటర్లో ఊపును తీసుకు వస్తాయి. మాటలు అంత గొప్పగా అనిపించవు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి.

నటన:
ఆర్టిస్టుల విషయానికి వస్తే.. ఆనంది చక్కగా నటించింది. గరివిడి లక్ష్మి పాత్రకు న్యాయం చేసిందనే చెప్పుకోవచ్చు. అయితే పాటలు వచ్చినప్పుడు ఆనంది గొంతు, అభినయం కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కానీ పోను పోను ఆనంది తన నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. రాగ్ మయూర్‌కి మంచి సపోర్టింగ్ రోల్ దక్కింది. నరేష్‌కి మరో గొప్ప కారెక్టర్ వచ్చింది. రాశి, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, షకలక శంకర్, ఎల్బీ శ్రీరాం తదితరులు పోషించిన అన్ని పాత్రలు మెప్పిస్తాయి.

నటులు:ఆనంది, నరేష్, రాగ్ మయూర్, రాశి
దర్శకుడు:గౌరి నాయుడు జమ్ము.

Scroll to Top