‘క్రేజీ’ తగ్గిన ‘కళ్యాణం’


అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తాజాగా వచ్చిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’.. ఈ సినిమాలో అఖిల్ రాజ్, తరుణ్ భాస్కర్, వీకే నరేష్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి భద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విశెషాలు ఇవీ:

కథ:
మెదక్‌లోని ఓ గ్రామంలో పర్వతాలు (నరేష్) కాస్త మంచి పేరు, గౌరవంతో జీవనం సాగిస్తుంటాడు. పెద్దల్లుడు బాలరాజు (తరుణ్ భాస్కర్) తాగుడు, వాగుడుతో ఊర్లో పర్వతాలు పరువు గాల్లో కలిసిపోతుంటుంది. ఈ క్రమంలో చిన్న కూతురు కీర్తి (అనుపమ)కి మంచి సంబంధం తీసుకు రావాలని అనుకుంటూ ఉంటాడు. కానీ చిన్న కూతురు కీర్తి మాత్రం ఉద్యోగం సంపాదించాలి.. తన కాళ్ల మీద తాను నిలబడాలని అనుకుంటుంది. ఇంకో వైపు కీర్తికి ఉదయ్ (అఖిల్ రాజ్) అంటే కూడా ఇష్టమే. కానీ అమ్మానాన్నల మాటని కాదని కీర్తి ఏ పనీ చేయదు. అలాంటి కీర్తికి తండ్రి ఓ ఎన్నారై సంబంధాన్ని తీసుకు వస్తాడు. ఆ తర్వాత కీర్తి ఏం చేస్తుంది? పరువు కోసం పర్వతాలు ఏం చేస్తాడు? పెద్దల్లుడు దారికి వచ్చేది ఎప్పుడు? కీర్తి తన కలల్ని నెరవేర్చుకుందా? తన ప్రేమను గెలిపించుకునేందుకు ఏం చేస్తుంది? అన్నదే కథ.

క్రేజీ కళ్యాణం సినిమా చూసేటప్పుడు ఇది పీరియాడిక్ సినిమానా? లేదంటే ప్రజెంట్ టైంలో జరిగే కథనా? అన్న అనుమానం వస్తుంది. ఒక్కోసారి ఇది పాత కాలం చిత్రం అన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొన్ని సార్లు మోడ్రన్ టైంలోనే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే అమ్మాయిల్ని ఎలా పెంచాలి.. వాళ్లకి ఆర్థిక స్వేచ్ఛ ఎంత అవసరం? పెళ్లికి పెట్టే ఖర్చులో పదో వంతు వారి చదువులకు పెట్టినా వారి జీవితం బాగు పడుతుంది.. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచించాలి అనే సందేశాన్ని ఇవ్వాలని దర్శకుడు అనుకున్నట్టుగా కనిపిస్తోంది. కానీ సందేశం బాగానే ఉన్నా.. ఆ మెసెజ్‌ని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు రాసుకున్న కథ, తీసిన విధానం సరిపోలేదనిపిస్తుంది.

నవ్వులు పూయిస్తూ:
ఫస్ట్ హాఫ్ అంతా కూడా నరేష్, తరుణ్ భాస్కర్ ట్రాక్‌తో నవ్వులు పూయించారు. తాగుబోతు అల్లుడు చేసే వీరంగం, ఊర్లో పర్వతాలు పరువు పోవడం వంటి సీన్లతో ముందుకు సాగుతుంది. ఇక కీర్తి, ఉదయ్ ప్రేమ కథ అయితే కొత్తగా అనిపించదు. ఈ లవ్ ట్రాక్ జనాలకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇక ఎన్నారై సంబంధం టాపిక్ వచ్చిన తర్వాత కథలో ఏమైనా సంఘర్షణ, ఇంట్రెస్ట్ పెరుగుతుందని ఆడియన్స్ ఆశిస్తారు. కానీ వారికి ఆశాభంగమే ఎదురవుతుంది. ఇక సెకండాఫ్‌లో ఎమోషనల్ పార్ట్ ఏమైనా కనెక్ట్ అవుతుందని అనుకుంటే.. అక్కడా నిరాశే కలుగుతుంది. ప్రేమ సీరియస్‌గా అనిపించదు. తండ్రీకూతుళ్లు సెంటిమెంట్ మాత్రం ప్రీ క్లైమాక్స్‌లో హత్తుకునేలా ఉంటుంది. పెళ్లి సీన్‌లో అమ్మ చనిపోయిన బాధను బయటకు రానివ్వకుండా నరేష్ చేసిన సీన్ బాగుంటుంది. చివరి 20 నిమిషాలు కాస్త ఎమోషనల్‌గా అనిపిస్తుంది. కానీ పూర్తి సినిమాగా చూస్తే అంత గొప్పగా అనిపించదు. అందరికీ కనెక్ట్ అయ్యేలా తీయడం, ఎమోషనల్ డెప్త్ చూపించడంలో మేకర్స్ పూర్తిగా సక్సెస్ అవ్వ లేదనిపిస్తుంది. కూతురికి పెళ్లి చేసి గొప్పింటి అల్లుడిని తెచ్చుకోవడంలో కాదు.. గొప్పగా చదివించి.. ఊరంతా చెప్పుకునే స్థాయిలో పెంచడంలోనే అసలైన ఇజ్జత్, గౌరవం ఉందని చెప్పడం మాత్రం బాగుంది.

నటన:
ఆర్టిస్టుల విషయానికి వస్తే అనుపమ, నరేష్ తర్వాతే ఇతర ఆర్టిస్టుల గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా మొత్తం ఈ ఇద్దరి డామినేషన్ కనిపిస్తుంది. ప్రతీ సీన్‌లో ఈ ఇద్దరే కనిపిస్తారు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ మెప్పిస్తాడు. ఆ తర్వాత అఖిల్ రాజ్, కిరిటీ దామరాజు వంటి వారు వస్తారు. కీర్తి అక్క, నాయనమ్మ ఇలా మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పిస్తారు.

టెక్నికల్‌గా:
టెక్నికల్‌గా సురేష్ బొబ్బిలి పాటలు, నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. కెమెరా వర్క్ నేచురల్‌గా ఉంటుంది. గ్రామీణ వాతావరణాన్ని చక్కగా చూపించారు. క్యాస్టూమ్, ఎడిటింగ్, ఆర్ట్ ఇలా అన్నీ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ పరంగా పెద్ద ఖర్చు ఏమీ కూడా తెరపై కనిపించదు. తక్కువ బడ్జెట్‌లోనే సినిమాను తెరకెక్కించినట్టు అనిపిస్తుంది.

నటులు:అనుపమ, వీకే నరేష్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్
దర్శకుడు:భద్రప్ప గాజుల

Scroll to Top