
అభిమానులను అలరించే ఓం (ఆపరేషన్ మోల్)
***********************************
తమిళ నటుడు ధనుష్ నటించిన చిత్రాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఇక సాయి పల్లవికి అయితే ఇక్కడున్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఓటీటీలో మమ్ముట్టి చిత్రాలకు ఫుల్ గిరాకీ ఉంటుంది. ఇలాంటి స్టార్ క్యాస్టింగ్‌తో రాజ్ కుమార్ మ్యాజిక్ చేసి అభిమానులను అలరించిన సినిమా ‘ ఓం (ఆపరేషన్ మోల్) చాప్టర్ 1 ’ తాజాగా విడుదలైన ఈ సినిమా విశెషాలు..
కథ
ఆంధ్రా, తమిళ బార్డర్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్, కూలీల కాల్పుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కూలీల చేతిలో అతి దారుణంగా చనిపోయిన ఫారెస్ట్ ఆఫీసర్ కూతురు ఐపీఎస్ అధికారి నిత్యా రెడ్డి (సాయి పల్లవి). 2014లో ప్రత్యేక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి సపరేట్ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేస్తారు. ఆ టీంని నిత్యా రెడ్డి లీడ్ చేస్తుంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ దాని మూలాల్ని పూర్తిగా అంతం చేయాలని ఆపరేషన్ మోల్ను ప్రారంభిస్తుంది. ఇందులో భాగంగానే పళని అలియాస్ తిరు (ధనుష్).. బర్మా కార్తికేయన్ (మమ్ముట్టి) గ్రూపులో జాయిన్ అవుతాడు. పళని ఓ పోలీస్ ఆఫీసర్ అని తండ్రి షణ్ముగం, భార్య రోజా (శ్రీలీల), కొడుకు అఘరకి కూడా తెలీదు. దీంతో పళని మీద రోజా ఎప్పుడూ కస్సుబుస్సులాడుతూనే ఉంటుంది. అండర్ కవర్ ఆపరేషన్‌లో తిరు నిమగ్నం అవుతాడు. కార్తికేయన్ ద్వారా స్మగ్లింగ్ హెడ్ అబ్దుల్ హమీద్ (నసీరుద్దీన్ షా), అతని భాగస్వామి గోవర్దన్ రెడ్డి (శివాజీ రాజా)లను ట్రాక్ చేస్తారు. ఈ క్రమంలోనే పళని తండ్రిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారు. తన తండ్రి చావుకి పళని ప్రతీకారం తీర్చుకుంటాడా? తన కర్తవ్యం కోసం పోరాడుతాడా? చివరకు ఈ స్మగ్లింగ్ ముఠాను పట్టుకుంటాడా? అమాయకులైన కూలీలపై జరిగే దారుణాన్ని పళని అడ్డుకుంటాడా? చివరకు నిత్యా రెడ్డికి ఏం జరుగుతుంది? ఈ కథలో అమల (రేణూ దేశాయ్) ఇంపార్టెన్స్ ఏంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
రాజ్ కుమార్ పెరియస్వామి ‘అమరన్’ కోసం ఎంచుకున్న కథలో క్లారిటీ ఉంటుంది. దేశ సైనికుడు, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాడు.. అలా ప్రాణాలు అర్పించే ప్రతీ సైనికుడు వెనకాల కన్నీరు కార్చే కుటుంబం ఉంటుంది.. వారి త్యాగం గొప్పది అని చూపించాడు. అందులో కథ, ఎమోషన్ అన్నీ క్లారిటీగా ఉంటాయి. కానీ ‘ఓం’ విషయానికి వస్తే అదే కొరవడుతుంది. పూర్తిగా కూలీల కోసం తీసినట్టు అనిపించదు.. స్మగ్లింగ్ మాఫియాను మట్టుబెట్టే అండర్ కవర్ ఏజెంట్ సినిమాలానూ కనిపించదు..అయితే అభిమానుల కోసం తీసిన సినిమాగా ‘ఓం’ని రాజ్ కుమార్ తయారు చేసినట్టు అనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ అంతా అండర్ కవర్ ఏజెంట్‌గా విలన్ గ్యాంగ్‌లో హీరో చేరడం.. విలన్ సీక్రెట్లను, వారి కూపీ లాగే ప్రయత్నం ఇవన్నీ ఎంతో ఇంట్రెస్టింగ్గా చూపించొచ్చు. కానీ అతను అసలు విలన్ కాదు.. మంచివాడు అని ప్రొజెక్ట్ చేయడం.. పరిస్థితుల వల్ల అతను స్మగ్లింగ్ చేయాల్సి వచ్చింది అని చూపించడం.. ఇలా లేయర్లుగా కథను చెప్పుకుంటూ పోవడంతో అక్కడ ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. ఇదంతా సాధారణంగానే ఉందో.. ఇందులో ఇంకేం ఉంటుందని అనుకునే టైంకి ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్ ఇస్తాడు. ఆ తర్వాత హీరో తన పంథాని మార్చుకుంటాడని ఆశిస్తారంతా. అలా సెకండాఫ్ కోసం ఎంతో క్యూరియస్తో ఆడియెన్స్ ఎదురు చూస్తారు. కానీ అలా ప్రేక్షకుడు ఊహించినట్టుగా సాగదు. వ్యక్తిగత పగ కాదు.. కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, అందుకే ఈ నేరాలకు మూలాల్ని కట్టడి చేయాలని చెప్పడం బాగానే ఉంటుంది. కానీ అక్కడ కథ మరింత నీరసంగా సాగుతుంది. అయితే అడవిలో వీరా వీరా సాంగ్ ప్లేస్మెంట్, అక్కడ సాయి అభ్యంకర్ కొట్టిన బీజీఎం, ఆ పాట.. వర్త్ వర్మ వర్త్ అనేలా ఉంటుంది. ప్యూస్ మాస్ గూస్ బంప్స్‌లా ఆ పాట ఉంటుంది. సెకండాఫ్‌కి అదొక్కటే ప్లస్ పాయింట్ అన్నట్టుగా ఉంటుంది.
ఆర్టిస్టుల విషయానికి వస్తే.. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి గురించి ముందుగా చెప్పాల్సి వస్తుంది. ఈ ముగ్గురూ ముగ్గురే అన్నట్టు నటించారు. ధనుష్ అండర్ కవర్ ఏజెంట్‌గా, ఫ్యామిలీ మెన్లా రెండింట్లోనూ వేరియేషన్స్ చూపించాడు. అయితే మమ్ముట్టికి మాత్రం ఇదేమీ కొత్త పాత్ర, డిఫరెంట్ రోల్ అన్నట్టుగా ఉండదు. పూర్తిగా చెడ్డవాడు కాదు అన్నట్టు చూపిస్తారు. సాయి పల్లవి పోలీస్ ఆఫీసర్‌గా బాగుంది. క్లైమాక్స్‌లో ఫైట్ బాగానే చేస్తుంది. శ్రీ లీల పాత్ర ఉందంటే ఉందన్నట్టుగా ఉంటుంది. పెద్ద ఇంపాక్ట్ చూపించదు. రేణూ దేశాయ్ పాత్రని చూస్తే జాలి వేస్తుంది. శివాజీ రాజాకి కాస్త పెద్ద రోల్ దక్కినట్టు అనిపిస్తుంది. నసీరుద్దీన్ షా పాత్ర ప్రభావం చూపించదు. చైతన్య జొన్నలగడ్డకి మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది. మిగిలిన తమిళ ఆర్టిస్టులు అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు.
టెక్నికల్‌గా చూసుకుంటే ఓం సినిమా బ్రిల్లియంట్‌గా అనిపిస్తుంది. విజువల్స్ ఎంతో నేచురల్‌గా ఉంటాయి. సాయి అభ్యంకర్ ఇచ్చిన వీర సాంగ్‌కి, బీజీఎంకి శభాష్ అనొచ్చు. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. క్యాస్టూమ్స్ కూడా బాగున్నాయి. మిగతా అన్ని క్రాఫ్ట్‌లు సమర్థవంతంగా పని చేశాయి. నిర్మాణ విలువలు గొప్పగా అనిపిస్తాయి.
నటులు:ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల
దర్శకుడు:రాజ్ కుమార్ పెరియసామి
