
పూర్తిగా కంటెంట్ ఉన్న సినిమాలను తీస్తూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెప్పిస్తున్న హీరో విజయ్ ఆంటోని. ఇటీవల వంద దేవుళ్లు, మార్గన్, బిచ్చగాడు 2 లాంటి చిత్రాలతో అలరించారు. అయితే ఇప్పుడు మరోసారి కంటెంట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు విజయ్ ఆంటోని.. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అప్పా కుట్టీ’ తెలుగులో ‘నాన్న కుట్టి’. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల ఇదే ఎమోషన్ తో వచ్చిన మాస్ మహారాజ రవితేజ ‘ఇరుముడి’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగులోనూ ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగులో నాన్న కుట్టి అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ అక్టోబర్ 16 న విడుదలకు సిద్ధం అయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది.
నాన్న కుట్టి మూవీకి ము. మారన్ దర్శకత్వం వహించారు. ఇక విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ చూస్తే యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని దర్శకుడు మారన్ తెరకెక్కించినట్లు స్పష్టం అవుతోంది. ఇక నాన్న కుట్టి సినిమాలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్ , హరిప్రియ, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, జాన్సన్ దివాకర్, కుమార్ నటరాజన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఇక ఈ మూవీకి హీరోతో పాటు విజయ్ ఆంటోనీ సంగీతం అందించడం విశేషం. అంతేకాకుండా ఈ మూవీకి ఎడిటర్ కూడా ఆయనే కావడం విశేషం.
