సైంధవ్‌గా వస్తున్న వెంకటేష్‌

అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ తన ల్యాండ్‌మార్క్‌ 75వ చిత్రం కోసం ‘హిట్‌’ సిరీస్‌తో విజయాల్ని అందించిన డైరెక్టర్‌ శైలేశ్‌ కొలనుతో కలిసి ముందుకువస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై వెంకట్‌ బోయనపల్లి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సైంధవ్‌’ అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ ఖరారు చేశారు. వెంకటేష్‌ పవర్‌ ఫుల్‌ లుక్‌లో చేతిలో తుపాకీ పట్టుకుని టెర్రిఫిక్‌గా కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కారు, పేలుడును కనిపిస్తోంది. టైటిల్‌ పోస్టర్‌ ‘సైంధవ్‌’లో యాక్షన్‌ ఎక్కువగా ఉంటుందని, వెంకటేష్‌ ఇంటెన్స్‌ పాత్రలో నటిస్తున్నారని చెప్పకనే చెబుతోంది.

వెంకటేష్‌ ఒక మెడిసన్‌ వయాల్‌ ఉన్న కూల్‌ బాక్స్‌తో చంద్రప్రస్థ అనే ఓడరేవు ప్రాంతంలోకి ఎంటరై, అక్కడ కంటైనర్‌ నుంచి తుపాకీని బయటకు తీస్తాడు. చివరగా గూండాల గ్యాంగ్‌ని ఉద్దేశించి.. ‘నేనిక్కడే ఉంటార్రా… ఎక్కడికి వెళ్ళను… రమ్మను…’ అంటూ హెచ్చరించడం గ్లింప్స్‌లో ప్రజెంట్‌ చేశారు. గ్లింప్స్‌ సినిమా స్వభావం, దాని టోన్‌, ఇందులో వెంకటేష్‌ ఎలాంటి పాత్ర చేయబోతున్నారో చూపించింది. త్వరలోనే షూటింగ్‌ని ప్రారంభిస్తామని కూడా మేకర్స్‌ ప్రకటించారు. గ్లింప్స్‌ వీడియోకి అద్భుతమైన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించిన సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ సినిమా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ నుండి ప్రొడక్షన్‌ నెం 2.గా రానుంది. ‘శ్యామ్‌ సింగరాయ్’తో నిర్మాణంలో విజయవంతంగా అడుగుపెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే భారీ స్థాయిలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇది వెంకటేష్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా ఉండనుందని మేకర్స్‌ తెలిపారు.

ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఎస్‌ మణికందన్‌ కెమెరామెన్‌గా, గ్యారీ బిహెచ్‌ ఎడిటర్‌గా, అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్‌ తాళ్లూరు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Scroll to Top