
రియల్ స్టార్ గా గుర్తింపు పొందిన నాని, శ్రీకాంత్ కాంబోలో వచ్చిన సినిమా ‘ది ప్యారడైజ్’. నాని మేకోవర్, శ్రీకాంత్ ఓదెల మేకింగ్ ఇవన్నీ అభిమానులను మెపిస్తాయని తాజాగా విడుదలైన సినిమా ‘ది ప్యారడైజ్’ మరోసారి రుజువుచేసింది.
కథ :
షికాంజ మాలిక్ (మోహన్ బాబు) గుప్పిట్లో వలస వచ్చిన సవారీల జాతి నలిగిపోతుంటుంది. భారత ప్రభుత్వంలో తమకి కూడా గుర్తింపు కావాలని ఆ జాతి తరుపున సమ్మక్క (సోనాలి కులకర్ణి) పోరాడుతూ ఉంటుంది. సమ్మక్క తప్పుడు మనిషి అని షికాంజ మాలిక్ ఆమె కొడుకు జడల్ (నాని) చేతిపై పచ్చబొట్టు వేయిస్తాడు. తన తల్లి చెడ్డది అన్న కోపంతో చిన్నతనం నుంచీ జడల్ గాడు రగిలిపోతూ ఉంటాడు. చిన్న వయసులోనే మాలిక్ మనిషిని చంపి జడల్ గాడు జైలుకి వెళ్తాడు. షికాంజ మాలిక్ తన సామ్రాజ్యాన్ని తన కొడుకు విక్రమ్ మాలిక్ (రాఘవ్ జుయాల్)కి అప్పగిస్తాడు. అదే సమయంలో జడల్ జైలు నుంచి రిలీజ్ అయి వస్తాడు. షికాంజ మాలిక్ మీద పగతో రగిలిపోతోన్న జడల్ ఏం చేస్తాడు? తల్లిని ద్వేషించే జడల్ అమ్మ ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? ఈ క్రమంలో విక్రమ్ మాలిక్‌ని జడల్ ఏం చేస్తాడు? ఈ కథలో సుబ్బు (కయాదు లోహర్), బిర్యానీ (సంపూర్ణేశ్ బాబు) పాత్ర ఏంటి?, గుర్తింపు కోసం సమ్మక చేసిన పోరాటానికి జడల్ నాయకత్వం వహించేందుకు ముందుకు వస్తాడా? చివరకు సవారీల జాతికి గుర్తింపు లభించిందా? లేదా? అన్నదే కథ.
ప్యారడైజ్ కథ కొత్తదేమీ కాదు. గుర్తింపు కోసం పోరాడే ఓ గుంపు, సమూహం చేసే పోరాటాన్ని ఇది వరకు ఎన్నో చిత్రాల్లో చూసే ఉంటాం. అందరినీ గుప్పిట్లో పెట్టుకునే ఓ క్రూరుడు, వాడి కింద నలిగే ఓ సమూహం. అందులోంచి పుట్టుకొచ్చే నాయకుడు, చివరకు ఆ నాయకుడు ఆ సమూహానికి స్వాతంత్ర్యం ఇప్పించడం.. సమాజంలో గుర్తింపుని ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్‌గా చెప్పుకుంటే ప్యారడైజ్ కథ ఇదే. కానీ ఇలాంటి కథకు జడల్ అని పాత్రను క్రియేట్ చేయడం, షికాంజ మాలిక్‌ని డిజైన్ చేసుకోడం, విలనిజం, హీరోయిజంకి సంబంధించిన సీన్లను కాస్త డిఫరెంట్‌గా రాసుకోవడం మాస్ కి ట్రీట్ ఇచ్చేలా తెరకెక్కించడంలో శ్రీకాంత్ ఓదెల సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అదే ఈ సినిమాకి ప్రధానంగా కలిసి వచ్చే అంశం.
తెలంగాణ నేపథ్యం:
ప్యారడైజ్ తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమానే అయినా హీరో మాట్లాడే తీరు మాత్రం తెలంగాణ యాసలా అనిపించదు. హీరో మాత్రమే కాకుండా చాలా పాత్రలు మాట్లాడేది తెలంగాణ యాసేనా? అని అనుమానం వస్తుంది. చాప్టర్‌ల వైజ్‌గా ఈ కథను విడగొట్టి శ్రీకాంత్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంట్రడక్షన్‌లో భాగంగా పెట్టిన జైల్ ఫైట్‌ని చూస్తేనే ఇదేదో క్లైమాక్స్ ఫైట్‌లా ఉందే అనిపిస్తుంది. ఇందులో హీరోయిన్ ట్రాక్ కాస్త పక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది. ఇక అక్కడ తల్లీకూతుళ్ల సీన్స్ అయితే అస్సలు బాగోలేవు. మళ్లీ విక్రమ్ మాలిక్ పాత్ర ఎంట్రీ.. హీరో, విలన్ తలపడే సీన్స్.. ఇంటర్వెల్ బ్లాక్ ఇలా అంతా కూడా పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్ ఫైట్ అయితే నెక్ట్స్ లెవెల్ అనిపిస్తుంది.
సాదాసీదాగా:
సెకండాఫ్ ఎలా ఉంటుందో అని ఊహిస్తూ ప్రారంభించే ప్రేక్షకుడికి మోహన్ బాబు రూపంలో సర్ ప్రైజ్ ఇప్పించేస్తాడు శ్రీకాంత్ ఓదెల. అక్కడ ఐదారు నిమిషాలు మోహన్ బాబు విశ్వరూపం, క్రూరత్వం చూపిస్తాడు. ఆ తర్వాత మళ్లీ కథ కాస్త డీలా పడిపోయినట్టు అనిపిస్తుంది. మళ్లీ హీరో కమ్ బ్యాక్ ఇచ్చి మాలిక్ ఇంట్లో సృష్టించే విధ్వంసం, పూనకం వచ్చినట్టు ఊగుతూ చేసిన రక్తపాతం ఓ రేంజ్‌లో ఉంటుంది. అక్కడి వరకు సినిమా బాగున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు, తమని తామనే స్వతంత్రులుగా ప్రకటించుకోవడం, తుపాకీలు పెట్టి బెదిరించి విద్య, వైద్యాన్ని తమ వద్దకు తెచ్చుకునే ఈ సీన్లన్నీ సాదాసీదాగా సాగుతూ వెళ్తుంటాయి.
ఇక శేఖరన్న పాత్రలో ప్రియదర్శి పాత్ర ఎంట్రీ, సవారీలను టెర్రరిస్టులుగా ముద్ర వేయడం ఇవన్నీ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వవు. అప్పుడే పుట్టిన చిన్న పాప చుట్టూ రాసుకున్న ఎమోషన్స్, తీసిన యాక్షన్ సీక్వెన్స్, అప్పుడు అనిరుధ్ ఇచ్చే బీజీఎం, అక్కడ వచ్చే ఆయా షేర్ పాట రోమాల్ని నిక్కబొడిచేలా చేస్తుంది. చివరకు మదర్ సెంటిమెంట్‌తో ఆడియెన్స్ ఏడ్పించేస్తాడు. ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై సెకండాఫ్ ఇవ్వలేకపోయినా.. ఎండింగ్ మాత్రం కడుపునిండా బిర్యానీని పెట్టినట్టు అనిపిస్తుంది. అయితే శ్రీకాంత్ మాత్రం ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ మీదే ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది.
టెక్నికల్ గా :
టెక్నికల్ టీం గురించి చెప్పాల్సి వస్తే.. ముందుగా యాక్షన్ సీక్వెన్స్ భారీ స్థాయిలో ఉంటాయి. శృతి మించిన వైలెన్స్ చిరాకు తెప్పిస్తుంది. ఆయా షేర్, ఏష నాగుల పాటలు అయితే సింగిల్ స్క్రీన్స్‌ని అల్లాడించేస్తాయి. అమ్మలా చూసుకుంటావ్ అనుకున్నా.. కానీ అమ్మలా అవుతావ్ అని అనుకోలేదు.. ఈ జన్మ పోరాటానిది.. వచ్చే జన్మ మనది అంటూ శ్రీకాంత్ రాసిన డైలాగ్స్ చాలా వరకు మనసుల్ని తాకుతాయి. ప్యారడైజ్ సెట్ ఎంతో నేచురల్‌గా అనిపిస్తుంది. క్యాస్టూమ్స్ అప్పటి కాలానికి తీసుకు వెళ్తాయి.
నటన:
ఆర్టిస్టుల విషయానికి వస్తే నాని తన లుక్స్, మ్యానరిజంతో మరోసారి మెప్పిస్తాడు. షికాంజ మాలిక్‌గా మోహన్ బాబు విశ్వరూపం చూపిస్తాడు. రాఘవ్ జుయల్ పాత్ర నిడివి తక్కువే. కానీ ఉన్నంతలో తన మార్క్ చూపిస్తాడు. సమ్మక్కగా సోనాలి పాత్ర బాగుంటుంది. ఈశ్వరీ రావు, సంపూర్ణేశ్ బాబు, సత్య ప్రకాష్, సత్యరాజ్, తణికెళ్ల భరణి, విషిక ఇలా అందరూ తమ తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు.
నటులు:నాని, మోహన్ బాబు, కయాదు లోహర్, సంపూర్ణేశ్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయాల్
దర్శకుడు:శ్రీకాంత్ ఓదెల
