
మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, సాత్విక వీరవల్లి హీరోయిన్గా శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో పవన్ సాధినేని తెరకెక్కించిన చిత్రం ‘ ఆకాశంలో ఒక తార ’. ఈ సినిమాని తాజాగా విడుదల చేశారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ నిర్మించింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచిన ఈ సినిమా విశెషాలు…
కథ
పాలలంక అనే కుగ్రామంలో చదువుతున్న కల్పన (సాత్విక వీరవల్లి) ఆస్ట్రోనాట్ అవ్వాలని కలలు కంటుంది. కానీ ఆమె తండ్రి శివయ్య (కోట జయరాం) మాత్రం ఆడపిల్లకు చదువులు ఎందుకు అని చితకబాదేస్తుంటాడు. పదో తరగతి పరీక్షలు రాయకుండా అడ్డు పడతాడు. కానీ కల్పన తల్లి మాత్రం భర్తను అడ్డుకుని కూతురుని పరీక్షలకు పంపిస్తుంది. ఆ తర్వాత కృష్ణ (దుల్కర్ సల్మాన్)తో కల్పన పెళ్లి చేసేస్తాడు తండ్రి శివయ్య. భార్య కోరికను తెలుసుకున్న కృష్ణ అటు వైపుగా అడుగులు వేయిస్తాడు. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయి అక్కడ కష్టపడుతూ భార్యను చదివిస్తూ ఉంటాడు. అలా కల్పన ఎంతో కష్టపడి చదివి ఐఐటీలో ఏడో ర్యాంక్‌ని సాధిస్తుంది. కల్పన పై చదువుల కోసం కృష్ణ గుజరాత్ వెళ్లి కష్టపడుతుంటాడు. కల్పన తన లక్ష్యం దిశగా కష్టపడుతుంటుంది. అలా రాకెట్ సైన్స్‌లో కల్పన ఓ ప్రయోగం చేస్తుంది. ఆ ప్రయోగం విఫలం అవుతుంది. దాంతో ఆమెని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత కల్పన ప్రయాణం ముందుకు ఎలా సాగుతుంది? అంతరిక్షంలోకి వెళ్లాలి.. ఆస్ట్రోనాట్ అవ్వాలని కలలు కన్న కల్పన జీవితం ఎలా మారుతుంది? కల్పన కల నెరవేర్చడం కోసం కృష్ణ ఏం చేశాడు? ఈ కథలో రోహిణి (శ్రుతి హాసన్) పాత్ర ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
ఓ ఇన్ స్పైరింగ్ కథ
‘ఆకాశంలో ఒక తార’ కథ ఏంటి? అన్నది టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. రోడ్డు సౌకర్యం కూడా లేని ఓ గ్రామం, అందులో ఒక అమ్మాయి ఆస్ట్రోనాట్ అవుతాను.. అంతరిక్షంలోకి వెళ్తాను అని చెప్తే.. ఈ సమాజం ఎలా చూస్తుంది.. ఎలా నవ్వుకుంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముందుగా ఇంట్లో వాళ్లే అలాంటి వాటికి సహకరించరు. అలాంటి ఓ అమ్మాయి తన పట్టుదలతో, భర్త సహకారంతో అంతరిక్షంలోకి ఎలా వెళ్లింది.. ఆమె చేసిన ఈ ప్రయాణమే ‘ఆకాశంలో ఒక తార’. ఆరంభం, ముగింపు ఏంటి? అన్నది ముందే తెలిసిపోతుంది. అయినా సరే రెండున్నర గంటల సేపు కథలో లీనమై ప్రయాణం చేయించడమే దర్శకుడికి సవాల్‌తో కూడుకున్న ప్రయాణం.
క్లీన్ అండ్ నీట్ సినిమాగా
దర్శకుడు పవన్ సాధినేని ఇలాంటి ఓ ఇన్ స్పైరింగ్ కథను ఎంతో క్లీన్‌గా, నీట్‌గా తెరకెక్కించాడు. ఇందులో కమర్షియల్ అంశాలు కూడా జొప్పించొచ్చు. కానీ పవన్ సాధినేని మాత్రం హానెస్ట్‌గా కథను చెప్పాలని ప్రయత్నించాడు. ఎక్కడా డీవియేట్ కాకుండా.. ఒక్క అసభ్యకరమైన సన్నివేశం పెట్టకుండా ఎంతో చక్కగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇందులో రక్తాలు ఏరులై పారడం ఉండవు, చెవుల్లోంచి రక్తం కారేలా ఎలివేషన్స్ ఇచ్చే బీజీఎం ఉండదు. ఫైట్స్, ఐటం సాంగ్స్, కుళ్లు జోకులు, జబర్దస్త్ పంచ్ డైలాగ్స్ ఉండవు. ఒక క్లీన్ అండ్ నీట్ సినిమాగా పవన్ సాధినేని ప్రజెంట్ చేశాడు.
ఎమోషనల్‌గా
కల్పన బాల్యంతో ప్రారంభమయ్యే సినిమా.. అలా మెల్లిగా సాగుతూ ఉంటుంది. గుజరాత్లో హీరో కష్టపడే సీన్స్, అక్కడ బిజిలీ (రుహానీ శర్మ) ట్రాక్ బాగుంటుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ కాస్త స్లోగా, సాదాసీదాగా అనిపిస్తుంది. కృష్ణ, కల్పన పెళ్లి.. కల్పన కోసం కృష్ణ నిలబడటం, హైదరాబాద్‌కి షిఫ్ట్ అవ్వడం ఇవన్నీ ఎమోషనల్‌గా సాగుతాయి. మిషన్ ఫెయిల్ అవ్వడం, కల్పన ఎమోషనల్ అవ్వడం.. ఇక నెక్ట్స్ ఏంటి? అనే ఆలోచనలు కలిగించేలా ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది. సెకండాఫ్‌లో రోహిణిగా శ్రుతి హాసన్ ఓ కొత్త ఎనర్జీని తీసుకు వస్తుంది. అయితే అక్కడ కూడా కథ ఊహకు తగ్గట్టుగానే సాగుతుంటుంది. చివరి 20 నిమిషాలు గుండెల్ని హత్తుకునేలా సాగుతుంది. నాన్నతో కూతురు మాట్లాడే సన్నివేశం, అంతరిక్షంలో కల్పన అనుభూతి చెందడం ఇలా ఎండ్ కార్డ్ వరకు ఎమోషనల్‌గా సాగుతుంది.
నటన
ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈ సినిమాలో దుల్కర్‌తో పాటుగా సాత్విక సరి సమానంగా నటించేస్తుంది. ఇద్దరి జంట కూడా బాగుంది. ఇలాంటి పాత్రల్లో దుల్కర్ అలవోకగా దూరిపోతాడు. ఇక సాత్విక సైతం తెరపై అందంగా కనిపిస్తూ, నటిస్తుంది. శ్రుతి హాసన్ పాత్ర ఆకట్టుకుంది. కల్పన తల్లిదండ్రులు, అక్క పాత్రలో సరస్వతిగా స్వాసిక, ప్రవీణ్, నాజర్, మురళీ శర్మ, చైతన్య జొన్నలగడ్డ ఇలా అన్ని పాత్రలు మెప్పిస్తాయి. మిగిలిన వారంతా కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు.
టెక్నికల్‌గా
విజువల్స్ బాగున్నాయి. సీజీ వర్క్ బాగుంది. ఆర్ఆర్ ఎంతో సోల్ ఫుల్‌గా ఉంటుంది. పాటలు తెరపై బాగున్నాయి. మాటలు చాలా వరకు గుండెల్లో నిలిచిపోతాయి. నీ కలలు ఆకాశంలో ఉంటే.. నాకు ఈ భూమితో పని ఏంటి.. అనే డైలాగ్ గొప్పగా అనిపిస్తుంది. అలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో చాలానే కనిపిస్తాయి. క్యాస్టూమ్, ఆర్ట్, ఎడిటింగ్ ఇలా అన్నీ కూడా సహజంగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.
నటులు:దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్
దర్శకుడు:పవన్ సాధినేని
