ఎమోషనల్ రివేంజ్ డ్రామా


మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకుడిగా రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘ ఇరుముడి ’ తాజాగా ప్రేఖకుల ముందుకు వచ్చింది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్, సోషల్ మెసెజ్, ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని రకాల అంశాలను జోడించి ఈ మూవీని శివ నిర్వాణ తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా సాగిన “ఇరుముడి” గురించి…

కథ
పొల్లూరులో త్రినాథ్ (రవితేజ)కి అరటి తోట ఉంటుంది. భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణికంఠ (నక్షత్ర) అలియాస్ మణెమ్మలే త్రినాథ్‌కి లోకం. స్కూల్‌కి వెళ్లేటప్పుడు గానీ వచ్చేటప్పుడు గానీ ఏం చూసినా సరే అన్నీ చెప్పాలి అంటూ కూతురిని పెంచుతాడు త్రినాథ్. అయ్యప్ప దీక్ష వేసిన 41 రోజులు తప్పా మిగతా అన్ని రోజులు త్రినాథ్ తాగుతూనే ఉంటాడు. కావేరి ఎంత చెప్పినా త్రినాథ్ మాత్రం వినడు, తాగడం మానడు. కూతురు మణెమ్మ కూడా త్రినాథ్ తాగుడుకే సపోర్ట్ చేస్తుంటుంది. అదే ఊర్లోని గురుస్వామి గోపరాజు (సాయి కుమార్)ని సొంత మనిషిలా భావిస్తాడు త్రినాథ్. ఊర్లో ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా, ఎవరు కష్టం కలిగించినా త్రినాథ్ ఊరుకోడు. అలా త్రినాథ్‌కి ఎంతో మంది శత్రువులు తయారువుతుంటారు. ఓ సారి గోపరాజు కూతురు గాయత్రికి ఓ కష్టం వస్తుంది. ఆ కష్టం గురించి మణెమ్మకి తెలుస్తుంది. కానీ మణెమ్మ తన తండ్రికి ఆ విషయాన్ని చెప్పలేకపోతుంది. అసలు గాయత్రికి వచ్చిన కష్టం ఏంటి? ఊర్లో జరిగే అమ్మాయిల అనుమానాస్పద మృతి వెనుకున్నది ఎవరు? ఈ కథలో టీచర్ ధనలక్ష్మీ (స్వాసిక), ఎమ్మెల్యే బుజ్జి, నాగులు, డొంకరాయ ఊర్లోని నలుగురు ఆకతాయి రౌడీల పాత్ర ఏంటి? అన్నది కథ.

ఫాదర్, డాటర్ ఎమోషన్
ఇరుముడి’ కోసం శివ నిర్వాణ ఎంచుకున్న కథని ఓవరాల్‌గా చూస్తే సాధారణ రివేంజ్ డ్రామాలానే కనిపిస్తుంది. కానీ ఫాదర్, డాటర్ ఎమోషన్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం చాలా కొత్తగా అనిపిస్తుంది. తండ్రీకూతుళ్ల బంధం ఎలా ఉండాలి, ప్రస్తుత కాలంలో పిల్లల్ని ఎలా పెంచాలి.. ఎంత ధైర్యంగా పెంచాలి అన్నది చూపించాడు శివ నిర్వాణ. ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సిన అన్ని అంశాల్ని జోడించి ఇరుముడిని శివ నిర్వాణ ఎమోషనల్‌గా తెరకెక్కించారు. కొన్ని సీన్లు చూస్తే లాజిక్స్‌ని దర్శకుడు శివ నిర్వాణ పూర్తిగా విడిచిపెట్టారనే అనిపిస్తుంటుంది .

ఉత్కంఠను రేకెత్తించేలా
ఫస్ట్ హాఫ్ వరకు కథలో ఇంటెన్సిటీ కనిపిస్తుంది. త్రినాథ్ పాత్ర తీరు, మణెమ్మతో ఉన్న కాంబినేషన్ సీన్స్, ఊర్లో అమ్మాయిలకు ఎదురవుతున్న సమస్యలు.. వీటిలో త్రినాథ్ ఎలా ఇరుక్కుంటాడు.. ఆ సమస్యలు త్రినాథ్ ఇంటి వరకు వస్తాయా? కూతురి మీద ప్రభావం చూపిస్తాయా? అన్న ఉత్కంఠను రేకెత్తించేలా స్క్రీన్ ప్లేని రాసుకున్నారు దర్శకుడు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. తనతో గొడవ ఉన్న అందరినీ పిలిచి శరణం కోరుకోమని చెప్పే సీన్, ఆ తర్వాత వచ్చిన చిన్న ట్విస్ట్, కథలోకి కొత్త విలన్ వచ్చాడని ఉత్కంఠను రేకెత్తించిన తీరు బాగుంటుంది.
సెకండాఫ్ అంతా అయ్యప్ప భక్తులకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. ఈ సినిమా కార్తీకమాసంలో వచ్చి ఉంటే మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉండేదేమో అన్నట్టుగా సెకండాఫ్ సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి మరింతగా పరుగులు పెడుతుంది. చివరకు ట్విస్ట్ రివీల్ అవ్వడం, హీరో విజృంభించడం కామన్. అయితే ఇందులోని క్లైమాక్స్ కొత్తగా అనిపిస్తుంది. చివర్లో వచ్చే పాట అందరినీ కదిలిస్తుంది. క్లైమాక్స్ పూర్తయ్యే సరికి ఓ సంతృప్తి అయితే కలుగుతుంది.

సాంకేతికంగా
సాంకేతికంగా చూసుకుంటే.. విజువల్స్ టాప్ నాచ్‌లో అనిపిస్తాయి. మన దగ్గర ఇలాంటి విజువల్స్ ఉన్నాయా? అని అనిపిస్తుంది. జీవీ ప్రకాష్ పాటలు అదిరిపోతాయి. సెకండాఫ్‌లో థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి. అమ్మాయిల్ని పెంచాల్సిన తీరు గురించి శివ నిర్వాణ చెప్పిన ప్రతీ డైలాగ్ అద్భుతంగా అనిపిస్తుంది. అయితే ఓ చోట హీరో.. నా ఊరి అమ్మాయిల జోలికి వస్తే అని డైలాగ్ చెప్తాడు. అక్కడ ఏ అమ్మాయి జోలికి వచ్చినా అని ఇలా డైలాగ్ పెడితే బాగుండేదనిపించింది. సబ్ టైటిల్స్ మాత్రం ఒక్కటి కూడా సింక్‌లో ఉండదు. అది మలయాళీ వర్షెన్ కోసం సబ్ టైటిల్స్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉంటాయి.

నటన
ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈ సారి రవితేజ ఓ సాధారణ మిడిల్ క్లాస్ ఫాదర్‌గా అద్భుతంగా అనిపిస్తారు. త్రినాథ్ పాత్రలో రవితేజ సహజంగా నటించినట్టు కనిపిస్తుంది. కొన్ని సీన్లలో రవితేజ ఏడ్పించేస్తారు. మణెమ్మగా కనిపించిన చిన్నారి నక్షత్ర అద్బుతంగా నటించింది. ప్రియా భవానీ శంకర్ పాత్రకు అంత ప్రాముఖ్యత లేనట్టుగానే కనిపిస్తుంది. సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక, మీసాల లక్ష్మణ్, గాయత్రి ఇలా అన్ని పాత్రలు బాగుంటాయి.

కథలో కొన్ని లోపాలు లేకపోలేదు. ఊర్లో అమ్మాయిలు చనిపోతుంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉండదా? అన్నట్టు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యే పాత్రకు తీసుకున్న ఆర్టిస్ట్‌ని చూస్తే.. ట్విస్ట్ ఏంటో అక్కడే అర్థం అవుతుంది. అలా కొన్ని చోట్ల సినిమా కాస్త వీక్‌గా అనిపించినా.. టోటల్‌గా చూసుకుంటే మాత్రం ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది.

నటులు:రవితేజ, నక్షత్ర, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్
దర్శకుడు:శివ నిర్వాణ

Scroll to Top