కామెడీ పండించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’


శ్రీవిష్ణు కథానాయకుడిగా కోన వెంకట్ సమర్పణలో భాను, నందు రచయితలుగా జానకిరామ్ మారెళ్ల తెరకెక్కించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. వెంటక కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో శ్రీవిష్ణుతో పాటు మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, షైన్ టాం చాకో, ఉపేంద్ర లిమాయే ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ తాజాగా విడుదలైన ఈ సినిమా కథ ఏంటి? ఎలా ఉంది? అన్నది చూద్దాం.

కథ
1992లో ఆంధ్ర – ఒడిసా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
90వ దశకంలో అన్నల ప్రభావం ఎక్కువగా ఉన్న అటవీ ప్రాంతంలో జార్జ్ కుట్టి (షైన్ టాం చాకో) స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్‌గా వస్తాడు. అతడిపై మాస్టర్ దళం దాడి చేస్తుంది. ఇక అక్కడి మాడుగుల ప్రాంతంలో కళ్యాణ్ (శ్రీ విష్ణు) థియేటర్‌లో ఆపరేటర్‌గా పని చేస్తుంటాడు. ఒరియా అమ్మాయిగా సితార (మహిమా నంబియార్) ఆ ఊరికి వస్తుంది. తెలుగమ్మాయి అయినా కూడా ఒరియా అమ్మాయిగా నటిస్తూ ఉంటుంది. ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు కళ్యాణ్. ఆ అమ్మాయి అన్న చేసిన అప్పుల కారణంగా బిష్వాస్ (ఉపేంద్ర లిమాయే) ఆ కుటుంబం వెంట పడతాడు. అప్పు చెల్లించకపోతే సితారని తీసుకు వెళ్లి పెళ్లి చేసుకుంటా అని బిష్వాస్ అంటాడు. ఆ డబ్బు తాను ఇస్తానని మాటిస్తాడు కళ్యాణ్. అయితే ఆ డబ్బు కోసం కళ్యాణ్ ఏం చేశాడు? స్కీం అంటూ సత్తి బాబు (సత్య), పళ్లం రాజు (ప్రభాస్ శీను), ఎస్సై అప్పలనాయుడు (బ్రహ్మాజీ) చేసే పనులు ఏంటి? ఆ స్కీం వల్ల కళ్యాణ్ కాస్తా కామ్రేడ్ కళ్యాణ్ ఎలా అవుతాడు? చివరకు తను ప్రేమించిన అమ్మాయిని చేరుకుంటారా? ఈ ప్రేమ జంట కలుస్తుందా? ఈ కథలో కళ్యాణ్ తల్లి సరస్వతమ్మ (రాధికా శరత్ కుమార్), శంకరన్న (శత్రు), మాస్టర్ (సాయి చంద్) పాత్రల ప్రాముఖ్యత ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

జబర్దస్త్ టైపు కామెడీ
నక్సలిజం, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ తీరు.. ఇలా ఏ యాంగిల్‌లోంచి చూస్తే ఆ యాంగిలో‌లో తప్పులు, ఒప్పులు కనిపిస్తాయి. ఇదొక సీరియస్ సబ్జెక్ట్. కృష్ణ వంశీ లాంటి దర్శకుడే సింధూరం అనే చిత్రంతో ఓ ప్రయోగం చేశాడు. ఎవరి సైడ్ తీసుకోకుండా.. నిర్ణయం ఏంటి? అన్నది ప్రేక్షకులకే వదిలేశాడు. ఇక చాలా సినిమాల్లో అన్నలనే హీరోలుగా చూపించారు. ఇంకొన్ని చిత్రాల్లో పోలీసులనే హీరోలుగా చూపించారు. ఇలా ఎవరి కోణం వారికి ఉంటుంది. అలాంటి సీరియస్ సబ్జెక్ట్‌లను తీసుకుని భాను, నందు నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా రాసుకున్నారు. ప్రతీ చోటా సిల్లీ, లాజిక్ లెస్ సీన్లు, జబర్దస్త్ టైపులో కామెడీ పంచుల్ని రాసుకుని నడిపించారు. వినోదం పరంగా చూసుకుంటే కామ్రేడ్ కళ్యాణ్ నవ్విస్తుంది. కానీ ఎమోషన్స్ పరంగా మాత్రం కామ్రేడ్ కళ్యాణ్ సిల్లీ అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా సాగుతుంది. మధ్య మధ్యలో కొన్ని సీరియస్ సీన్స్ వస్తాయి. కానీ వాటిని కామెడీ సీన్స్ డామినేట్ చేస్తాయి. సుదర్శన్ శ్రీవిష్ణు.. సత్య, శ్రీ విష్ణు కాంబోలో వచ్చే సీన్స్.. హీరోయిన్ ఇంట్లో శ్రీ విష్ణు, సుదర్శన్ చేసే కామెడీ ఇలా అన్నీ కూడా నవ్విస్తాయి. రాధిక శరత్ కుమార్ పాత్ర కూడా కాస్త ఎంటర్టైనింగ్‌గానే సాగుతుంది. దుబాయ్ బాబుగా సత్య కామెడీ మరో అదనపు ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అలా ఫస్ట్ హాఫ్‌లో కావాల్సినంత వినోదాన్ని జోడించారు. ఇక ఇంటర్వెల్‌కి కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్తుందని అనుకుంటారంతా. కానీ అక్కడ కూడా ఎంటర్టైన్మెంట్‌నే నమ్ముకున్నారు మేకర్స్. సీరియస్‌గా ఓ సందేశాత్మకంగా గుండెల్ని హత్తుకునేలా చెప్పాల్సిన పాయింట్స్‌ని కూడా ఫన్ మోడ్‌లోకి మార్చేశారు. కథ అడివిలోకి వెళ్లిన తర్వాత కూడా మళ్లీ వినోదాత్మకంగానే సాగుతుంది. అసలు చాలా వరకు లాజిక్ లెస్‌గా, సిల్లీగా అనిపిస్తాయి. అయితే శ్రీ విష్ణు, సత్య కాంబోలో వచ్చే సీన్స్ ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా రాసుకున్నారు చివరకు వచ్చేసింది.. ఏదో ముగించేయాలి కాబట్టి.. అర్జెంట్‌గా అందరూ మారిపోవాలి అన్నట్టుగా సీన్స్ సాగుతాయి.

నటన
ఆర్టిస్టుల విషయానికి వస్తే శ్రీ విష్ణు తనకు అలవాటు అయిన ఒకరకమైన పాత్రలో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్ని నవ్వించేస్తాడు. కామ్రేడ్ కళ్యాణ్‌గా వినోదాన్ని పండిస్తాడు. సత్య, సుదర్శన్, ఉపేంద్ర, బలగం మురళీధర్ గౌడ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా అన్ని పాత్రలు నవ్విస్తాయి. హీరోయిన్‌గా మహిమా నంబియార్‌కి ఉన్నది తక్కువ సీన్లే అయినా తెరపై ఆమె అందంగా కనిపిస్తారు. షైన్ టాం చాకో పాత్ర కొత్తగా ఏమీ ఉండదు. బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, రఘు బాబు ఇలా అందరూ తమ పరిధి మేరకు మెప్పిస్తారు.

సాంకేతికంగా
టెక్నికల్‌గా చూసుకుంటే విజువల్స్ బాగుంటాయి. మ్యూజిక్ మరీ హత్తుకునేలా కాకపోయినా.. తెరపై పాటలు బాగానే అనిపిస్తాయి. మాటలు మరీ అంత గుర్తు పెట్టుకునేలా అయితే ఉండవు. 90వ దశకం అని చెప్పారు. ఆ మాటలు, పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ చూస్తే.. ఆ కాలంలో ఇంత అప్డేట్‌గా ఉన్నారా? అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక తెరపైనా 90వ దశకాన్ని చూసిన ఫీలింగ్ అయితే కలగదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.

నటులు:శ్రీ విష్ణు, సత్య, సుదర్శన్, మహిమా నంబియర్, రాధికా శరత్ కుమార్, షైన్ టాం చాకో
దర్శకుడు:జానకిరామ్ మారెళ్ల

Scroll to Top