
విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘రణబాలి’. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 1854-1878ల నాటి బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో, రాయలసీమ ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో విజయ్ పవర్ఫుల్ యోధుడిగా కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా దసరా కానుకగా అక్టోబరు 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం టీజర్ ను మేకర్స్ లాంచ్ చేశారు.
1854 – 1878 మధ్య కాలంలో బ్రిటిష్ ఇండియాలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో రణబాలి అనే వీరుడిగా విజయ్ దేవరకొండ కనిపిస్తుండగా.. ఆయన భార్య జయమ్మ పాత్రను రష్మిక పోషించారు. అజయ్ – అతుల్ సంగీతం సమకూర్చగా.. నీరవ్ షా, జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ‘రణబాలి’ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని & వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్ – రష్మిక కలిసి నటిస్తున్న సినిమా ఇది.
”వారు ఆ కథను పాతిపెట్టారు.. వారు ఆ పేరును చెరిపివేశారు. వారు తమ పాపాలను తుడిచిపెట్టారు. కానీ అతని రౌద్రాగ్నిని మాత్రం ఎప్పటికీ పాతిపెట్టలేకపోయారు. జానపద గాథలు, చరిత్ర అతన్ని ఎప్పటికీ మరువవు. రణబాలి.. ఆ యోధుడి ప్రతిజ్ఞ” అని మేకర్స్ పేర్కొన్నారు. ”అతిథులుగా వచ్చి, అణచివేత దారులుగా మిగిలిపోయిన వారిని. రక్తం చిందించాలని నిర్ణయించుకున్న మన గ్రామాల్లోని ఆ మనుషులను.. ఎప్పటికీ మర్చిపోవద్దు” అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
