రజినీ విశ్వరూపం ‘జైలర్ 2’


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోగడ రజినీ, నెలన్స్ కాంబోలో వచ్చిన ‘జైలర్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీంతో ‘జైలర్ 2’ని మేకర్స్ రెడీ చేశారు. ఈ చిత్రాన్ని తాజాగా విడుదల చేశారు. ఈ సినిమా విశేషాలు ఇవీ:

కథ:
టైగర్ ముత్తువేల్ పాండ్యన్ (రజినీకాంత్) తన కొడుకుని చంపిన విషయాన్ని ఇంట్లో తెలీకుండా మెయింటైన్ చేస్తాడు. ఇక ఎవ్వరూ గుర్తు పట్టని ఓ ఊరికి తీసుకు వెళ్లి ఫ్యామిలీని కాపాడుకుంటూ ఉంటాడు. ఆ ఊర్లోని సూపర్ మార్కెట్లో సూపర్ వైజర్‌గా పని చేస్తుంటాడు. మరో వైపు వర్మను చంపిన వాడి కోసం దిలీప్ (సూరజ్ వెంజరమూడు) వెతుకుతుంటాడు. మిస్ అయిన మూడు కంటైనర్ల గురించి పై నుంచి బాస్ బోధి కల్పక్ (ఎస్ జే సూర్య) ఒత్తిడి కూడా దిలీప్ మీద ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో ముత్తు ఓ చిన్న గొడవతో మూర్తి (నమో నారాయణ) వద్ద డ్రైవర్‌గా చేరాల్సి వస్తుంది. ఆ తర్వాత విగ్రహాల స్మగ్లింగ్ బిజినెస్‌లోకి మూర్తిని లాగుతాడు ముత్తు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ముత్తుని దిలీప్ కనిపెడతాడా? లేదంటే ముత్తు వేసిన వలలో దిలీప్ చిక్కుతాడా? చివరకు కల్పక్ ఫ్యామిలీతో ముత్తు వైరం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది? అసలు కొడుకుని చంపిన విషయంలో ఇంట్లో భార్యకి, కోడలికి, మనవడికి తెలిస్తుందా? చివరకు ముత్తు తన ఫ్యామిలీని కాపాడుకుంటాడా? అన్నదే కథ.

డార్క్ కామెడీతో:
నెల్సన్ ‘జైలర్’ కోసం ఓ సింపుల్ కథనే ఎంచుకున్నాడు. కానీ తన స్టైల్‌ ఆఫ్ మేకింగ్, డార్క్ కామెడీని యాడ్ చేసి ప్రజెంట్ చేశాడు. ఆ ప్రజెంటేషనే ఆడియెన్స్‌కి నచ్చింది. స్లో మోషన్స్ షాట్స్, అనిరుధ్ బీజీఎం, రజినీకాంత్ ఆరాతో సినిమా అలా అలవోకంగా ఆరు వందల కోట్లకు పైగా రాబట్టింది. ఇక ఇప్పుడు జైలర్ 2 కోసం కూడా అదే ఫార్మాట్‌ను వాడుకున్నాడు నెల్సన్. ఈ సినిమా ఎక్కడా కూడా కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ నేటి ఆడియెన్స్‌కి ఏం కావాలి.. ఎక్కడ విజిల్స్ వేయించాలి.. ఎక్కడ స్లోమోషన్ షాట్స్ పెట్టాలి.. ఎక్కడ ఎమోషన్ పండించాలి అని లెక్కలు వేసుకుని మరీ పకడ్బంధీగా రాసుకున్నాడు నెల్సన్. ఈ విషయంలో నెల్సన్ వంద శాతం సక్సెస్ అయ్యాడు.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీతోనే నడిపించాడు. కథ అలా ముందుకు వెళ్తున్న కొద్దీ రజినీకి పడే ఎలివేషన్స్ అదిరిపోతాయి. ఇంట్రో, మున్సిపల్ ఆఫీసర్‌తో చిన్న గొడవ అలా నెమ్మదిగా కథలో ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇంకో వైపు దిలీప్ గ్యాంగ్ వేట, ముత్తు నడిపించే ఆట, మూర్తి ట్రాక్ ఇలా అన్నీ కూడా సరదాగా సాగుతుంటాయి. ఇక హోటల్‌లో కాల్పుల మోతతో పీక్స్‌కి వెళ్తుంది. అటు నుంచి కథ మరింతగా వేగంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ బ్లాక్‌కి ఫ్యాన్స్‌ పూనకాలతో ఊగిపోవాల్సిందే. అప్పటికే టికెట్‌కి పెట్టిన డబ్బులకు న్యాయం జరిగినట్టు అనిపిస్తుంది.

సెకండాఫ్‌ ఆరంభంలోనే ఎస్ జే సూర్య పాత్ర ఎంట్రీ, అతని రేంజ్ చూపించే సీన్ ఇలా అన్నీ మెప్పిస్తాయి. ఇక ఎస్ జే సూర్య, రజినీ ఫేస్ ఆఫ్ సీన్స్ బాగుంటాయి. గోవాలో జరిగే బర్త్ డే సెలెబ్రేషన్స్ సీన్, అక్కడి ఎపిసోడ్, విద్యా బాలన్ రజినీ ట్రాక్ మరింత ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత అక్కడ సినిమా కాస్త ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అయితే అలా డౌన్ అవుతుంది అనుకున్న టైంలోనే ట్విస్ట్‌లు, స్పెషల్ అప్పియరెన్స్‌లు అదిరిపోతాయి. చివరకు క్లైమాక్స్ ఫుల్ ట్రీట్‌లా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే గెస్ట్ అప్పియరెన్స్‌లను అంత ఈజీగా ఎవరూ గెస్ చేయలేరు.

నటన:
ఆర్టిస్టుల విషయానికి వస్తే రజినీకాంత్ చూపులతోనే నడిపించేశాడు. షర్ట్ నలగకుండా అలా నడుచుకుంటూ వస్తూనే సినిమాని నిలబెట్టేశాడు. ఇందులో రజినీకాంత్ ఎక్కువగా కష్టపడలేదు. కానీ సినిమా అంతా ఆయనే మోసినట్టు, విశ్వరూపం చూపినట్టు అనిపిస్తుంది. సూరజ్ వెంజరమూడు, ఎస్ జే సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, నమో నారాయణ, యోగి బాబు ఇలా అందరూ తమ తమ పాత్రల్లో మెప్పిస్తారు. రమ్యకృష్ణకి స్క్రీన్ స్పేస్ తక్కువగానే ఉంటుంది. ఇంకా కొన్ని స్పెషల్ గెస్టుల పేర్లు, వారి పర్ఫామెన్స్ బాగుంటాయి.
చివరగా.. ఊహకందేలా సాగే కథనం, రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించడం కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు.

టెక్నికల్‌గా:
టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్‌లో ఉంటుంది. విజువల్స్, బీజీఎం నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అయితే పాటలు మాత్రం అంతగా చెవికి ఎక్కకపోవచ్చు. డైలాగ్స్, రజినీ ఆరా, నెల్సన్ మేకింగ్, అనిరుధ్ బీజీఎం సినిమాకి ప్రధాన బలం. ఎడిటింగ్, క్యాస్టూమ్, సెట్ వర్క్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ బాగుంటాయి.

Scroll to Top