సాదాసీదాగా సాగిన “ఓ సుకుమారి”


కొన్ని సినిమాలు ఎందుకు తీస్తారో ప్రేక్షకులకు కాదు కదా..వాటిని రూపొందించినవారికి కూడా తెలియదు. అటువంటి సినిమాల జాబితాలోకే ఇటీవల విడుదలైన “ఓ సుకుమారి” సినిమా కూడా వస్తుంది. నటీనటులుగా మంచి పేరున్న ఐశ్వర్యా రాజేష్, తిరువీర్ లు జంటగా నటించిన ఈ సినిమాలో చెప్పుకోదగ్గది. గుర్తుంచుకోదగ్గదీ ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం విశేషం.

కథ
దామిని (ఐశ్వర్య రాజేష్)కి చిన్నప్పటి నుంచి ఓ సమస్య ఉంటుంది. ఆమె ఎవరిని ముట్టుకున్నా? ఎవరైనా ఆమెను టచ్ చేసినా కరెంట్ షాక్ కొడుతుంది. దామిని తల్లి దుర్గ (రూపా లక్ష్మీ) చనిపోయాక ఈ సమస్య మరింత ఎక్కువగా అవుతుంది. దీంతో కూతురిని తీసుకుని తండ్రి చంద్రయ్య (ఆనంద్) చంద్లాపూర్ అనే ఊరికి వచ్చి స్థిరపడతాడు. ఇక దామిని సమస్యని ఊరి ప్రజలు భరించలేకపోతారు. దామిని ఎలాగైనా సరే పెళ్లి చేసి ఊరి నుంచి పంపించేయాలని అనుకుంటారు. ఇంకో వైపు యాదగిరి (తిరువీర్) మహా పిసినారి. ఎదుటి వాళ్లు చెప్పేది పూర్తిగా వినడు. అలాంటి యాదగిరి ఊర్లో సర్పంచ్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు. పెళ్లి చేసుకుని వారసుడ్ని కంటేనే 80 ఎకరాల పొలం వస్తుందని తాత పెట్టిన కండీషన్ గురించి యాదగిరి తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే వెంటనే పెళ్లి చేసుకుని వారసుడ్ని కనేయాలని యాదగిరి ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలోనే దామినిని చూసి యాదగిరి ఇష్టపడతాడు. ఊరంతా ఏకమై దామినిని ఈ యాదగిరికి అంటగట్టాలని చూస్తారు. అయితే చంద్రయ్య మాత్రం తన కూతురికి ఉన్న సమస్య గురించి యాదగిరికి పెళ్లి టైంలో చెప్తాడు. కానీ యాదగిరి మాత్రం వినిపించుకోడు. ఇక దామిని, యాదగిరి పెళ్లి తర్వాత ఏం జరిగింది? దామిని వల్ల యాదగిరికి వచ్చిన సమస్యలు ఏంటి? పేరుకే ఉమ్మడి కుటుంబంగా ఉన్న యాదగిరి ఫ్యామిలీలో దామిని తెచ్చిన మార్పులు ఏంటి? దామినికి ఉన్న ఈ కరెంట్ షాక్ సమస్య ఎలా తీరుతుంది? దామిని, యాదగిరి ఎలా ఒకటి అవుతారు? అన్నదే మిగతా కథ.

ఆరంభం ఆసక్తికరంగా ఉన్నా
ఓ సుకుమారి కథ ఆరంభం ఆసక్తిగానే అనిపిస్తుంది. ఆ తర్వాత కథ ప్రస్తుతంలోకి వస్తుంది. హీరో, హీరోయిన్ పాత్రల ఎంట్రీ.. వారి వారి సమస్యలు, నేపథ్యాల్ని చూపించడం, ఆ తర్వాత వచ్చే కొన్ని కామెడీ సీన్లు బాగుంటాయి. పెళ్లి చూపుల సీన్ నుంచి పెళ్లి జరిగే వరకు వచ్చే సీన్లు, ఊరి ప్రజల హంగామా, ఝాన్సీ అండ్ కో చేసే హడావిడి ఇవన్నీ కాస్త అతిగానే అనిపించినా.. కొంత వరకు పర్వాలేదనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ కామెడీగా సాగడంతో సెకండాఫ్ కథ చాలా వరకు ఎమోషనల్‌గా సాగుతుందని అంతా ఊహిస్తారు. అయితే ఎక్కడా ఓ చోట కూడా ఓ బలమైన ఎమోషనల్ సీన్ ఉండదు. అసలు ఈ సినిమాలోనే సరైన ఎమోషన్ కనిపించదు. కుటుంబ సమస్యలు, ఆ ఫ్యామిలీని ఒక్కటి చేయాలని హీరోయిన్ ప్రయత్నించడం, హీరో హీరోయిన మధ్య దూరం పెరగడం ఇలా ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించదు. అయితే అన్ని సీన్లు కూడా ప్రేక్షకుడికి ఊహకు తగ్గట్టుగానే వస్తుంటాయి. అలా ఊహకందేలా సాగే కథనం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. చివర్లో ఏదైనా ట్విస్ట్ ఉండి మళ్లీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని అనుకునే ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది.

లాజిక్స్ మిస్
ఓ సుకుమారి కోసం ఎంచుకున్న పాయింట్ కొత్తగా అనిపించినా. కానీ దాన్ని పూర్తి సినిమా స్థాయిలో కథగా మల్చినప్పుడు కాగితంపై బాగానే అనిపించొచ్చు. కానీ తెరపై మాత్రం పూర్తి సంతృప్తిని కలిగించేలా తెరకెక్కించలేక పోయారనిపిస్తుంది. ఈ కథను ఇంకాస్త బాగా డీల్ చేయొచ్చు. కానీ కథను అటూ ఎమోషనల్‌గానూ కాకుండా ఇటూ యాక్షన్‌గానూ కాకుండా చేసేశారన్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా వరకు లాజిక్స్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వడంతో ప్రేక్షకుడు ఆ కాసేపైనా ఊపిరి పీల్చుకుంటాడనిపిస్తుంది. అసలు టెంపర్ వంశీని ఒక సీన్‌కి పరిమితం చేసేశారు. అతనేదో పెద్ద రౌడీ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇక ఊర్లో సర్పంచ్‌లా జీవన్ రెడ్డి‌ని వీక్ విలన్‌గా చూపించారు. అసలు అది విలనిజం అని కూడా చెప్పుకోకూడదు. ఆమనికి అయితే ఫస్ట్ హాఫ్‌లో కారు క్లీన్ చేసే సీన్లు తప్పా ఇంకే సీన్ ఇచ్చినట్టుగా కనిపించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు సినిమాలోని ఏ సీన్ కూడా ప్రేక్షకుడిపై ప్రభావం చూపించదు. ఆనంద్, మురళీధర్ గౌడ్, బలగం ఆర్టిస్టులు ఇలా ఎంతో మంది ఉన్నా కూడా ఎవ్వరినీ సరిగ్గా ఉపయోగించుకోలేక పోయారనిపిస్తోంది.

విజువల్స్ సాధారణంగానే
సాంకేతికంగానూ ఈ మూవీ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. విజువల్స్ సాధారణంగానే ఉంటాయి. పాటలు వినసొంపుగా ఏమీ అనిపించవు. అయితే మాటలు ఒకటి, రెండు చోట్ల బాగుంటాయి. ఎడిటింగ్, ఆర్ట్, కాస్ట్యూమ్స్, నిర్మాణ విలువలు ఇవన్నీ సాదాసీదాగానే అనిపిస్తాయి. అవుట్ డేటెడ్ అనే పదాలు ఈ సినిమాకి సెట్ అవుతాయి.

Scroll to Top