*డిసెంబర్ 4న ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి
గాయకులు చాలామంది ఉంటారు. కానీ గంధర్వ గాయకులు శతాబ్దానికి ఒక్కరో ఇద్దరో జన్మిస్తారు. నాటికి,నేటికీ, ఎప్పటికీ గంధర్వ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు.
ఆంధ్రుల హృదయాలలో అమర గాయకుడుగా, సంగీత దర్శకుడుగా చెరగని ముద్ర వేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు 1922 డిసెంబర్ 4 న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మలకు జన్మించారు. సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. అతను ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవారు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి అతన్ని బాల భరతుడు అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట తండ్రి సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో అతను సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఆయన్ను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య చూసుకోవడం మొదలుపెట్టారు.
ఘంటసాల తొలి జీవిత విశేషాల గురించి ప్రముఖ విద్వాంసుడు సంగీతరావు అనేక వ్యాసాల్లో, ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. ఇతర వివరాలు వి.ఎ.కె.రంగారావు ప్రచురించిన “భువన విజయము” అనే పుస్తకంలోనూ, 1970లో విడుదలైన ఘంటసాల రజతోత్సవ సంచికలోనూ లభిస్తాయి. ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూర్యనారాయణకి మృదంగం లోనూ, తరంగాలు పాడడం లోనూ ప్రవేశం ఉండేది. కాని పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరారు. ఆరేళ్ళపాటు గురువు పట్రాయని సీతారామశాస్త్రిగారి వద్ద సంగీత శిక్షణ సాగింది. శాస్త్రిగారు సంగీతరావుగారి తండ్రి. తన తండ్రిని గురించిన విశేషాలు సంగీతరావు గారి వ్యాసాల్లో కనబడతాయి. అవి చదివితే గాయకుడుగా, సంగీత దర్శకుడుగా ఘంటసాలకు మార్గం చూపినది శాస్త్రిగారే ననిపిస్తుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యారు. శాస్త్రిగారి నుంచి ఘంటసాలకు శ్రుతిశుద్ధి, నాదశుద్ధి, గమకశుద్ధి, తాళగత, స్వరగత లయశుద్ధి అలవడ్డాయి. పాటల్లో సాహిత్యం ముఖ్యమనే అవగాహన కలిగింది.
ఆ తరవాత కొన్నాళ్ళు కచేరీలూ, హరికథలూ, రేడియో కార్యక్రమాలతో గడిచాయి. స్టేజినాటకాల్లో నటించే అవకాశాలు కూడా కలిగాయి. పెద్దలంతా మెచ్చుకున్నారు కాని ఆదాయం మాత్రం పెరగలేదు. ఇంతలో 1942లో క్విట్ ఇండియా ఉద్యమంవల్ల ప్రభావితుడైన ఘంటసాల దేశభక్తి గేయాలను గానం చేస్తూ కొన్నాళ్ళు జెయిలు శిక్ష కూడా అనుభవించారు. ఆ పాటల రికార్డులు విశేష జనాదరణ పొందాయి. ఆ రోజుల్లోనే ఆయనకు వివాహం జరగడం, అత్తవారి ఊరిలో సినీ రచయిత సముద్రాల సీనియర్‌తో పరిచయం కలిగాయి. సముద్రాల ద్వారా 1944లో ఘంటసాల సినీ రంగంలో ప్రవేశించారు. మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు పాటలతోనూ, ఘంటసాల నటనతోనూ ఒకేసారి కుస్తీ పడుతూండేవారు. ప్లేబాక్ పద్ధతి రావడం తో ఎవరి పాత్ర వారికి లభించినట్టయింది. సినీ నేపథ్య గాయకుడిగా త్వరలోనే ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది.
పాటలో నటించడం ఆయనకు సహజంగా అబ్బిన విద్య. ఆయన గాత్రంలో ఉన్న లాలిత్యం, దానితో బాటు గాంభీర్యం; మూడు స్థాయిలలోనూ అవలీలగా పలికే రాగ భావం, శబ్దోచ్చారణలోని స్పష్టత, రాగాల గురించిన నిర్దుష్టమైన అవగాహన ఇలా ఎన్నో ఉత్తమ లక్షణలు ఆయన పాటలను తీర్చి దిద్దాయి. వివిధ సన్నివేశాలలో పాడిన విషాద గీతాలు, ప్రేమ గీతాలు, యుగళ గీతాలే కాక హరి కథలు, బుర్ర కథలు, జానపద గీతాలు, హాస్యగీతాలు, శాస్త్రీయ గీతాలు ఆయన గానంలోని విస్తృత పరిధికి అద్దం పడతాయి. పాటలే కాదు, పద్యాలను కూడా అతిగా రాగం తియ్యకుండా అర్థం, రాగభావం సమపాళ్ళలో మేళవించి పాడే పద్ధతి ఆయనకే చెల్లింది.
ఆయన పాడిన శకంలో ఉద్దండులైన సంగీత దర్శకులుండేవారు. రాజేశ్వరరావు, సి.ఆర్.సుబ్బరామన్, పెండ్యాల, ఆదినారాయణరావు, సుసర్ల దక్షిణామూర్తి వంటివారి గొప్పదనం ఘంటసాల పాటలకు ఎక్కువ దోహదం చేసిందో, ఆయన వల్ల వారంతా రాణించారో చెప్పడం కష్టం. స్వరకర్తలూ గాయకులే కాక పాటల రచయితలూ, బి.ఎన్.రెడ్డి వంటి సినీ దర్శకులూ పాటల పట్ల ఎంతో శ్రద్ధ చూపేవారు కనుకనే అటువంటి సంగీతం తయారయింది. ఈ నాటి సంగీతంలో లోపాలున్నాయంటే అందుకు కారణం “రాగాల్లోనూ, బాణీల్లోనూ వెయ్యవలసినవీ, వెయ్యకూడనివీ గమకాలూ, సున్నితమైన అనుస్వరాలూ ఉంటాయి” అనేది పాడేవారికీ పాటలు కట్టేవారికీ కూడా తెలియకపోవడం అనుకుంటాను.
ఘంటసాల పాడడం మొదలెట్టిన రోజుల్లో అప్పటికే పేరు పొందిన ఎం.ఎస్. రామారావు, ఎస్.రాజేశ్వర రావు వంటి గాయకులలో వినిపించని నిండుదనం, తెలుగుదనం (నేటివిటీ) మొదటిసారిగా ఘంటసాల పాటలలో వినిపించి శ్రోతలను ఆకట్టుకున్నాయి. లైలా మజ్నూలో సుసర్ల దక్షిణామూర్తి, మాధవపెద్ది సత్యం, ఘంటసాల కలిసి పాడిన “మనుచుగా తా ఖుదా తోడై” అనే పాటలో హీరో ఎవరో గుర్తు పట్టడం చాలా తేలిక. అది 1949నాటి సినిమా. అప్పటికి స్టార్ సిస్టం అమలులోకి రాలేదు. బాగా పాడేవారినే హీరోకు ఎన్నుకునేవారు. ఘంటసాల తరవాత సినిమాల్లో పాడడానికి వచ్చిన మాధవపెద్ది సత్యం, ఏ.ఎం.రాజా, పి.బి.శ్రీనివాస్ తదితరులు ఈనాటి గాయకుల కన్న ఎంతో ప్రతిభావంతులే. అయినప్పటికీ వారు ఘంటసాలకు సమకాలికులు కావడంతో ఆయనకు సరితూగలేక పోయారు. అంతేకాదు. ఎన్నో దశాబ్దాలపాటు సినీ హీరోలుగా అగ్రస్థానంలో ఉన్న, రామారావు, నాగేశ్వరరావులు ఘంటసాల పాడందే నటించేవారు కాదు.
ఒకప్పుడు విజయావారు తమ నిర్మాణ సంస్థలో ఇతర కళాకారులతోబాటు ఘంటసాలను నెల జీతం మీద నియమించారు. అందులో ఇతర సంస్థలకు పని చెయ్యరాదనే నిబంధన ఉండడం వల్ల ఘంటసాల వంటి ఉత్తమ కళాకారులకు అది కుదరని పరిస్థితి అయింది. మిస్సమ్మ సినిమాకు సంగీత దర్శకుడుగా కాని, గాయకుడుగా కాని ఆయన పని చెయ్యక పోవడానికి కారణం ఇదేనంటారు. కారణాలు ఏవైనా ఘంటసాల పాడినంత కాలమూ ఆయనకు పోటీ లేకుండా పోయింది. ఏపాటకు ఎంత మోతాదులో భావం పలికించాలో ఆయనకు ఎవరూ వివరించనవసరం లేదని అనిపిస్తూండేది. తరవాతి తరం గాయకులలాగా కృత్రిమంగా, కష్టపడి భావం కోసం ఆయన ఎన్నడూ ప్రయత్నించలేదు.
ఘంటసాల సంగీత దర్శకుడుగా కనబరిచిన ప్రతిభ ఆయన గాయకుడుగా సాధించిన విజయం వల్ల కొంత మరుగున పడింది. 1950 ప్రాంతాల తీసిన పెళ్ళిచేసిచూడు లోనే ఆయన చక్రవాకం (ఏడుకొండలవాడ), చారుకేశి (ఎవరో ఎవరో) వంటి కర్ణాటక రాగాలను అతి సమర్థవంతంగా సినీగీతాలకు వాడుకున్నాడు. హిందోళం ఎప్పుడు ఉపయోగించినా అందులో పంచమం పలికించడం ఆయనకు సరదా అనిపిస్తుంది. రాగేశ్రీ వంటి హిందూస్తానీ రాగాలను కూడా ఆయన “ఇది నాచెలి” (చంద్రహారం), “అన్నానా భామిని” (సారంగధర) వగైరా పాటల్లో ఉపయోగించాడు. కుంతీకుమారి పద్యాల్లో కర్ణాటక రాగాలైన హేమావతి, బిలహరి, మాయామాళవగౌళ, అమృతవర్షిణి, హిందూస్తానీ రాగాలైన లలిత్ వంటివి అనేకం వినిపిస్తాయి. లలితసంగీతానికి పనికిరావనిపించే రంజని, భైరవి వంటి కర్ణాటక రాగాలను ఆయన తన కరుణశ్రీ పద్యాల్లో అద్భుతంగా ఉపయోగించాడు. ఇది విద్వాంసులు సైతం గుర్తించవలసిన విషయం. ఏ రాగం ఎక్కడ వాడినా రాగభావాన్ని చెడనివ్వలేదు. మాటల్లోని అర్థమూ కనుమరుగవలేదు. రహస్యం సినిమాలో సందర్భాన్ని బట్టి సరస్వతి, లలిత వంటి దేవతల పేర్లున్న రాగాలలో ఆయన స్వరరచన చేశాడు. రాజేశ్వర రావు, పెండ్యాల వంటి సంగీత దర్శకులు అతి ప్రతిభావంతులే అయినా రాగాల మీద ఘంటసాలకు ఉండిన అధికారం వారికన్నా ఎక్కువేమో.
పాతాళభైరవిలో నాకు తెలిసినంత వరకూ హిందీలో నౌషాద్ చేసిన మూడు పాటలకు ఘంటసాల అనుసరణ చేశాడు. “ఎంత ఘాటు ప్రేమయో”కు “ఆవాజ్‌దే కహా హై” (అన్‌మోల్ ఘడీ) ప్రేరణ కాగా, “కలవరమాయె” పాటకు “తూ మేరా చాంద్ “(దిల్లగీ) ఇన్‌స్పిరేషన్. అలాగే “తీయని ఊహలు” అనే పాట వింటే “రున్ ఝున్ బర్సే బాదర్‌వా” (రతన్) గుర్తుకు వస్తుంది. నా లెక్కన నౌషాద్‌ను మించిన సంగీత దర్శకులు లేరు కాని ఈ మూడు పాటల్లోనూ ఘంటసాల ఒరిజినల్ కన్నా బాగా చేశారని ప్రశంసలు పొందారు.
ఘంటసాల స్వయంగా తాను సంగీతదర్శకుడు అయినప్పటికీ ఆర్కెస్ట్రాలో దిట్ట అయిన సి.ఆర్.సుబ్బరామన్ వద్ద అసిస్టెంటుగా పనిచేసి ఎంతో అనుభవం గడించారు.
ఆయన సినీరంగ ప్రవేశం ఇలా జరిగింది… 1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్ళిచేసుకున్నారు. ఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానే కచేరీచేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తారు. కొన్నాళ్ళకు దగ్గరివూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయన్ను కలిసారు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నారు. ఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసి, కొంత అప్పుచేసి మద్రాసు వెళ్ళారు. సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించారు. వారిరువురు ఘంటసాల పాటవిని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.
సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో అతనుకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తన మకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చారు. పగలంతా అవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవారు. చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవారు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపుపొందారు. ఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా స్వర్గసీమలో మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది. తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.
1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు. తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావుసంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే. 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆచిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెబుతుంటారు. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని శేషశైలావాస శ్రీ వేంకటేశా పాటను తెరపైనకూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలరు అన్నఖ్యాతి తెచ్చుకొన్నారు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే. ఏనోట విన్నా అతను పాడిన పాటలే.
1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవారు. 1970లో అతనికి పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసారు. 1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరారు. అప్పటికే మధుమేహంతో బాధపడుతూ ఉన్నారు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యారు.
అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నారు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడారు. 1974 నాటికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసారు.
విశిష్టమైన వ్యక్తిత్వం ఘంటసాలది. తాను ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా జీవనగమనంలో తనను ఆదరించిన వారిని మరువలేదు. అతను ఎన్నడూ మరొకరిని నొప్పించేవారు కాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవారు. “నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది” అని ఎన్నోసార్లు చెప్పేవారు.
మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయన పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు. సీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు.
పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవారు. సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను అన్నా అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పారు. కొన్నేళ్ళకు పాపారావు ..అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించారు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తన ఇంట పెంచి తనకుమారుడిగా చూసేవారు.