దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. న్యూవేవ్ సినిమాలకు ఆద్యుడైన శ్యామ్ బెనగల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్యామ్ బెనగల్ కుమార్తె పియా బెనెగల్ తన తండ్రి మరణాన్ని ధృవీకరించారు. డిసెంబర్ 23 సోమవారం సాయంత్రం 6.38 గంటలకు ముంబైలోని సిటీ హాస్పిటల్ వోకార్డ్‌లో తన తండ్రి తుదిశ్వాస విడిచినట్టు తెలియజేశారు.
సోషల్ మెసేజ్ చిత్రాలతో పాటు అనేక అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీలను రూపొందించారు శ్యామ్ బెనగల్. పద్మశ్రీ, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్ని అందుకున్నారు శ్యామ్ బెనగల్. వీటితో పాటు 18 సినిమాలకు జాతీయ పురస్కారాలను అందుకున్నారు శ్యామ్ బెనగల్. తెలుగులో అనుగ్రహం అనే సినిమాను తీశారు శ్యామ్ బెనగల్.
తన తండ్రి ఫొటోగ్రాఫర్ కావడంతో.. కర్ణాటక నుంచి హైదరాబాద్‌కి వలస వచ్చారు శ్యామ్ బెనగల్. శ్యామ్ బెనగల్ అప్పటి హైదరాబాద్‌లో తిరుమలగిరి ప్రాంతంలో 1934లో డిసెంబర్ 14న జన్మించారు. ఆయన స్వస్థలం కర్ణాటకలో కొంకల్ ప్రాంతం. ఆయన పూర్తిపేరు శ్యామ్ సుందర్ బెనగల్. ఉన్నత విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే పూర్తి చేశారు శ్యామ్ బెనగల్. సికింద్రాబాద్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు.
అడ్వర్టైజింగ్‌లో కాపీ రైటర్‌గా కెరీర్ ప్రారంభించారు శ్యామ్ బెనగల్. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదువుకున్న ఆయన సామాజిక అంశాలపై సినిమాలు రూపొందించి దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. అంకుర్, నిశాంత్, మంథన్, జునూన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్: ద ఫర్గాటెన్ హీరో వంటి చిత్రాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. 2006 నుంచి 2012 మధ్య రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.
అంకుర్ అనే తొలి చిత్రంతోనే జాతీయ అవార్డ్ అందుకున్నారు. ఆ తరువాత.. నిశాంత్, మంతన్, భూమిక, కొందుర, మంది, త్రికాల్, జుబేదా ఇలా అనేక చిత్రాలను రూపొందించారు. ఆయన తీసిన ప్రతి చిత్రం కూడా.. అవార్డ్ పిక్చర్ కావడం విశేషం. ఫిల్మ్ ఫేర్‌తో పాటు అనేక జాతీయ అవార్డుల్ని అందుకున్నారు శ్యామ్ బెనగల్. ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్’. ఈ సినిమా గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారాన్ని అందుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సైతం ఆయనను వరించింది. 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డును తీసుకున్నారు. మొత్తం ఏడుసార్లు శ్యామ్ బెనగల్ జాతీయ అవార్డు అందుకున్నారు.