బ్యాంకింగ్ సిస్టమ్ లోపాలను చూపెడుతూ ఈ మధ్య ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. హర్షద్ మెహతా కథ మొదలుకొని మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ వరకు బ్యాంకింగ్ సిస్టం మీద కథలు వచ్చాయి. ఈ జీబ్రా కూడా అలాంటి నేపథ్యంలోనే తెరకెక్కిందని అర్థం అవుతోంది.
కథ
సూర్య (సత్య దేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్‌లో రిలేషన్ షిప్ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. స్వాతి (ప్రియా భవానీ శంకర్) కూడా బ్యాంక్ ఉద్యోగి. తెలియకుండా జరిగిన చిన్న తప్పుతో ఒకరి అకౌంట్లో వేయాల్సిన డబ్బుల్ని బెన్నీ (టెంపర్ వంశీ) అకౌంట్లోకి వేస్తుంది స్వాతి. దీంతో సూర్య తన తెలివితో బెన్నీ అకౌంట్లోని డబ్బుల్ని తిరిగి విత్ డ్రా చేస్తాడు. కానీ ఆ తరువాత బెన్నీ అకౌంట్ నుంచి ఐదు కోట్లు మాయం అవుతాయి. ఆ ఐదు కోట్లతో ఆదిత్య (డాలీ ధనుంజయ) ఉన్న సంబంధం ఏంటి? వెయ్యి కోట్ల విలువైన ఎయిర్ లైన్‌ను డీల్ చేసే క్రమంలో మధన్ గుప్తా (సునీల్), ఆదిత్యలకు ఏర్పడిన వైరం ఏంటి? చిటిక వేస్తే వందల కోట్లను క్షణాల్లో పుట్టించగల ఆదిత్య.. కేవలం ఆ ఐదు కోట్ల కోసం సూర్యను పరుగులు ఎందుకు పెట్టిస్తాడు?. బ్యాంకులో పని చేసే సాధారణ ఉద్యోగి నాలుగు రోజుల్లో ఐదు కోట్లు ఎలా తిరిగి ఇస్తాడు? అసలు ఆ ఐదు కోట్లను మాయం చేసింది ఎవరు? ఐదు కోట్లను సంపాదించే క్రమంలో సూర్య బ్యాంకింగ్ సిస్టంలోని లోపాల్ని ఎలా వాడుకుంటాడు? చివరకు సూర్య, ఆదిత్యలు తమ తమ లక్ష్యాల్ని చేరుకుంటారా? లేదా? అన్నది కథ.
ఎలా ఉందంటే..?
జీబ్రా కథని రెండు మూడు లేయర్లలో రాసుకోవడం, హీరో ట్రాక్, విలన్ ట్రాక్‌తో సమాంతరంగా సినిమాను నడిపించడం కాస్త బాగానే ఉంటుంది. దర్శకుడు పూర్తిగా ఈ కథను బ్యాంకింగ్ రంగం చుట్టూ రాసుకోలేదు. దీనికి మళ్లీ డాలీ ధనుంజయ్ ట్రాక్‌ను పెట్టుకున్నాడు. ఆ డాలీ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్, ఫ్లాష్ బ్యాక్ సీన్లు .. ఓ సాధారణ వ్యక్తి.. కోల్ కతాకు వెళ్లడం.. బతికేందుకు వెళ్లి శాసించే స్థాయికి ఎదగడం ఇవన్నీ చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. జీబ్రాలో ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అవ్వడంతో పాటు అసందర్భంగా పాటలు ఉంటాయి. మధ్యలో ఓ ఐటం సాంగ్ కూడా ఉంది.
బ్యాంక్ సెక్యురిటీ సిస్టం, లాకర్ల సిస్టం, బ్యాంకింగ్ టర్మినాలజీ ఇవన్నీ కాస్తో కూస్తో తెలిస్తే.. జీబ్రా ఈజీగా ఎక్కేస్తుంది. లేదంటే చాలా కష్టమే. మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ పోలికలు ఇందులో కాస్త కనిపిస్తాయి. లవ్ ట్రాక్ ఏమంతగా మెప్పించదు. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు.
నటన
సత్యదేవ్ తన పాత్ర కోసం ఎంత చేయాలో అంతా చేశాడు. సూర్య కారెక్టర్‌లో ఇంటెన్స్ చూపించాడు. కొన్ని చోట్ల కామెడీని పండించాడు. ఎమోషనల్‌గా నటించాడు. ప్రియా భవానీ శంకర్ ఓ రెగ్యులర్ హీరోయిన్ పాత్ర అంతే. డాలీ ధనుంజయ ఈ చిత్రానికి హీరో ప్లస్ విలన్ టైపు. డాలీ తన పాత్రలో మెప్పిస్తాడు. కానీ చాలా రొటీన్ అనిపిస్తుంది. కమెడియన్ సత్య మళ్లీ నవ్వించేశాడు. కనిపించిన ప్రతీ సారి ఆడియెన్స్‌ను గిలిగింతలు పెట్టించినట్టు నవ్వించేస్తాడు. సునీల్ గెటప్ కొత్తగా ఉంటుంది. యాక్టింగ్ మాత్రం రొటీన్ విలన్‌గా ఉంటుంది. ఏ టు వై బాబా పాత్రలో సత్య రాజ్ మెప్పిస్తాడు. మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి. సాంకేతికంగా జీబ్రా పర్వాలేదనిపిస్తుంది. పాటలు గుర్తుండకపోయినా… మాటలు కొన్ని చోట్ల బాగుంటాయి. విజువల్స్ బాగున్నాయి. కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది.
నటులు: సత్య దేవ్, డాలీ ధనుంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, కమెడియన్ సత్య
దర్శకుడు: ఈశ్వర్ కార్తీక్