మాస్ ని మెప్పించే పుష్ప-2


ఏ సినిమాకి అయినా కథే హీరో. ఎంతపెద్ద తారాగణం ఉన్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శకధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే. కానీ ‘పుష్ప-2’ కథానాయకుడి రూలింగ్‌నే కథగా మలిచారు సుకుమార్. ‘పెళ్లం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో పపంచానికి చూపిస్తా’ అని పుష్ప ట్రైలర్‌‌లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు.. అదే అసలు కథ.. పుష్ప ది రూల్ కథకి మూలం. పుష్ప రాజ్ (అల్లు అర్జున్) తన భార్య శ్రీవల్లి (రష్మిక)కి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్లాడు? పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలను మార్చేసేతంట రూలింగ్ చేసి.. రాజకీయాలను ఏవిధంగా శాసించాడు? పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షేకావత్(ఫహాద్ ఫాజిల్)తో ఢీ కొట్టి.. తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు? తన ఇంటిపేరును దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటనేదే పుష్ప ది రూల్ కథ.

పుష్ప ది రైజ్- ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఇదేం అద్భుతమైన కథ కాదు.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ దొంగ కథ. ఇందులో పెద్ద గొప్పేం ఉంది అనే విమర్శలు వినిపించాయి. నిజానికి ఆ విమర్శల్లో నిజం లేకపోలేదు. పుష్ప గొప్ప కథేం కాదు. తెలిసిన కథే.. చాలా సినిమాల్లో చూసిన కథే. అలాంటి కథకి సీక్వెల్ అంటే.. అసలు కథ ‘పుష్ప ది రూల్’ సెకండ్ పార్ట్ కోసం దాచి పెట్టాడనే అనుకున్నారంతా. కానీ.. సెకండ్ పార్ట్ చూసిన తరువాత ఫస్ట్ పార్ట్‌లోనే కాస్తో కూస్తో కథ ఉంది. ది రూల్‌లో కథే లేదనే కంప్లైంట్ అయితే మస్ట్‌గా వస్తుంది.

పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్‌లో కంటే సెకండ్ పార్ట్‌లో ఇంకా పవర్ ఫుల్‌గా చూపించారు. కథ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా.. మాసివ్ సీక్వెల్‌లో ఒకదాని తరువాత మరొకటి.. హై ఓల్టేజ్ సీన్‌లతో నింపేశారు. ఒక్కసారి వెనక్కి వెళ్లి.. అసలు కథ ఏమౌతుంది? అన్న ఆలోచన లేకుండా పుష్ప‌లో వైల్డ్ ఫైర్‌ని ఓన్‌ చేసుకునేలా తీశాడు సుకుమార్‌. కేవలం యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తోనే కాకుండా.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ ఎంత పెద్ద మొగోడైనా పెళ్లం మాట వినాలని.. ఎలా చెప్తే జనానికి ఎక్కుతుందో అలా చూపించారు. ఎర్రచందనం నేపథ్యంలో ఓ పెద్ద ప్రపంచాన్నే సృష్టించాడు సుకుమార్. పోలీసుల కళ్లుకప్పి ఎర్రచందాన్ని విదేశాలకు తరలించే సీన్లు.. కొత్త రకం స్మగ్లింగ్‌లు.. ఎత్తులకు పై ఎత్తులు ఇవన్నీ లెక్కల మాస్టర్ బుర్రకి ఎంత గట్టిగానే పదును పెట్టారనే దానికి అద్దం పట్టే సీన్లు. ఫస్టాఫ్‌ని చాలా వరకూ సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో నడిపిస్తే.. సెకండాఫ్‌ పుష్పరాజ్ నట విశ్వరూపాన్ని చూపించాడు.

యాక్షన్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్.. అన్ని కోణాల్లోనూ పుష్పరాజ్‌లో పర్ఫెక్ట్ నటుడ్ని చూడొచ్చు. ఆ జాతర ఎపిసోడ్‌లో అయితే అల్లు అర్జున్ నటన చూస్తే భయం కలుగుతుంది. నిజంగానే అమ్మవారు పూనిందా? అన్నట్టుగా భయపెట్టేశాడు. గంగమ్మ జాతరలో నిప్పుల గుండం తొక్కే సీన్‌ గూస్ బంప్స్ గా చూపించాడు. అయితే చాలా చోట్ల పుష్ప రాజ్ డైలాగ్‌లు అర్థం కావు. డబ్బింగే అలా చెప్పాడా? లేదంటే ఆ డైలాగ్ మాడ్యులేషనే అలా ఉందా? లేదంటే పుష్పరాజ్ మ్యానరిజమే అది కాబట్టి డైలాగ్‌లు కూడా అలాగే చెప్పించారో ఏమో కానీ.. డైలాగ్‌లు అయితే చాలాచోట్ల అర్థం కావు. ఏంటీ.. ఏమన్నాడూ.. అని థియేటర్స్‌లో ఒకర్నొకరు అడుక్కునే పరిస్థితి కనిపించింది.

కాస్త కథనం నెమ్మదిస్తుందన్న ప్రతిసారీ భారీ ఎలివేషన్స్ హై ఓల్టేజ్ సీన్లు పెట్టడంతోనే ‘పుష్ప 2’ నడిచిపోతుంది తప్పితే.. కథని మలుపుతిప్పే సీన్లు కానీ.. బలమైన ఘర్షణలు.. బలమైన ప్రతినాయకుడు.. ఆదిపత్య పోరు.. ఇలాంటివి ఏమీ కనిపించవు. పుష్పరాజ్‌ని ఎలివేట్ చేయడానికి ఇతర పాత్రల్ని పెద్దగా హైలైట్ చేయాలేదేమో అనిపిస్తుంది. మంగళం శీనుగా సునీల్, దాక్షాయనిగా అనసూయ.. ఫస్ట్ పార్ట్‌లో ఉన్నారు కాబట్టి.. సెకండ్ పార్ట్‌లోనూ ఉన్నారంటే ఉన్నారంతే. వాళ్లకి పెద్ద ప్రాధాన్యత లేదు. అయితే అజయ్‌కి మాత్రం అల్లు అర్జున్‌కి అన్నగా మంచి స్కోప్ ఉన్న సీన్లు పడ్డాయి. ఇంటి పేరుని తన పేరు ముందు రావడానికి పుష్పరాజ్ పడిన ఘర్షణలో అజయ్ పాత్ర కీలకంగా అయ్యింది. రావు రమేష్ సీఎంగా.. జగపతిబాబు సెంట్రల్‌లో చక్రం తిప్పే సెంట్రల్ మినిస్టర్‌గా పెద్ద పాత్రలే చేశారు. అయితే జగపతిబాబు రోల్ పెద్దగా ఎలివేట్ కాలేదు.

పుష్ప పాత్రను ఎలివేట్ చేయడానికి పెట్టిన కొన్నిసీన్లు వాస్తవ దూరం అనిపిస్తాయి. ఎర్రచందనం స్మగ్లర్ నేరుగా సీఎం దగ్గరకు వెళ్లిపోవడం.. రాత్రికి రాత్రే సీఎంలను మార్చేయడం.. తన భార్య అడిగిందని సీఎం ఇంటికే వచ్చి ఫొటో ఇవ్వడం ఇవన్నీ వాస్తవ దూరాలే. ఎంత పుష్ప అయితే మాత్రం తనెంత రూల్ చేస్తే మాత్రం రూలింగ్‌లో ఉన్న సీఎంలను జోకర్లను చేయడం అతిగానే అనిపిస్తాయి.

నటులు:అల్లు అర్జున్,రష్మిక మందన్న,ఫహాద్ ఫాజిల్‌,సునీల్
దర్శకుడు: సుకుమార్

Scroll to Top