శ్రీకృష్ణ జన్మాష్టమి

పంచచామర వృత్తంలో….
వరాలునివ్వగా జగాన వాసుదేవుడయ్యెగా
విరాళి తోడపూజచేయ విద్యనిచ్చువానిగా
సురాగగీతికల్ పఠించ సూత్రదారివైతివో
పరాజ యమ్ములేకమమ్ము పాలనమ్ము సేయుమా 1

నమస్సులోవిశాలధర్మనావికా నిరామయా
సమాదరించు దైవమా యశాంతిబాపిబ్రోవుమా
ప్రమోదమిచ్చి గావుమా ప్రసన్నదృష్టి జూడుమా
రమాపతీ జగత్పతీ వరాలనిచ్చి యేలరా! 2

స్వరాలు పల్కగా పదాలు జాలువార నా మదిన్
వరాలనిచ్చితీవు రాగ భావమాలపింపగా
విరాగినై జపించనెంచు వేదమూర్తివై యిటన్
విరాట్స్వరూపమొంది నిల్చి వేడ్కసేయుచుంటివే ! 3

మహోజ్జ్వలమ్ము నీ పరాక్రమమ్ముజూడ మాధవా
సహాయమీయవయ్య నాకు సత్యసుందరా హరా!
నిహారపర్వతమ్ముదాకు నేరముల్ సహించుమా
మహాత్మ నన్నుగావరా రమావినోది రక్షగా ! 4

నిరంతరమ్ముగా యనంత నిశ్చలాకృతిన్ మదిన్
మరెంతొ భక్తిభావయుక్త మైనదై నిరుక్తమై
చరించు నాదుమానసమ్ము శాశ్వతమ్ముగాయిలన్
వరించు నట్లుగా నొసంగు భాషణాదిభూషలున్ 5

సదామనస్సులో ననన్య సౌమ్యతన్ గణించగా
నిదాన వాచకమ్ముతోడ నిత్యమున్ చరించగా
వదాన్యు డై విరాజిలున్ ప్రభావ భావశీలిగా
చిదాత్మ శుద్ధిచిద్విలాస సేవకై తపించగా!! 6

నిరామయామురారిసూరి నిర్గుణాజగాళి ని
ర్విరామ పాలకా అపూర్వ విశ్వరూపనాయకా
స్వరూపమేప్రకాశమై ప్రశాంతమై ప్రమోదమై
హరాది దేవతల్ నుతించు హాలికాడ్య సోద రా 7

జనార్ధనాదయానిధీ ప్రశాంతచిత్తమున్ సదా
మనమ్ము నందువేడగా ప్రమాణమీ యువాడవే
వినాశ నమ్ములేదునీ ప్రవీక్షణమ్ముతోడ శో
భనిచ్చు పార్థసారథీ ప్ర పత్తితో నుతించగా 8

జగంబు నంతవే డ్కతోడ సన్నుతిం చనీవు ఈ
యుగంబు నందువేల్పువౌచు యోగబాట జూపి మ
మ్మగాధ తత్త్వచింతనా క్రమమ్మెరుంగ జేయుచున్
యుగాంతర ప్రబోధసార యుక్తిమూర్తి వైతివే!! 9

సుమాక్షరాలనిచ్చి మాకు శోభగూ ర్చిసాయమౌ
సమాంజ లింతువేల వేయి శ్లాఘనీయ స్తోత్రముల్
చమత్కరించు భాషణమ్ము సత్యవాక్కుబాటగా
సమాజ సేవజే యగోరు శక్తినిమ్ము మాధవా 10

Scroll to Top