శరీర ఆరోగ్యానికి ప్రాథమిక అవసరం తగినంత నిద్ర. ఇది శరీరానికి విశ్రాంతి కల్పించి, శక్తిని పునరుద్ధరిస్తుంది. ప్రతి రోజూ 7-9 గంటల నిద్ర సమర్థవంతమైన శారీరక, మానసిక ఆరోగ్యం కోసం సరిపోతుంది. కానీ దీనికి మించి అతిగా నిద్రపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*ఎక్కువ సమయం నిద్రించేవారిలో మెదడు పనితీరు మందగిస్తుంది. ఇది మతిమరుపు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలకు దారితీస్తుంది. కొన్నిసార్లు మెదడు డిప్రెషన్ మయమవుతుంది.
*అధిక నిద్రతో శారీరక కదలికలు తగ్గిపోతాయి. వ్యాయామం లేకపోవడం, అనవసరమైన నిద్ర సమయం భౌతిక శక్తి వినియోగాన్ని తగ్గించి, బరువు పెరగడం లేదా స్థూలకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యలు వంటి శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
*అతిగా నిద్రపోవడం వలన రోజువారీ పనులు చేయడానికి తగినంత సమయం లేక , మానసిక ఒత్తిడి అధికమవుతుంది. నిరాశ, ఆందోళన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
*నిద్ర ఎక్కువగా ఉండడం మెటాబాలిజం ప్రక్రియను నెమ్మదింపచేస్తుంది. ఇది డయాబెటిస్ వంటి రోగాలకు కారణమవుతుంది.
*అధిక నిద్ర వల్ల జీవనశైలిలో మార్పులు తలెత్తుతాయి. ఇది రోజువారీ కార్యక్రమాలను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ సమయం పడుకొని నిద్రించడం వల్ల మెడ, వెన్నుపూస, తల నొప్పులు తలెత్తుతాయి.
*అతిగా నిద్రపోవడం వల్ల మహిళల్లో సంతాన సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది.
*ఎక్కువ నిద్రపోవడం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలికంగా ఈ అలవాటు గుండె నాడుల పనితీరు తగ్గించి, గుండె జబ్బులకు అవకాశం కల్పిస్తుంది.
అతిగా నిద్రపోయే అలవాటు ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి నిద్ర సమయాన్ని నియంత్రణలో ఉంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.