
అచ్చ తెలుఁగు సాహిత్యంలో అక్షరదీపిక మధునాపంతుల * నవంబర్ 7-మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి వర్థంతి
తెలుగు జాతి చరిత్రకు ‘పెద్దబాల శిక్ష’ వంటిదైన మధునాపంతుల వారి ఆంధ్ర పురాణము.. అష్టాదశ పురాణాల సరసన కూర్చుండ తగిన అద్భుత పురాణం అనడంలో అతిశయోక్తి లేదని పండితుల ప్రశంసలు అందుకున్న కవి దిగ్గజం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. ఆంధ్ర మహోజ్జ్వల చరిత్ర గురించి మణుల వంటి పద్యాలతో చక్కని మణిహారంను గుది గుచ్చి తెలుగు భాషామతల్లిని అలంకరించిన మహాకవులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. సాహిత్య చరిత్రను ధిషణతో సుసంపన్నంచేసి స్వర్ణయుగంగా తన కాలాన్ని సాహిత్యాన్ని తెలుగు భాషా సరస్వతికి సమర్పించిన ధన్యులు మధునాపంతులవారు. ఆయన వర్థంతి నవంబర్ 7. ఈ సందర్భంగా ఆ మహనీయుని జీవిత విశేషాలు కొన్ని…
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులలో ప్రముఖులు. ఆంధ్ర కల్హణ, కళా ప్రపూర్ణ బిరుదాంకితులు. సిధ్ధార్థి నామ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమినాటికి సరి అయిన 1920, మార్చి 5వ తేదీన తన మాతామహుడైన ఆకొండి రామ్మూర్తిశాస్త్రి ఇంట్లో ఐలెండు పోలవరం గ్రామంలో జన్మించారు. ఇతని తల్లి లచ్చమ్మ, తండ్రి సత్యన్నారాయణమూర్తి. ఇతని బాల్యం పల్లిపాలెం గ్రామంలో గడిచింది. మహేంద్రవాడ సుబ్బరాయశాస్త్రి, ఓలేటి వెంకటరామశాస్త్రిల వద్ద కావ్య, వ్యాకరణాలు చదివారు. ఆంధ్ర భాషమీద ఉన్న అపారమైన ఆభిమానంతో 1939లో ఆంధ్రి అనే మాసపత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక ఆనాటి పండితుల, పరిశోధకుల అభిమానం చూరగొంది. ఈ పత్రిక సాహిత్య మాసపత్రికలలో ఎంతో పేరెన్నికగన్నది. అందలి ప్రతి వ్యాసానికి, కవితలకు శాస్త్రి పుటకు దిగువ పాద గమనికలు వ్రాసేవారు. ఈ పాద గమనికలలో వ్యాసంకాని, కవిత కాని బాగుగా ఉంటే వాటిని శ్లాఘించే వారు, లేకపోతే ఎంతటి మహాకవి రచయైన శాస్త్రి విమర్శకు లోనుకావలసిందే. ఇందులో ఆనాడు లబ్ధ ప్రతిష్ఠులైన పండితులు, కవులు, రచయితలనేకుల రచనలు ముద్రింపబడ్డాయి. ఈ పత్రిక 1941 నవంబర్ వరకు నడిచింది.
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి 1940లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యారు. 1940-44ల మధ్యకాలంలో ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1947లో ఆయన నివాసం రాజమండ్రికి మార్చి వీరేశలింగ ఆస్తికోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా చేరి 1974 వరకు అ పాఠశాలలోనే పనిచేసి పదవీవిరమణ చేశారు. ఈయన రచనల్లో ముఖ్యమైనది ఆంధ్ర పురాణం. ఈ కృతికిగాను ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆంధ్ర పురాణము, ఆంధ్ర రచయితలు ఆయన రాసిన ఇతర ప్రముఖ రచనలు.
ఆంధ్ర దేశంలో ప్రాచీన కాలం నుండి చారిత్రక ఇతివృత్తంతో కవులు కావ్యాలు వ్రాయడం పరిపాటి. శాస్త్రి ఆంధ్రుల చరిత్రను తొమ్మిది పర్వాలుగా ఉదయ పర్వం నుండి నాయక రాజుల చరిత్ర వరకు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి వ్రాశారు. ఇది ఇరవయ్యవ శతాబ్దంలో ఉద్భవించిన చారిత్రక పంచకావ్యాలలో ఒకటి. మిగిలినవి పింగళి-కాటూరి కవుల సౌందరనందము, దుర్భాక రాజశేఖర శతావధాని రాణా ప్రతాప సింహచరిత్ర, శతావధాని గడియారం వేంకట శేషశాస్త్రి శ్రీ శివభారతము, తుమ్మల సీతారామమూర్తి బాపూజీ ఆత్మకథ అనేవి. శాస్త్రి రచించిన ‘‘ఆంధ్ర పురాణము’’ చరిత్ర కావ్యమైనా సాహితీ విలువలు కలిగిన కావ్యం.
ఆంధ్ర రచయితలు… శాస్త్రి ప్రసిద్ధ రచనలలో ఒకటి. ఇందులో నీతి చంత్రిక, బాల వ్యాకరణం రచించిన చిన్నయసూరి నుండి తుమ్మల సీతారామమూర్తి చౌదరి వరకు నూరుగురి మహా రచయితలను గూర్చి సద్విమర్శతో వ్రాయబడిన గ్రంథం. 2012 డిసెంబరులో ఈ గ్రంథాన్ని శాస్త్రి కుమారులు మధునామూర్తి సవరణలు చేసి నూతనంగా పదముగ్గురు రచయితలను చేర్చి తిరిగి ముద్రించి తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలలోను, మరల హైదరాబాదులోను ఆ గ్రంథాన్ని ఆవిష్కరింపజేశాడు.
చరిత్ర ధన్యులు.. చరిత్రలో వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన వారి గురించి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రాసిన పుస్తకం.
ఇందులో శాస్త్రి శాలివాహనుడు, మాధవ వర్మ, గొంకరాజు, అన్నమయ్య జీవితాలను చిత్రించాడు. శాలివాహనుడి సాహిత్య కృషిని, మాధవ వర్మ రాజకీయ చతురత, గొంకరాజు ప్రభుభక్తి పరాయణత్వం, అన్నమయ్య ఆధ్యాత్మిక తత్వం ఇందులో ప్రధానంగా పొందుపరచబడ్డాయి.
చారిత్రక విషయాలకు తగినంతమేర నాటకీయత జోడించి చదువరులను ఆకట్టుకునేలా ఈ పుస్తకం రాశారు. శాస్త్రి రచించి ప్రచురించిన ఖండకావ్యాలు – (1) తోరణములు (2) శ్రీ ఖండములు (3) చైత్రరథం (4) కేళాకుళి అనునవి ఉన్నాయి. శాస్త్రి పిన్ననాటనే అంటే 10 సంవత్సరాల వయస్సులో పద్యాలు వ్రాయడం మొదలుపెట్టారు. 1938లో వారి తొలి ఖండ కావ్యం ‘తోరణము’ వెలువడింది. దానికి విశ్వనాథ సత్యనారాయణ పీఠిక వ్రాస్తూ శాస్త్రి మహాకవి యయ్యే సూచనలు ఈ పద్యంలో గోచరిస్తున్నాయని ఈ దిగువ పద్యం ఉదహరించాడు.
తే॥ నొడువ జాలని యిడుమల గుడిచి బడలి
చిక్కి జీర్ణించి నిజదేశ సేవ చేసి
తుదకు స్మరణీయులైన యాంధ్రుల దలంప
గాజు కన్నైన నొక యశ్రుకణము రాల్చు’’
శాస్త్రి నవలలు, కథలు, చరిత్రలు, నాటకానువాదాలు, వ్యాసాలు మొదలైన సాహిత్య శాఖలలో రచనలు సాగించారు. బోధి వృక్షము – బుద్ధుని చరిత్ర ఇతివృతంగా వ్రాయబడిన నవల. కళ్యాణతార మరియొక నవల. ఇందు శ్రీకృష్ణదేవరాలు కొండపల్లి ముట్టడిని గూర్చిన ఇతివృత్తమున్నది. శాస్త్రి పతంజలి చరిత్ర, ధన్వంతరి చరిత్ర, షడ్దర్శన సంగ్రహం వారి రచనలో నొకటి.
సంప్రదాయ కవిత్వం రాసే కవులలో అత్యంత నవీనుడు, అభినవాంధ్ర కవులలో అత్యంత సంప్రదాయ కవి తల్లజుడు మధునా పంతుల అని సాహిత్యవేత్తలు అందరూ ముక్తకంఠంతో ప్రశంసించారు. 12వ శతాబ్దంలో కశ్మీర్ పండితుడు కల్హణుడు కశ్మీరు రాజుల చరిత్రను గ్రంథస్థం చేశాడు. ‘రాజతరంగిణి’ అనే పేరుతో చరిత్రను గ్రంథస్థం చేసిన మొదటి కావ్యమది. అటు తరువాత ఆ రీతిలో ఆంధ్రదేశచరిత్రను గ్రంథస్థం చేసినవారు మధునాపంతులవారే. ఈ కారణంగా ఆయన ‘ఆంధ్ర కల్హణుడు’ గా సుప్రసిద్ధులయ్యారు. ‘రాజమహేంద్రిలో నడయాడుతున్న నన్నయ’ అని మధునాపంతుల వారిని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించారు.
నన్నయగారిపైన తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటూ మధునాపంతుల వారు ఎన్నో వ్యాసాలను రచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఈ వ్యాసాలను ‘వ్యాసపీఠం’ పేరుతో ప్రచురించారు. ‘తెలుగు సారస్వత ప్రపంచమును నిరంతరముగా వెలిగించిన దివ్య తేజోమయుడు’ అనీ, . ‘వాఙ్మయవాహినికి శుచిత్వ సిద్ధిని ప్రసాదించిన వాగనుశాసనుడు’ అనీ నన్నయపైన తమ అపార భక్తి ప్రపత్తులను మధునాపంతుల వారు ప్రకటించుకున్నారు. నన్నయ గురించి ఇంకా ఇలా అన్నారు: ‘నన్నయ నాటికి తెలుగు జాతి వ్యవహరించే భాష తక్కువది కాదు. ఎంతో తియ్యనైనది. రసగూఢమైన భాష. ఛందోలావణ్యంతో తరంగితమై ఉన్న నాటి తెలుగు వాఙ్మయం గోక్షీరం వంటిది. గాఢ ప్రతిభా సంపన్నుడైన నన్నయ ఆ పాల నుండి నవ్యనవనీతం ఎత్తి తీసినాడు. ఆ వెన్న వెచ్చబెట్టినాడు. గుమగుమలాడే గోఘృతం అయింది. అదే ఆంధ్రమహాభారత సారస్వతం. వెయ్యేండ్లు అన్నమాట ఏమిటి? ఆ నెయ్యి కావ్యప్రపంచంలో కల్పాంతస్థాయి ఉత్తరోత్తర యుగాల సాహిత్య జీవులకూ తేజోదాయి. ఋషి తుల్యుడు నన్నయ. ఆయన తెలుగు పద్యం రసప్రపూర్ణ సరోవరంగా భావుకులను పిలిచి అవగాహనం చేసుకోమంటుంది’. అలా నన్నయగారిని వేనోళ్ళ ప్రశంసిస్తూ ఆ వాగామృతధారలో పాఠకుల నోలలాడించిన కమనీయ సారస్వతావతారమూర్తి మధునాపంతుల వారు. ఆంధ్రభాషోద్ధరణకు నడుము కట్టిన నన్నయభట్టారకుని ఆంధ్ర భాషా సేవను, సభ్యరమణీయమైన సారస్వత అభినివేశమును పొందికైన పలుకుబడితో రసరమ్యంగా ఆయన అందించినారు.
‘ఆంధ్రపురాణం’లో శాతవాహనపర్వంలో కావ్యహోమం, చాళుక్యపర్వంలో భారతావతరణం, కాకతీయ పర్వంలో రాణీ రుద్రమాంబ సమర శౌర్యం చాలా ప్రసిద్ధి పొందిన ఘట్టాలు. ఇంకా పున:ప్రతిష్ఠాపర్వం, విద్యానగరపర్వం, శ్రీ కృష్ణదేవరాయపర్వం, విజయపర్వం, నాయకరాజ పర్వం రసవత్తరమైన పద్యాలతో రసజ్ఞులను ఆకట్టుకున్నాయి.
ప్రాచీన సాహిత్యాన్ని ఆపోశనపట్టిన మధునాపంతుల ఆధునిక కవుల సాహిత్యాన్నీ చదివారు. ఆధునికకవులను కొనియాడుతూ పలు ప్రసంగాలు చేశారు. భావకవిత్వ మాధురీ దర్శనములో ఆంధ్రావళికి రమ్యాలోకమునిచ్చిన రాయప్రోలు సుబ్బారావు, శిరీషపేశమైన విమర్శనాత్మక సాహిత్య రచన మనకు కర్ణాటక గాంధర్వ ధారను పారింపజేసిన రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, ‘సాహితీసమితి’, ‘నవ్యసాహిత్య పరిషత్’ ను ప్రతిభా వైభవంతో నడపి గీతినాటికా ప్రక్రియకు ఖ్యాతి తెచ్చిన విద్వజ్ఞుడు తల్లావఝల శివశంకరశాస్త్రి, వేలూరి శివరామశాస్త్త్రి వెరసి ఈ నలుగురు అభినవాంధ్ర సారస్వతమును నందన ప్రసవముగా పరిమళింపజేసిన తోబుట్టువులని వారి పట్ల తమ ఆత్మీయతను మధునాపంతువారు చాటుకున్నారు.
‘ఆంధ్ర కల్హణ’, ‘అభినవ నన్నయ్య’, ‘కళా ప్రపూర్ణ’ బిరుదులతో సాహితీ లోకం మన్ననలు అందుకున్న మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి 72 ఏళ్ల వయస్సులో 1992లో నవంబర్ 7న కాలధర్మం చెందారు.
