జోలెపాళ్యం మంగమ్మ ఆల్ ఇండియా రేడియోలో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్‌గా ప్రసిద్ధురాలు. రేడియో ప్రసిద్ధురాలిగానే కాదు…సాహిత్య, సామాజిక రంగాల్లోనూ ప్రవీణురాలు. ఆమె ఎవరితోనైనా చిరునవ్వుతో స్పందించేవారు. ‘నేను రేడియో మంగమ్మని’ అంటుండేవారు. ఆ మాటల్లో వినమ్రత, సహనశీలత. అప్పట్లో దేశ రాజధాని నుంచి వార్తలు చదివిన సుప్రసిద్ధులలో ఒకరు. సెప్టెంబర్ 12 ఆమె జయంతి. ఈ సందర్భంగా ఆమె జీవన విశేషాలు సంక్షిప్తంగా…
జోలెపాళ్యం మంగమ్మ చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1925, సెప్టెంబరు 12న జన్మించారు. మంగమ్మది వ్యవసాయ కుటుంబం. ఆమెకు మాత్రం చదువంటే ఎంతో ఇష్టం. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ (బీటీ) కళాశాలలో చదివారు. అనీబిసెంట్ జాతీయవాద భావాలకు, జీవిత ఆదర్శాలకు ప్రభావితులయ్యారు మంగమ్మ. అందుకే బి.టి.కాలేజీలో డిగ్రీ చేశారు. పీజీ, బీఎడ్ తర్వాత ఢిల్లీలో డాక్టరేట్ సాధించారు.
విద్యాసంబంధ పరిశోధన చేస్తున్నపుడే, ఆ పక్రియ మీద అనురక్తి పెరిగి ఇతర రంగాలకు విస్తరించింది. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషాంశాల మీదా మక్కువ పెంచుకున్నారు. ప్రత్యేకించి, పద ఉచ్ఛారణ గురించి. ఆంగ్లం, ఫ్రెంచి భాషల లోతుపాతులు తెలుసుకునేందుకు ప్రాచీన గ్రంథాలెన్నింటినీ సమగ్ర అధ్యయనం చేశారు. పదాలు, పదబంధాలు, వాక్యాలు, వాటి నిర్మాణ రీతుల పరంగా ఎంతో తెలుసుకున్నారు. తెలుసుకున్నవాటిని ఇతరులకూ వివరించారు. కొంతకాలం బోధన సాగించారామె. మూలపదాలు, వ్యాకరణం, విశేషణాలను విశ్లేషించే పని చేపట్టారు.మాటను పలికే విధానంలోనే అందం ఉంటుందని, ఉండాలనీ ఆమె నిశ్చిత అభిప్రాయం. అందుకు వీలుగా ఉపన్యాసంపైన చూపు సారించారు. ఆకాశవాణిలో చేరడానికి ముందు, ఆ తర్వాత కూడా బోధన వ్యాసంగానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. బోధనా రంగంలో సుమారు పాతిక సంవత్సరాల అనుభవం సంపాదించారామె.
ఆమె ఆలిండియా రేడియో న్యూఢిల్లీలో 10 సంవత్సరాలు ఎడిటర్‌గా, న్యూస్ రీడర్‌గా పనిచేశారు.
అనేక సంత్సరాలుగా వార్తలు ఎడిట్ చేస్తూ, న్యూస్ రీడర్‌గా అనేక ప్రయోగాలు చేశారు.పుస్తకాలు రాయడం,వార్తలు చదవడంలో మీకు అభిమాన పాత్రమైనది ఏది? అన్న విలేకరుల ప్రశ్నకు….’‘రాత, పఠనం – వీటి ఐక్యవేదిక ఆకాశవాణి. దశాబ్దాల చరిత అది. తెలుగు ప్రసారాలు మొదలయ్యాక ఎన్నెన్నో ఘన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిలో వార్తలకు ఎంతో విశిష్ట స్థానం కాబట్టే నాకు ఆకాశవాణిలో పని చేయడమే ఎంతైనా ఇష్టం. ఎంతో రాయవచ్చు. ఎంతైనా చదవవచ్చు. అయితే ఆ రాతలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వార్తలను చదవడంలో ఎప్పటికప్పుడు అప్రమత్తత వహించాల్సిందే. ఇవన్నీ వరాలుగా లభించాయి నాకు. అదృష్టశాలినని నాకు నేనే అనుకుంటాను. న్యూస్‌రీడర్ బాధ్యతలను అత్యంత పవిత్రంగా భావిస్తాను. నా సహచర వనితా మణులూ ఎందరో ఉన్నారు. కానీ, కాలక్రమణికలో ముందు వరసన చోటు కలగడం నా భాగ్యం’’ అని వినయపూర్వక సమాధానమిచ్చేవారు.
1962 నుండి నేషనల్ ఆర్కీవ్స్, ఢిల్లీలో పరిశోధనలు చేశారు. ఆమె కేంద్ర సమాచారశాఖ, విదేశాంగశాఖలలో కీలకమైన పదవులను నిర్వహించారు.
ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొదలైన సంస్థలలో జీవిత సభ్యురాలు. ఇంకా జోలెపాళ్యం మంగమ్మ అనిబీసెంట్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఉపాధ్యక్షురాలిగా, గాంధీ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవల్‌పమెంట్ అధ్యక్షురాలిగా, లోక్‌అదాలత్‌లో సభ్యురాలిగా వివిధ హోదాల్లో సేవలను అందించారు. న్యూఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం, సిద్ధార్థ కళాపీఠం (విజయవాడ) విశిష్ట అవార్డు మొదలైన సత్కారాలు పొందారు. సరోజినీ నాయుడు అనుయాయిగా జోలెపాళ్యం మంగమ్మ పేరుపొందారు. ఆంధ్రానైటింగేల్ అనే బిరుదును ఆమె గౌరవాన్ని మరింత ఇనుమడించింది.
ఆమె తెలుగులో…ఆంధ్రదేశంలో క్రైస్తవ మిషనరీల సేవ, తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు (1746-1856), ఇండియన్ పార్లమెంట్, శ్రీ అరబిందో, విప్లవవీరుడు అల్లూరిసీతారామరాజు,
అనిబీసెంట్ అనే పుస్తకాలు. ఇంగ్లీషులో.. ప్రింటింగ్ ఇండియా, అల్లూరి సీతారామరాజు, లాస్ట్ పాలెగార్ ఎన్‌కౌంటర్ విత్ ది బ్రిటిష్ ఇన్ ది సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (1846-1847), ది
గ్రేట్ స్కూల్స్ ఆఫ్ గోదావరి అనే పుస్తకాలు రాశారు. జోలెపాళ్యం మంగమ్మ మదనపల్లెలోని తన స్వగృహంలో 2017, ఫిబ్రవరి 1వ తేదీన తన 92వ యేట కాలధర్మం చెందారు.
