సాంప్రదాయానికీ, ఐక్యతకీ ప్రతీక – ఆషాఢ గోరింట ఉత్సవం


ఆచారాలకు, సాంప్రదాయాలకు ఆలవాలమైన తెలుగుదనం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగర తెలుగు వాకిళ్ళలో సరిక్రొత్తగా తొణికిసలాడింది.  బహుళ సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టం గట్టే ఆస్ట్రేలియా దేశంలో ‘తెలుగు ధనం’ గా వెల్లివిరిసింది.  లక్ష్మీ సమానులైన స్త్రీ మూర్తులకు గౌరవప్రదమైన పండుగగా గోరింట ఉత్సవం భక్తి పారవశ్యాలతో జరిపి తెలుగు వనంలో కొంగ్రొత్త వెలుగులు నింపారు.

ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్‌లాండ్ (AAQ) ఆధ్వర్యంలో ఇటీవల మహిళలకు అంకితంగా నిర్వహించిన ఓ రంగులమయమైన, సాంస్కృతిక పరమైన గొప్ప ఉత్సవం – ఆషాఢ గోరింట ఉత్సవం ఘనంగా జరిగింది. జూలై 19వ తేదీ శనివారం నాడు స్వబోడా పార్క్, కురబీ, QLD 4112లో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఇది తెలుగువారినే కాకుండా, ఇతర బహుళ సంస్కృతీ సమాజాల సభ్యులను కూడ ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.

గోరింట ధరించడం (సంస్కృతంలో “మెహందీ” లేదా “మెండికా” అని పిలుస్తారు) భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో ప్రాముఖ్యత కలిగిన సంప్రదాయం. ఆషాఢ మాసంలో (జూలై) తెలుగు మహిళలు తమ చేతులకు గోరింట వేసుకోవడం పూర్వ కాలం నుండి వస్తున్న ఒక సత్సంప్రదాయం. ఇది వర్షాకాలాన్ని భక్తి ప్రపత్తులతో ఆహ్వా నించడాన్ని సూచిస్తుంది. అంతేకాక, శ్రావణ మాసం శుభారంభాన్ని సూచిస్తుంది – ఇది మహాలక్ష్మి ఆశీర్వాదాల కోసం కుటుంబాలు ప్రార్థనలు చేసే పవిత్ర కాలం.

శ్రీమతి సుధా శంకర్ ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా నడిపించారు. వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది. అనేక తెలుగు మహిళలు, బాలికలు ఆనందంగా పాల్గొని తమ చేతులకు గోరింట పూతను అలంకరించుకున్నారు – ఇది ప్రేమ, వాత్సల్యం, ఉత్సాహానికి ప్రతీక.

క్వీన్స్‌లాండ్ జూయిష్ కమ్యూనిటీ (QJC) నుండి మిస్సెస్ కార్మెల్ గారు పాల్గొని మద్దతు ఇవ్వడం బహుళ సంస్కృతీ సంఘీభావానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. వారి సహకారం పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

అలాగే, ఈ కార్యక్రమ విజయవంతానికి తోడ్పడిన మా ప్రధాన స్పాన్సర్స్ శ్రీమతి శ్రీ లక్ష్మి జీ, గౌరంగ్ జీ మరియు త్రుషా జీలకు మా మనఃపూర్వక కృతజ్ఞతలు. ప్రత్యేకంగా భాను యాపురి గారు మరియు హేమ నాయుడు గారు చేసిన అమూల్యమైన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు.

సుధా శంకర్
AAQ కార్యవర్గం

Scroll to Top