ఆకట్టుకునే ‘ఇడ్లీ కొట్టు’


ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ధనుష్‌ తాజాగా ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రతి కథకీ కథావస్తువు అంటే ఎక్కడనుంచో ఊడిపడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉండే పరిస్థితులు, మనుషులు, వస్తువులు, సందర్భాలు, సన్నివేశాలు ఇవన్నీ కథా వస్తువులే. ఈ కథలో కథావస్తువు ‘ఇడ్లీ కొట్టు’. ధనుష్ చిన్నతనంలో తన ఊరు వెళ్లినప్పుడు ఒక ‘ఇడ్లీ కొట్టు’ని చూసి ప్రేరణ పొంది అల్లిన కథే ఈ ‘ఇడ్లీ కొట్టు’. ఈ కథకి ఆయనే కథానాయకుడు.. అతనే దర్శకుడు.

కథ
శంకరాపురం అనే చిన్నగ్రామంలో ఈ ‘ఇడ్లీ కొట్టు’ కథను మొదలు పెట్టాడు దర్శకుడు ధనుష్. శివకేశవుడు (రాజ్ కిరణ్)కి తన ఇడ్లీ కొట్టు అంటే పంచ ప్రాణాలు. ఆ ఇడ్లీ కొట్టే తన తల్లి తనకి ఇచ్చిన ఆస్తి. దాన్నే దైవంగా భావిస్తూ.. ఊళ్లో వారికి రుచికరమైన ఇడ్లీ అందిస్తూ కడుపునింపుతుంటాడు. శివకేశవుడు కొడుకు మురళి (ధనుష్) హోటల్ మేనేజ్‌మెంట్ చేసి ఉన్నత స్థితికి వెళ్లాలని అనుకుంటాడు. తన తండ్రి ఇడ్లీ కొట్టుకి ఊళ్లో మంచి పేరు ఉండటంతో ఆ పేరుతో మరిన్ని ఫ్రాంచైజీలతో విస్తరించాలని పట్టుబడతాడు. తన చేత్తో పిండిరుబ్బితేనే కానీ ఇడ్లీ వేయడానికి ఇష్టపడని శివకేశవుడు.. ఫ్రాంచైజీలు పెట్టడానికి ఒప్పుకోడు. దాంతో మురళి.. తండ్రి దగ్గరే ఉంటే తాను కూడా ఇడ్లీలు వేసుకుని బతకాలనే ఉద్దేశంతో కన్నవారిని వదిలి విదేశాలకు వెళ్లిపోతాడు. అక్కడ విష్ణు వర్థన్ (సత్యరాజ్)‌కి సంబంధించిన హోటల్స్‌లో పనిచేసి వాళ్ల కంపెనీని లాభాల బాటపట్టిస్తాడు.

మురళి తమ వద్దే ఉంటే.. తమ కంపెనీకి తిరుగుఉండదనే ఉద్దేశంతో తన కూతురు మీరా (షాలినీ పాండే)ని ఇచ్చి పెళ్లి చేయాలని పెళ్లి ఫిక్స్ చేస్తాడు విష్ణు వర్థన్. ఆ పెళ్లి విష్ణు వర్థన్ కొడుకు అశ్విన్ (అరుణ్ విజయ్)కి ఇష్టం ఉండదు. తన కంపెనీలో తనకంటే మురళికి ఎక్కువ పేరు రావడాన్ని సహించలేకపోతాడు అరుణ్. చుట్టూ కోట్ల ఆస్తులు.. పేరు, హోదా అన్నీ ఉన్నా కన్నవాళ్లు లేని బాధని భరించలేకపోతుంటాడు మురళి. సరిగ్గా మీరాతో పెళ్లి టైమ్‌కి మురళి తండ్రి చనిపోతారు. అతను ప్రాణంగా చూసుకున్న ‘ఇడ్లీ కొట్టు’ మూతపడుతుంది. మురళి తిరిగి తన స్వగ్రామం వచ్చిన తరువాత తన తండ్రి ఆశయం అయిన ‘ఇడ్లీ కొట్టు’ని ఏ విధంగా నిలబెట్టాడు? మురళి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.. తన తండ్రి పేరుతో పాటు వారసత్వాన్ని నిలబెట్టడం కోసం ఎలాంటి పోరాటం చేశాడు? అతని పోరాటంలో కళ్యాణి (నిత్యామీనన్) అందించిన ప్రోత్సాహం ఏంటి? అన్నదే మిగిలిన ‘ఇడ్లీ కొట్టు’ కథ.

భిన్న స్వభావాలు
తండ్రికి ఊరు.. ఆ ఇడ్లీ కొట్టు అంటే ప్రాణం. కొడుక్కి కన్నవాళ్లని ఉన్న ఊరిని వదిలి ఎదగాలనే తాపత్రయం.. భిన్నస్వభావాలు ఉన్న పాత్రల మధ్య ఘర్షణను ఎమోషనల్‌గా చూపించి కొన్ని హార్ట్ టచ్చింగ్ మూమెంట్స్‌ అందించారు ధనుష్. కథలో ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా.. హీరో విదేశాలకు వెళ్లడం అక్కడ తాను కావాలనుకున్న ఆస్తి, అంతస్తు, పేరు, హోదా సంపాదించడం.. కథకి కావాల్సిన ప్లాట్ చకచకా కదులుతుంది ఫస్టాఫ్‌లో. ఎప్పుడైతే హీరో తండ్రి చనిపోయి.. తన ఊరికి తిరిగి రావడం, మూత పడిన ఇడ్లీ కొట్టుని మళ్లీ ప్రారంభించడంతో కథ వేగం పుంజుకుంటుంది.

సహజంగా
ఊహించని మలుపులు.. ఊహాతీతమైన ట్విస్ట్‌లు ఇవేం లేకపోయినా ఫస్టాఫ్‌లో కథని చాలా డీసెంట్‌గా నడిపించాడు ధనుష్. తల్లిదండ్రుల ఆశయాన్ని బతికించే కొడుకు పాత్రలో ఏడిపించాడు ధనుష్. చాలా సన్నివేషాల్లో కళ్లు చెమ్మగిల్లేట్టు చేశాడు. ధనుష్ నటించే సినిమాలే కాదు.. ఆయన దర్శకత్వం వహించే సినిమాలు చాలా సహజంగా ఉంటాయి. చిన్న చిన్న సన్నివేశాలతో లోతైన భావాలు కనిపిస్తుంటాయి. సింపుల్ కథలే అయినా ఎమోషనల్‌గా చాలా డెప్త్ ఉంటుంది. ఇది మన కథే అని ఫీలింగ్ కలిగిస్తుంటాడు ధనుష్. కన్నవాళ్లని ఉన్న ఊరిని వదిలి ఎక్కడో బతుకుతున్న వాళ్లందరికీ ఈ కథలో కొన్ని సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి. పనీ.. పనీ అంటూ కన్న వాళ్లని ఉన్న ఊరిని వదిలేసి ఒంటరిగా బతుకున్న నాదీ ఓ బతుకేనా? అని హీరో బాధపడే సన్నివేశం తమని తాము చూసుకుంటారు చాలామంది. ఇలా ‘ఇడ్లీ కొట్టు’ ఫస్టాఫ్ చాలా వరకూ ఎమోషనల్ రైడ్‌గా సాగుతుంది. కీలకమైన సెకండాఫ్‌కి వచ్చేసరికి.. తన తండ్రి రిక్షా తొక్కాడు కాబట్టి.. తన కొడుకు కూడా రిక్షా తొక్కాలని.. తన తండ్రి బస్తాలు మోశాడు కాబట్టి.. తన కొడుకు కూడా బస్తాలు మోయాలని ఏ తండ్రీ అనుకోడు. ప్రజెంట్ జనరేషన్‌లో అయితే అస్సలు అనుకోరు. కానీ ఈ కథలో తాను ఇడ్లీ కొట్టు నడిపాను కాబట్టి తన కొడుకు కూడా ఇడ్లీ కొట్టు నడపి అలాగే ఉండిపోవాలని అనుకోవడం.. అదే సాంప్రదాయాన్ని కొడుకు కూడా తరతరాలకు వర్తింపచేస్తానని చెప్పడం వాస్తవ దూరంగా అనిపిస్తుంది.

దర్శకుడిగా
ఇప్పటికే దర్శకుడిగా పాస్ మార్కులు పొందిన ధనుష్.. ‘ఇడ్లీ కొట్టు’తో తనలో గొప్ప దర్శకుడు ఉన్నాడని కొన్ని సీన్లతో నిరూపించాడు. మిగతా పాత్రల విషయానికి వస్తే.. కళ్యాణిగా డీగ్లామర్ రోల్‌లో ఒదిగిపోయింది నిత్యామీనన్. మురళి ఆశయంలో అండగా నిలిచే పాత్రలో మెప్పించింది నిత్యా మీనన్. మీరాగా తనకి సూటయ్యే పాత్రలో మెరిసింది షాలినిపాండే. ప్రతినాయకుడిగా అరుణ్ విజయ్ మెప్పించారు. హీరో తండ్రి పాత్రలో రాజ్ కిరణ్ రోల్ ఈ సినిమాకి ఆయువుపట్టు. అతని చుట్టూనే కథ తిరుగుతుంది. హీరోయిన్ తండ్రిగా సత్యరాజ్ మల్టీషేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. పరోటాకొట్టు పట్టాభిగా నటుడు దర్శకుడు సముద్రఖని నటించారు.ఈ సినిమాలో డైలాగ్‌లు చాలా హార్ట్ టచ్చింగ్ అనిపిస్తాయి. ‘అమ్మ నాన్నల్ని చూసుకోలేని ఏ కొడుకూ బాగుపడినట్టు చరిత్రలో లేదు.. కోల్పోవడానికి ఏమీ లేనోడ్ని గెలవడం చాలా కష్టం’ అని డైలాగ్‌లు పేలాయి. జీవీ ప్రకాష్ మ్యూజిక్, కిరణ్ కౌశిక్ కెమెరా వర్క్ కథని ఎలివేట్ చేయడంతో ఉపయోగపడింది.

నటులు:ధనుష్,నిత్యా మీనన్,షాలిని పాండే,అరుణ్‌ విజయ్‌,సత్యరాజ్
దర్శకుడు:ధనుష్

Scroll to Top