యువతే మన భవిత

ఆస్ట్రేలియాలో తెలుగువారి అరవై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నో మజిలీలలో మలుపులు, గెలుపులు. ఎత్తుపల్లాలు చవిచూసాం, విజయవిషాదాలు అధిగమించాం. అవకాశాలు అందిపుచ్చుకున్నాం. అందమైన భవిష్యత్తుకు బాటలు దిద్దాం. అరమరికలు లేని భావాలు పంచుకున్నాం. భావితరాలకు గట్టి పునాదులు వేసాం. సంఘీభావంతో అరవై వసంతాలు విజయ బావుటాను ఎగురవేసాము. తెలుగుదనంలో ఒక సాంప్రదాయపు ఘట్టాన్ని తెలుగు ‘ధనం’గా ఉత్సవాలు జరుపుకుంటున్నాము.

ఇది ఒక ఎత్తైతే, ఇక్కడి నుండి దీనిని సగర్వంగా నిలుపుకోవడం మరో ఎత్తు. ఇది అసాధ్యం కాదు. సుసాధ్యం చేసుకోవడానికి ఉత్తమమైన మార్గాలు వెదకాలి. సరైన వనరులు దొరకబట్టుకోవాలి. కొంత మేధోమధనం చేయాలి. ఈ విషయమై ఆలశ్యం చేయడానికి అవకాశం లేదు.

1960-80 దశకాలలో వచ్చిన మొదటి తరం దాదాపుగా క్రియాశీలక పాత్రలనుండి కనుమరుగైపోతున్నారు. తరువాత వచ్చిన రెండవ తరం వారు వివిధ రంగాలలో నిష్ణాతులుగా నిలదొక్కుకొని తెలుగు సంఘాలకు ప్రతినిధులుగాను, వ్యక్తిగతంగాను తమ సేవలందిస్తున్నారు. సమాజసేవకు పునఃరంకితమై పులకిస్తున్నారు. కొన్ని సంస్థలకు నావకు చుక్కానిలా తమ నాయకత్వ పటిమను చూపిస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు.

2000 సంవత్సరం తరువాత వచ్చినవారు మూడవతరానికి చెందినవారనుకుంటే, ఇక్కడే పుట్టిపెరిగిన పిల్లలు కొందరు ఈకోవలోకి వస్తారని చెప్పవచ్చు. మరికొందరు నాల్గవ తరానికి చెందినవారుగా వర్గీకరించబడవచ్చు. ఈ కోవకు చెందినవారు స్థానికులతో పాటు పోటీ పడి దాదాపు అన్ని రంగాలలో ఉన్నత పదవులనలంకరించి ఉత్తమ సేవలనందించడమే కాకుండా, ఉన్నత పురస్కారాలను కూడా అందుకుంటున్నారు. విద్యా, వైద్య, సామాజిక, సాంకేతిక రంగాలలో చాలామంది నిలదొక్కుకొని ఇప్పుడిప్పుడే రాజకీయ రంగంలో అడుగిడి రాష్ట్ర చట్టసభల్లో కూడా మన బావుటాను ఎగురవేసే దిశగా ఎదగడం ఎంతో ముదావహం.

మన ఉనికిని పది కాలాలపాటు కాపాడుకోవడానికి ఇంకో రెండు దశాబ్దాలలో మన తెలుగు సంఘాల పగ్గాలు ఈ మూడవ, నాల్గవ తరానికి చెందిన పిల్లలకు అందించడానికి మనం ఇప్పుడే సన్నహాలు చేయడం ఉత్తమం. దానికి ఒక వ్యూహాత్మక రచన అవసరం. ఎందుకంటే భారతదేశం నుండి వచ్చిన వారి ఆలోచనా దృక్పథంతో పోలిస్తే ఇక్కడ పుట్టి పెరిగినవారిలో పారదర్శకత్వం ఎక్కువ శాతం ఉండి ఎదుటివారిలో కూడా అంతే గుణం ఉండాలని అనుకుంటారు. పనిలో నిబద్ధత, భావ వ్యక్తీకరణలో సమర్ధత వంటి కొన్ని లక్షణాలలో ఎక్కువుగా తేడాలుంటాయి కాబట్టి ఒక క్రమ పద్ధతిలో ఈ పరివర్తనను అమలు చేయవలసిన అవసరముంది. అందరూ ఈ విషయమై ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైందని గుర్తించాలి.

 

Scroll to Top