
మన దైనందిన అలవాట్లు, జీవనశైలి నిర్ణయిస్తాయని 18 వేల మందిపై 15 ఏళ్ల పాటు జరిగిన ఓ విస్తృత అధ్యయనం తాజాగా వెల్లడించింది. 90 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించిన వ్యక్తులలో సాధారణంగా కనిపించే కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం.
*ఒత్తిడి లేని జీవితం గడిపేవేరే దీర్ఘాయుష్కులు. వీరు తమ మనస్సును లోపల నుంచి ప్రశాంతంగా ఉంచుకోవడంలో అగ్రస్థానంలో ఉంటారు. దీర్ఘకాలిక ఒత్తిడి మన శరీరంలోని కార్టిసోల్ స్థాయిని పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, అధిక రక్తపోటు, రోగనిరోధక శక్తి బలహీనపడటానికి ప్రధాన కారణం. తమ భావోద్వేగాలను నియంత్రించుకుని జీవితంలో చిన్న చిన్న విషయాల్లో అతిగా స్పందించని వ్యక్తులు శారీరకంగా, మానసికంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. ఇందుకై రోజుకు 10-15 నిమిషాలు ధ్యానం చేయడం, నెమ్మదిగా శ్వాస తీసుకునే బ్రీతింగ్ వ్యాయామాలు లేదా యోగా సాధన చేయడం వంటివి అవసరం.
* దీర్ఘాయుష్కుల ముఖ్య లక్షణాల్లో మరొకటి మెదడును చురుకుగా ఉంచడం కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కలిగి ఉండటం . నిరంతరం నేర్చుకోవడం వల్ల మెదడులోని నరాల మధ్య కొత్త కనెక్షన్లు ఏర్పడతాయి. ఈ సామర్థ్యాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు, ఇది మెదడు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. చురుకైన మెదడు అల్జీమర్స్, మతిమరుపు (డిమెన్షియా) వంటి వృద్ధాప్య వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొత్త భాష నేర్చుకోవడం, క్లిష్టమైన పజిల్స్ (సుడోకు, క్రాస్‌వర్డ్) పరిష్కరించడం, లేదా కొత్త నైపుణ్యాన్ని (వంట, పెయింటింగ్) నేర్చుకోవడం ద్వారా మెదడును ఉత్తేజితం చేయవచ్చని అధ్యయనంలో తేలింది.
*దీర్ఘాయుష్కులు తమ జీవితంలో దొరికిన చిన్న చిన్న సంతోషాలకు కూడా కృతజ్ఞత కలిగి ఉంటారు. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకుండా, తమ వద్ద ఉన్నవాటితో సంతోషంగా ఉండటం వల్ల కోపం, అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలు తగ్గుతాయి. ఇతరులకు ధన్యవాదాలు చెప్పడం, ఇతరులను అంగీకరించడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. ఇది ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. బలమైన సామాజిక బంధాలు కూడా దీర్ఘాయువుకు ఒక ముఖ్య కారణంగా గుర్తించబడ్డాయి.
*ఎక్కువ సమయం ప్రకృతిలో గడపడం శారీరక, మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఉదయం పూట పార్క్ లో నడవడం లేదా సూర్యరశ్మిలో గడపడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యానికి కీలకం. ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. ప్రకృతిలో సమయం గడపడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. గుండె కొట్టుకునే వేగం నెమ్మదిగా, స్థిరంగా ఉంటుంది. రోజులో కొంత సమయం బహిరంగ ప్రదేశాల్లో గడపడం, తోట పని చేయడం లేదా కిటికీ దగ్గర కూర్చుని ఆకుపచ్చని దృశ్యాలను చూడటం అలవాటు చేసుకోవాలి.
*సమతుల్య జీవితాన్ని గడపేవారు దీర్ఘాయుష్కులుగా ఉంటారు. సంతృప్తిగా జీవించడం వల్ల ఆరోగ్యం సహజంగానే వారి జీవితంలో ఒక భాగంగా మారింది. ఈ అలవాట్లతో పాటు, వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి, సహజమైన ఆహారం తీసుకోవాలి, రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండి, ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం.
