
మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు”. చిరు కెరీర్‌లో 157వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ తో ఆకట్టుకున్నారు. నయనతార హీరోయిన్ గా నటించగా.. కేథరిన్ ముఖ్య పాత్ర పోషించింది. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటివరకు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. ఆయన తెరకెక్కించిన చివరి చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. వెంకటేష్ హీరోగా వచ్చిన ఆ మూవీ భారీ హిట్ అందుకుంది. దాంతో మళ్లీ వీరి కాంబినేషన్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆహ్లాదంతో అలరిస్తోంది.
కథ:
శంకరవరప్రసాద్ (చిరంజీవి) ఇంటెలిజెన్స్ ఆఫీసర్. కేంద్ర మంత్రి దగ్గర సెక్యూరిటీ గా ఉంటాడు. అతని భార్య శశిరేఖ (నయనతార) ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ ఉమెన్. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ చిన్న చిన్న ఈగోలతో విడిపోతారు. తన పిల్లల్ని కూడా చూడలేక పోతున్నాను అని శంకరవరప్రసాద్ బాగా ఫీల్ అవుతుంటాడు. అలాంటి సమయంలో తన టీం నారాయణ (హర్షవర్ధన్), జ్వాల (కేథరిన్ త్రెసా) మరో ఇద్దరితో కలిసి పిల్లలకు దగ్గర ఇవ్వడానికి ఒక ప్లాన్ వేస్తారు. అదే సమయంలో కేంద్రమంత్రి శర్మ(శరత్ సక్సేనా)కు ‘నిన్ను చంపేస్తున్నాం’ అంటూ ఓ హంతకుల గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్ రావడం.. ఆయన దగ్గర పనిచేస్తున్న నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకర్‌వరప్రసాద్(చిరంజీవి) ఆ గ్యాంగ్‌ని తుదముట్టించడంతో కథ మొదలవుతుంది. శంకర్‌వరప్రసాద్‌ని శర్మ తన కుటుంబ సభ్యుడిగా చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ సరదాగా ఉండే శంకరప్రసాద్ మనసులో ఏదో బాధ ఉన్నదని గ్రహించిన శర్మ.. ఓ రోజు శంకరప్రసాద్‌ని కారణం అడగుతాడు. భార్యతో విడిపోవడం.. కన్నబిడ్డలకు దూరం కావడం.. ఇవే శంకర వరప్రసాద్ బాధకు కారణాలని శర్మకు అర్థమవుతుంది.అందుకే ఓ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటున్న పిల్లల్ని కలుసుకునే ఏర్పాటు చేస్తాడు మినిస్టర్ శర్మ. ఆ స్కూల్‌లో పీఈటీగా జాయిన్ అయిన శంకర వరప్రసాద్.. తన పిల్లలకు ఎలా చేరువయ్యాడు? అసలు శంకరప్రసాద్ భార్యతో విడిపోవడానికి కారణం ఏంటి? చివరకు ఆ కుటుంబం ఎలా కలిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ
నో లాజిక్.. ఓన్లీ వింటేజ్
కథ పరంగా మన శంకరవరప్రసాద్ గారు చాలా రొటీన్ మూవీ. కానీ అనిల్ రావిపూడి సినిమాలలో కథ కంటే ఎక్కువగా కథనం బాగుంటుంది. ఈసారి కూడా నో లాజిక్.. ఓన్లీ వింటేజ్ మెగా మ్యాజిక్ చేయడంలో సక్సెస్ కొట్టారు. అపార్థం చేసుకొని విడిపోయిన భార్యకు తానేంటో అర్థం కావాలని తపించే భర్త కథ ఇది. దూరమైన బిడ్డలను అక్కున చేర్చుకోవాలని తహతహలాగే ఓ తండ్రి కథ ఇది. ఈ కథ చుట్టూ వినోదాన్ని మేళవించి జనరంజకంగా మలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఈ సినిమాలో అర్థవంతంగా, హాయిగా నవ్వుకునేలా కామెడీ ఉన్నది. ప్రధాన పాత్రల మధ్య ఏర్పాడే ఆయా పరిస్థితుల నుంచి పుట్టే కామెడీనే ఈ సినిమాలో ఆద్యంతం కనిపిస్తుంది. సిట్యువేషనల్ కామెడీ కావడంతో సినిమా ఎక్కడా విసుగు రాలేదు. ప్రథమార్ధం పాత్రల పరిచయాలు, హీరో హీరోయిన్లు కలవడం, విడిపోవడం, దానికి సంబంధించిన పరిస్థితుల నేపథ్యంలో సాగింది. సమస్యలు సీరియస్‌వే అయినా.. చెప్పడం మాత్రం వినోదంగా చెప్పాడు. ఈ కథలో విలన్ పాత్ర గురించి ప్రత్యేకించి చెప్పాలి. చిరంజీవి సినిమాల్లో విలన్ అంటే అత్యంత శక్తిమంతుడిగా, ప్రమాదకారిగా కనిపిస్తాడు. కానీ ఈ సినిమాలో ప్రధాన విలన్ ఓ కామన్ మ్యాన్ కావడం విశేషం.
ద్వితీయార్ధం కొంతభాగం కాస్త సీరియస్ వేలో సాగినా.. చివరి 20 నిమిషాలు వెంకటేశ్ ఎంట్రీతో సినిమా మళ్లీ వినోదంవైపు టర్న్ తీసుకున్నది. వెంకీగౌడాగా తెరపై వెంకటేశ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఓ విధంగా ఆయన ఉన్నంతవరకూ తెరపై అందర్నీ డామినేట్ చేశారు. తెరపై చిరంజీవి, వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో సందడి చేయడం.. అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకుడికి కూడా కన్నుల పండుగ అనిపించింది.
ఎలా ఉందంటే?
మెగాస్టార్ చిరంజీవి నటన గురించి చెప్పేటంత వారు ఎవరున్నారు. ఆయనకు ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ దొరికితే మళ్లీ ఎలా స్క్రీన్ మీద నవ్వులు పూయిస్తారో ఇప్పుడు మరోసారి నిరూపించారు. వెంకటేష్ ఉన్నది 20 నిమిషాలైనా కూడా అదరగొట్టాడు. నయనతార కూడా చాలా అందంగా ఉంది. కేథరిన్ త్రెసా, సచిన్ ఖేడ్ కర్, బుల్లి రాజు, అభినవ్ గోమటం, హర్షవర్ధన్ ఎవరికి వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అనిల్ రావిపూడి. తన బాధ్యతను వందకు 90 శాతం న్యాయం చేశారాయన. చిరంజీవితో సినిమా ఎలా చేయాలో చేసి చూపించాడు. చిరంజీవి, వెంకటేశ్ పాత్రల్నీ ఆయన ట్యాకిల్ చేసిన తీరు మాత్రం నిజంగా అభినందనీయం. ఈ సినిమాలో అనిల్ రావిపూడి తర్వాత చెప్పుకోవాల్సింది ఎడిటింగ్ గురించే. చిరంజీవి వయసు ప్రభావం ఎక్కడా కనిపించకుండా, అతి జాగ్రత్తగా ప్రతి సీన్‌లోనూ ఎడిటర్ తీసుకున్న జాగ్రత్తలు చిరంజీవి పాత్రకు కొత్త అందాన్ని తెచ్చాయి. ఇక ఈ సినిమా ప్రధాన బలాల్లో భీమ్స్ సంగీతం ఒకటి. ప్రతి పాటా జనాలకు నచ్చింది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది. సమీర్‌రెడ్డి కెమెరా వర్క్ సూపర్. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. చిరంజీవి, వెంకటేశ్, నయనతారలను చాలా అందంగా చూపించారాయన. మొత్తంగా సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా సమర్థనీయం గానే ఉంది. నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా పూర్తి స్థాయి న్యాయం చేశారు.
నటులు:చిరంజీవి,నయనతార,వెంకటేష్,కేథరిన్
దర్శకుడు:అనిల్ రావిపూడి
