
కొన్నేళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులు బాగా చూసేసిన మలయాళ సినిమా ‘జయ జయ జయ జయహే ని ‘ఓం శాంతి శాంతి శాంతిః’ పేరుతో రీమేక్ చేశారు. తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ సినిమా తాజాగా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ:
చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ల ఇష్టాలపైనే ప్రతి పని చేస్తూ.. తన ఇష్టాలను ఎవరూ పట్టించుకోరేంటి అనే బాధతో బతుకుతూ ఉంటుంది ప్రశాంతి (ఈషా రెబ్బా). ఆటల్లో, చదువుల్లో చివరికి పెళ్లిలో కూడా పెద్దవాళ్లు చెప్పిన మాటే వినాల్సి వస్తుంది. కనీసం చేసుకునేవాడైనా తనని అర్థం చేసుకుంటాడు.. తన ఇష్టాలకి గౌరవం ఇస్తాడని అనుకుంటుంది. కానీ తను చేసుకున్న ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) పెద్ద కోపిష్టి.. ముక్కు మీద కోపం ఉన్న మనిషి.. మగాడు అనే అహంకారం తో బతుకుతున్న వ్యక్తి అని కొద్ది రోజుల్లోనే తెలుసుకుంటుంది. పైగా చిన్నచిన్నవాటికి తన మీద చేయి చేసుకునే సరికి ప్రశాంతి తట్టుకోలేకపోతుంది. ఆ బాధని, కోపాన్ని తన లోపలే దాచుకొని దాచుకొని.. తన భర్తకు అతని దారిలోనే బుద్ధి చెప్పింది…ఇదే కథ.
నటన:
జయ జయ జయహే సినిమాలో బాసిల్ జోసెఫ్ చేసిన పాత్రని ఇందులో ఓంకార్ నాయుడుగా తరుణ్ చేశారు. బాసిల్ అందులో పండించిన కామెడీకి ఇందులో తరుణ్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఎక్కడా కంపేర్ చేయకుండా ఆడియన్స్ నవ్వుకునేలా చేయడంలో తరుణ్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా కామెడీ సీన్లలో, కాస్త నెగిటివ్ షేడ్ ఉన్న సీన్లలో తరుణ్ నటన చాలా బాగుంది. ఆయన నటుడిగా ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఖచ్చితంగా ఇది అయితే మార్క్ చూపించింది. అలాగే గోదారి యాసని కూడా తరుణ్ బాగా వంటపట్టించుకున్నారు. ఇక ప్రశాంతి పాత్రలో ఈషా రెబ్బా కూడా చాలా రోజుల తర్వాత మంచి నటన కనబరిచారు. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో ఈషా అదరగొట్టారు. అలానే ఫస్టాఫ్ మొత్తం పెర్ఫామెన్స్ చాలా సెటిల్డ్‌గా ఉన్నా ఇంటర్వెల్ నుంచి మాత్రం ఈషానే సినిమాని నడిపించారు. ఈషా బాదడం.. తరుణ్ కామెడీగా బాధపడటం.. ఇలా సెకండాఫ్ కూడా బాగానే నడిచిపోయింది. ఇక క్లైమాక్స్‌లో బ్రహ్మానందం ఎంట్రీతో సినిమాకి శుభం కార్డు వేశారు.
కామెడీ ట్రాక్ :
ఒరిజినల్ వెర్షన్‌లోని కథని ఏమాత్రం మార్చకపోయినా కూడా తెలుగు ప్రేక్షకులకి తగ్గట్లుగా ముఖ్యంగా గోదారి యాస, భాష, వెటకారాలతో సినిమాని బాగానే చూపించారు. సినిమాలో మొదటి నుంచి చివరి వరకూ కనిపించిన ప్రతిసారి హీరో మామ పాత్రలో బ్రహ్మాజీ బాగా నవ్వించారు. చాన్నాళ్ల తర్వాత బ్రహ్మాజీ కి ఇలా మంచి కామెడీ ట్రాక్ పడింది. ఇక హీరోయిన్ మావయ్య గా చేసిన వ్యక్తి కూడా అక్కడక్కడా బాగానే నవ్వించారు. మిగిలిన వారంతా తమ పాత్రలకి ఎక్కడా అన్యాయం చేయలేదు. ఇది రీమేక్ కాదనే భావన కలగడానికి మ్యూజిక్ కూడా ఒక కారణం.
నటులు:తరుణ్ భాస్కర్,ఈషా రెబ్బా,బ్రహ్మాజీ,బ్రహ్మానందం
దర్శకుడు:ఏఆర్ సజీవ్
