బాలీవుడ్ పై కీర్తి సురేష్ భారీ ఆశలు


టాలీవుడ్ నటి కీర్తి సురేష్ ప్రస్తుతం తన కెరీర్‌లో  వరుస పరాజయాలు పలకరిస్తున్న వేళ బాలీవుడ్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తున్న ‘రఫ్తార్’ మూవీతో హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. జూలై 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఈ సినిమాతోనైనా కీర్తి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా? బాలీవుడ్‌లో గట్టి పునాది వేసుకుంటుందా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది.

దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన కీర్తి సురేష్‌కు ఈ మధ్య కాలం అస్సలు కలిసి రావడం లేదు. గత ఏడాది వచ్చిన ‘ఉప్పు కప్పురంబు’, ‘రివాల్వర్ రీటా’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దీంతో కీర్తి తన ఫోకస్‌ను బాలీవుడ్ వైపు మళ్లించింది. ఇప్పటికే ‘బేబీ జాన్’ సినిమాతో హిందీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పుడు రాజ్‌కుమార్ రావు సరసన చేస్తున్న ‘రఫ్తార్’ ఆమెకు రెండో బాలీవుడ్ ప్రాజెక్ట్.ఇక ఈ సినిమా ఫలితం ఆమె హిందీ కెరీర్‌ను డిసైడ్ చేయనుంది.

తాజా సమాచారం ప్రకారం ‘రఫ్తార్’ సినిమాను జూలై 24న థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు లాంటి టాలెంటెడ్ నటుడు ఉండటం కీర్తికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అయితే, రాజ్‌కుమార్ రావు విమర్శకుల ప్రశంసలు అందుకునే చిత్రాలు చేస్తారు కానీ, కమర్షియల్ మాస్ హీరో కాదనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో ఉంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగా ఉంటే తప్ప బాలీవుడ్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడం కష్టమనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో కీర్తి సురేష్ కెరీర్ గురించి సౌత్‌లో అవకాశాలు తగ్గడం వల్లే ఆమె బాలీవుడ్‌కు వెళ్లిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం కీర్తి సురేష్ గణేష్ రాజ్ దర్శకత్వంలో ‘కన్నివేడి’,  మిస్కిన్‌తో ఒక సినిమా చేస్తోంది. జూలైలో రాబోతున్న ‘రఫ్తార్’ ఒకవేళ సర్ప్రైజ్ హిట్ అయితే మాత్రం కీర్తి మళ్ళీ ఫామ్ లోకి రావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

Scroll to Top