ఆస్ట్రేలియా తెలుగు మహోత్సవం

బహుళ సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టం గట్టే ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు బిడ్డలుగా పర సంస్కృతితో సహజీవనం చేస్తూ తమ ఉనికిని కాపాడుకుంటూ మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో తెలుగు వారు అరవై వసంతాలు పూర్తి చేసుకొని భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయ విలువలు అందిస్తున్నారు. విజయ విషాదాలతో కూడిన ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని అరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ చరిత్రను “తూర్పు తీరంలో తెలుగు రేఖలు” అన్న పుస్తకం కూడా వ్రాసుకోవడం జరిగింది.  ఈ సందర్భంగా ఆస్ట్రేలియా తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలలో ఉన్న ఎంతోమంది తెలుగు వారికి మన విజయాలను తెలియజేయడానికి వచ్చే నాలుగు నెలల్లో రెండు రోజుల “ఆస్ట్రేలియా తెలుగు మహోత్సవం”  జరపుకోవాలని ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (Federation of Telugu Associations in Australia) ఇతర స్థానిక తెలుగు సంఘాలతో సంయుక్తంగా ఉత్సవాలు జరుపుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు.

అరవై వసంతాల మైలు రాళ్ళు:

  • అధికారికంగా తెలుగు మాతృభాషగా నమోదైన సంఖ్య 60,000
  • ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వంచే 2020లో తెలుగు సామాజిక భాషగా గుర్తింపు. భారతదేశం కాకుండా ఇతర ప్రాశ్చాత్య దేశాలలో ఒక కేంద్ర ప్రభుత్వంచే మొట్టమొదటగా గుర్తింపబడిన భాష
  • వైద్య, న్యాయ, ఆరోగ్య రంగాలలో తెలుగు భాషలో అనువాదకులు మరియు భాష్యకారులు అందుబాటు
  • మన తెలుగువారు విద్య, వైద్య, రాజకీయ, వ్యాపార రంగాలలో అంచెలంచెలుగా ఎదిగి స్థానికులతో పోటీ
  • దేశంలోని అన్ని ముఖ్య నగరాలలో సుమారు 800 మంది పిల్లలు తెలుగు సంఘాలు నిర్వహిస్తున్న బడుల్లో మన భాష నేర్చుకుంటున్నారు.
  • భారత-ఆస్ట్రేలియా దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్ధిక సంబంధాలు చాలా మెరుగు పడ్డాయి. ఇందులో తెలుగువారు చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
  • కళా రంగంలో ప్రత్యేకంగా రంగస్థల పద్య నాటకాలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొట్టమొదటిగా నిర్వహించిన ఘనత ఆస్ట్రేలియా తెలుగు వారిదే!
  • ఆస్ట్రేలియా తెలుగువారి ఘనత – “తూర్పు తీరంలో తెలుగు రేఖలు”. ప్రపంచంలో ఏ ఇతర దేశాలలో ఇంతవరకు తమ చరిత్ర లిఖిత పూర్వకంగా ప్రచురింపబడలేదు

ఈ ఉత్సవాలలో ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలోని అన్ని తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొని తెలుగుదనం ఉట్టిపడే  సాంస్కృతిక కార్యక్రమాలను, రంగస్థల నాటకాలను ప్రదర్శించబోతున్నారు.

ఉత్సవ ముఖ్యోద్దేశ్యం:

ఆస్ట్రేలియాలో అరవై వసంతాల తెలుగు భాషావికాస ప్రస్థానంలో సాధించిన ప్రగతి, నిర్మించిన సంస్కృతి, సంకల్పించిన పురోగతి వంటి ఎన్నో అంశాలను ఇక్కడి తెలుగువారందరితో ఒక మహోత్సవంగా జరుపుకొని,   ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరితో పంచుకోవాలనే ఆశయంతో రెండు రోజుల పాటు ఈ సంస్కృతీ విజయోత్సవాలు నిర్వహించబడుతున్నాయి.

వివిధ దేశాల్లోని తెలుగు భాషా నిష్ణాతులు, సాహితీవేత్తలు, లలితకళా కోవిదులు, వివిధ రంగాలలో లబ్ధప్రతిష్ఠులు అయిన ఎందరో మహనీయుల సాహిత్య వికాసాలు, కళావిలాసాలు ప్రదర్శించి, తెలుగు సంస్కృతీ పతాకాన్ని సుప్రతిష్ఠం చేయాలని సంకల్పం.

Scroll to Top