శ్రీరామనవమి స్పెషల్ రుచులు

శ్రీరామనవమి స్పెషల్ రుచులు – ప్రత్యేక నైవేద్యాలతో శ్రీరామునికి నివేదన


ప్రత్యేక నైవేద్యాలు అన్ని పండుగలు, పర్వదినాలలో ఒక భాగం. శ్రీరామనవమి పండుగ రోజు దేవునికి పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాలు సమర్పించడం వెనుక ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని పండితులు చెబుతారు. శ్రీరామనవమి లో పూజ తర్వాత కొత్తకుండలో మిరియాలు, యాలకులు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి పెడతారు. శ్రీరామనవమి పండుగ వేళ అందరూ ఎంతో ఇష్టంగా స్వీకరించే పానకం, వడపప్పు ఎలా తయారు చేస్తారు? వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తదితర విశేషాలివి.

పానకం
పానకం తయారీకి బెల్లం- అరకప్పు, నీళ్లు – 2 కప్పులు, మిరియాల పొడి – పావు స్పూన్‌, శొంఠిపొడి – పావు స్పూన్‌. యాలకులపొడి – పావు స్పూన్‌, ఉప్పు – చిటికెడు, నిమ్మరసం – రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చ కర్పూరం – చిటికెడు, తులసి ఆకులు – 5 లేదా 6 అవసరం.
మొదట గిన్నెలో కావల్సినంత వాటర్ తీసుకొని అందులో బెల్లం తరుగు వేసి నానబెట్టాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ నీటి మిశ్రమంలో యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత సరిపడినంత ఉప్పు, పచ్చ కర్పూరం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పానకంలో తులసి ఆకులు వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది.

పానకంలో వేసే బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడి, తులసి ఆకులు, శొంఠి పొడి లో ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే వేసవి సమయంలో వచ్చే శ్రీరామనవమి పర్వదినం రోజు పానకం తీసుకుంటే వేసవి తాపం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పానకంలో వేసే బెల్లంలో ఐరన్, పాస్ఫరస్‌, పొటాషియం ఉన్నందున వల్ల తక్షణ శక్తి లభిస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా రక్తహీనత బారిన పడనివ్వకుండా కాపాడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచడం, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం వంటి పనులు చేస్తుంది. ముఖ్యంగా బెల్లం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు సైతం దూరమవుతాయి పానకం తాగడం వల్ల నీరసం, అలసట తగ్గుతుంది. పానకంలో వేసే మిరియాలు, తులసి ఆకులు దగ్గు, కఫం తగ్గించే ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. శొంఠి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మందాన్ని తగ్గించి ఆకలిని పెంచుతాయి. శొంఠి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

వడపప్పు
వడపప్పు తయారీకి పెసరపప్పు – ఒక కప్పు, తురిమిన కొబ్బరి – మూడు చెంచాలు, పచ్చిమిర్చి – 2 లేదా 3 చిన్న చిన్న ముక్కలు, నిమ్మరసం – ఒక స్పూన్‌, ఉప్పు- రుచికి తగినంత అవసరం. మొదట ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకుని ఒక పెసరపప్పును 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నీటిని వడగట్టుకుని పెసర పప్పును పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పెసర పప్పులో తురిమిన కొబ్బరి, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతమంది కొంచెం బెల్లం కూడా వేసుకుంటారు. అంతే వడపప్పు సిద్ధమైనట్లే

వడపప్పులో ఏ, బీ, సీ, ఇ విటమిన్‌తో పాటు ఐరన్‌, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పెసరపప్పులో బాగా అధికంగా ఉండే ప్రొటీన్, ఫైబర్‌ వంటివి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహకరిస్తాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి పెసరపప్పు తోడ్పడుతుంది. పెసర పప్పు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఇతర ఖనిజాలు, పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Scroll to Top