గుండె పదిలంగా ఉండాలంటే…


ప్రస్తుత కాలంలో శరవేగంగా మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సంబంధిత సమస్యలు వయస్సుతో సంబంధం లేకుండా పలువురిలో వస్తున్నాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వ్యాయామంతో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో గుండెకు మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. అందుకే  గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే ఆహారంలో పండ్లు తప్పనిసరిగా ఉండాలి. రక్తపోటును నియంత్రించడంలోనూ, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. పలురకాల అనారోగ్యాల నుంచి కాపాడి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

గుండె సంబంధిత వ్యాధులు రావడానికి అనేక అంశాలు కారణమవుతున్నాయి. వాటిలో ప్రధానంగా రక్తనాళాల పనితీరు మందగించడం, దీర్ఘకాలిక వాపు, రక్తంలో కొవ్వు అసమతుల్యత, అధిక రక్తపోటు, ఇన్సులిన్‌ నిరోధకత వంటివి ఉన్నాయి. పండ్లు పాలీఫెనాల్స్‌, ప్లేవనాయిడ్స్‌, పొటాషియం, కరిగే పీచు పదార్థం వంటి బయో యాక్టివ్‌ సమ్మేళనాలను అందించే ఫంక్షనల్‌ ఫుడ్స్‌ కావడం వల్ల ఈ అనారోగ్య లక్షణాలను ముందుగానే నివారించడంలో,  రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో, కొవ్వు జీవక్రియను క్రమబద్ధీకరించడంలో, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, నారింజ, నిమ్మ వంటి సిట్రస్‌ పండ్లు, ఆపిల్స్‌, దానిమ్మ, అరటిపండ్లు, అవకాడో వంటి పండ్లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.

* దానిమ్మలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. రక్త ప్రసరణను సాఫీగా సాగేలా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఒక కప్పు దానిమ్మ గింజలు లేదా తాజా రసం తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ధమనుల గోడలు గట్టిపడకుండా కాపాడటంలో దీనికి మరే ఇతర పండు సాటిరాదు.

*ఆపిల్‌లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా నారింజ కూడా గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

*నారింజలో ఉండే ఫ్లేవనాయిడ్స్ గుండె వాపును తగ్గించి, హృదయ స్పందనలు క్రమబద్ధంగా ఉండేలా చూస్తాయి. ఈ రెండూ గుండెను దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించే కవచాల్లా పనిచేస్తాయి.

*జామ, ఉసిరి, బొప్పాయి పండ్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. జామకాయలో పొటాషియం, కరిగే ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె కండరాలను బలోపేతం చేస్తాయి. ఇక ఉసిరిలో ఉండే విటమిన్ సి రక్త నాళాలను శుద్ధి చేస్తుంది.

*బొప్పాయిలో ఉండే లైకోపీన్, విటమిన్ సి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడతాయి. స్థానికంగా లభించే ఈ పండ్లను నిత్యం తీసుకోవడం వల్ల గుండెకు కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి.

*బత్తాయి పండులో ఉండే సిట్రస్ గుణాలు రక్తంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి. ద్రాక్ష పండు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా నలుపు లేదా ఎరుపు రంగు ద్రాక్షలో గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించి గుండెపోటు రాకుండా నివారిస్తాయి.

*అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది సోడియం ప్రభావాన్ని తగ్గించి రక్తపోటును నియంత్రిస్తుంది. మూత్రపిండాల ద్వారా అధిక ఉప్పును బయటకు పంపడంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. తద్వారా గుండె పై ఒత్తిడి తగ్గుతుంది. ప్రతిరోజూ ఒక అరటిపండు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందడమే కాకుండా హృదయ స్పందన స్థిరంగా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు.

Scroll to Top