ఈనెల 12న ‘కొత్త మలుపు’


ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’ జూన్ 12న విడుదల కానుంది. భైరవి ఆర్థ్యా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శివ వరప్రసాద్ దర్శకుడు కాగా, తాటి బాలకృష్ణ నిర్మించారు. కోనసీమ గ్రామీణ నేపథ్యంలో, బావమరదళ్ల మధ్య సాగే రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర టీజర్ విడుదల వేడుక చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, గాయని సునీత, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, ప్రముఖ హాస్యనటుడు రఘుబాబు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

చిత్ర దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాను పల్లెటూరి వాతావరణంలో, ముఖ్యంగా కోనసీమలోని అందమైన లొకేషన్లలో అద్భుతంగా చిత్రీకరించినట్లు తెలిపారు. కథలో ప్రేమ, సస్పెన్స్‌తో పాటు ప్రేక్షకులు కోరుకునే వినోదం, హాస్యం పుష్కలంగా ఉంటాయని చెప్పారు. జూన్ 12న విడుదల కాబోతున్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గాయని సునీత మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆకాష్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని, ప్రేక్షకులు అతడిని ఆశీర్వదించాలని కోరారు. ఒక మంచి వినోదభరితమైన కథతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారని, ఈ చిన్న చిత్రానికి అగ్ర సంస్థ మైత్రి మూవీస్ అండగా నిలవడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ చిత్రం ద్వారా తానే కాకుండా దర్శకుడు, హీరోయిన్ కూడా పరిశ్రమకు పరిచయమవుతున్నట్లు తెలిపారు. సరికొత్త అనుభూతిని పంచేలా పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించామని చెప్పారు.హీరో ఆకాష్, హీరోయిన్ భైరవి మాట్లాడుతూ.. తమకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, మద్దతుగా నిలిచిన మైత్రి సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత సి. కళ్యాణ్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. సునీత తమ కుటుంబ సభ్యురాలని, ఆమె కుమారుడి చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Scroll to Top