శివ–విష్ణు మందిరంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు


ప్రతీ సంవత్సరం HOTA (Hindu Organizations, Temples & Associations) అధ్వర్యంలో జరిగే రక్షాబంధన్ వేడుకలు మెల్బోర్న్‌లోని శివ–విష్ణు మందిరం పర్యవేక్షణలో శనివారం (08/08/2026) భక్తి, సాంస్కృతిక వైభవంతో నిర్వహించబడింది. భారతీయ సాంప్రదాయాలను ఆస్ట్రేలియా గడ్డపై ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టే ఈ కార్యక్రమానికి స్థానిక రాజకీయ నాయకులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు, భారతీయ సమాజ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ వేడుకకు విక్టోరియా రాష్ట్ర ప్లానింగ్, ప్రివెన్షన్ ఆఫ్ ఫ్యామిలీ వయోలెన్స్ మంత్రి సోనియా కిల్కెన్నీ, జోడియా బేలయ – కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ సభ్యులు, పాలిన్ రిచర్డ్స్ – క్రేన్బోర్న్ పార్లమెంట్ సభ్యులు, ఫ్రాంక్‌స్టన్ మేయర్ కౌన్సిలర్ స్యూ బేకర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి రక్షాబంధన్ యొక్క కుటుంబ బంధాలను బలపరచే సందేశాన్ని ప్రశంసించారు. వీరితో పాటు మల్టీ కల్చరల్ యూనిట్ నుండి కొంతమంది ప్రత్యెక అతిథులు మరియు స్థానిక విక్టోరియా పోలీసు అధికారులు కూడా విచ్చేసారు. భారతీయ సంస్కృతిలో సోదర–సోదరీమణుల ప్రేమ, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను ఆస్ట్రేలియా సమాజం కూడా ఆత్మీయంగా స్వీకరిస్తుండటం ప్రశంసనీయం అని వారు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటి బంధాలు, అనుబంధాలు, స్నేహపూర్వక వాతావరణం ఎంతైనా అవసరమని నొక్కి వక్కాణించారు. రక్షాబంధన్ వంటి పండుగలు బహుళసాంస్కృతిక సమాజంలో పరస్పర గౌరవం, ప్రేమ, కుటుంబ విలువలను మరింత బలపరుస్తాయని వారు అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తి గీతాలు, రాఖీ కట్టే సంప్రదాయ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారతీయ సమాజం ఐక్యతను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా శివ–విష్ణు మందిరం మరోసారి నిలిచింది.

ఈ సందర్భంగా శివ విష్ణు దేవాలయం ప్రస్తుత అధ్యక్షురాలు (మొదటి మహిళా అధ్యక్షులు) శ్రీమతి ఉషా గుళ్ళపల్లి గారు ఆహూతులందరికీ స్వాగతం పలుకుతూ దేవాలయ ప్రస్థానం 1982 నుండి 2026 వరకూ వరుస క్రమంలో వివరించారు.  శ్రీమతి రమాశ్రీ  ముడుంబ గారికి వారి సామాజిక సేవకు గుర్తింపుగా ప్రత్యేకంగా తేజస్విని పురస్కారాన్ని శ్రీ శివ విష్ణు దేవాలయం తరఫున అందజేసారు.

ఈ వేడుకలో 50 HOTA సభ్య సంస్థలు పాల్గొన్నట్లు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి గీత మద్దిపట్ల గారు తెలిపారు. వచ్చే సంవత్సరం వైష్ణవ సంఘ్ మెల్బోర్న్ వారి అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

08-08-2026

Scroll to Top