
తెలుగు వెండితెరపై తొలి అందగాడు హరనాథ్ – సెప్టెంబర్ 2 హీరో హరనాథ్ జయంతి
తెలుగు సినీ చరిత్రలో ఒక విలక్షణ నటుడిగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా కీర్తి ప్రతిష్టలు పొందిన వ్యక్తి హరనాథ్. ఆయన జయంతి ఈనెల 2వ తేదీ. ఈ సందర్భంగా ఆయన సినీ జీవిత విశేషాలు..
హరనాథ్ పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథరాజు. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో జమీందారీ కుటుంబంలో 1936 సెప్టెంబర్ 2న జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే రాజసంతో, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో పెరిగారు. కాకినాడలోని పీఆర్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఆయనకు భారీ అభిమానగణం ఏర్పడింది. మోటార్ సైకిల్‌పై స్టైల్‌గా రావడం, స్నేహితులతో కలిసి ఉండడం, గొడవల్లో ముందుండడం వంటి పనులు ఆయనలో హీరోకు ముందున్న హీరోయిజాన్ని చూపించాయి. నాటకాల పట్ల గల అభిరుచి హరనాథ్‌ను సినిమా రంగం వైపు నడిపించింది. పిఠాపురం రాజా కళాశాల లో చదువుకునే రోజుల్లో అనేక నాటకాల్లో నటించారు.
ఆ సమయంలో హరనాథ్ “ఇన్‌స్పెక్టర్ జనరల్” వంటి అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నారు.
చదువు పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా మద్రాసు చేరుకున్నారు. అక్కడ ఓ రోజు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తోన్న ఆయన్ని నిర్మాత గుత్తా రామినీడు చూసి తన సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. అలా 1959లో మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో హీరోగా చిత్ర రంగ ప్రవేశం చేసిన హరనాథ్ 1961 నుంచి 72 వరకు 11 సంవత్సరాలపాటు తెలుగు సినిమాలో హరనాథ్ స్వర్ణయుగం అనుభవించారు. కలిసి ఉంటే కలదు సుఖం, భీష్మ, గుండమ్మ కథ, పెంపుడు కూతురు, మురళీ కృష్ణ, అమర శిల్పి జక్కన్న, సర్వర్ సుందరం, భక్త ప్రహ్లాద, కథానాయిక మొల్ల, లేత మనసులు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. 60 వ దశకంలో హరనాథ్ తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందారు. డు.అప్పట్లో ఏదో వివాదంతో ఎన్టీఆర్, ఏఎన్నార్ లు జమునపై నిషేధం విధించారు. ఆ సమయంలో జమున, హరనాథ్ జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. వీరిద్దరు జంటగా నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్టయ్యాయి.
హరనాథ్ ఎన్టీఆర్ కన్నా పొడుగ్గా, అందంగా ఉంటారు. ఎంత అందగాడు కాకుండా మద్రాసు వీధుల్లో అలా నడుచుకుంటూ వెళ్తోన్న ఈ హరనాథ్‌ని చూసి సినిమాల్లో నటిస్తావా అని నిర్మాత గుత్తా రామినీడు అడిగి మరీ తన సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు.
తెలుగు తెరకు సంబంధించి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ మాత్రమే. అలాంటి ఎన్టీఆర్‌కి కూడా హరనాథ్‌లో రాముడు, కృష్ణుడు కనిపించారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా సీతారామ కళ్యాణంలో శ్రీరాముడి పాత్ర కోసం ఎవరా? ఎవరా? అని తెగ ఆలోచిస్తున్న ఎన్టీఆర్‌కు హరనాథ్ వారి ముందు శ్రీరామునిగా ప్రత్యక్షం అయ్యారు. ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకొని శ్రీరామునిగా హరనాథ్ మెప్పించారు. ఒక్క శ్రీరాముడే కాదు. శ్రీకృష్ణుడి వేషంలో ఎన్టీఆర్ కు తిరుగులేదు. కానీ భీష్మలో స్వయంగా ఎన్టీఆర్ సూచన మేరకే హరనాథ్ కు శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం దక్కడం విశేషం. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తర్వాత హరనాథ్‌దే హవా అనేంతగా ఆయన పేరు మార్మోగింది. సాధారణ అభిమానులే కాదు హీరోయిన్లు కూడా హరనాథ్ కు అభిమానులుగా మారిపోయారు. కానీ ఒకే ఒక్క మద్యపాన వ్యసనం ఆయన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది.హరనాథ్ తరువాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు లాంటి వారు అవకాశాలను అందిపుచ్చుకుని తమ స్థానాలను సుస్థిరపరుచుకుంటున్న సమయంలో హరనాథ్ మాత్రం మద్యం మత్తులోనే మునిగిపోయారు. అలా తన పరిస్థితికి తానే బాధ్యుడై హరనాథ్ చివరికి జీవచ్ఛంలా మారిపోయారు.
ఒకపుడు సినిమాల్లో ఎంతో హోదా అనుభవించిన హరినాథ్ చివరకు బతికేందుకు ఏదో ఒక సినిమా అనే దశకు చేరుకున్నారు. 1984లో చిరంజీవి హీరోగా వచ్చిన నాగు సినిమాలో అసలు డైలాగులే లేని పాత్రలో నటించారు. అదే ఆయన చివరి సినిమా కావడం గమనార్హం. చివరికి నవంబర్ 1, 1989లో 53 ఏళ్ల వయసులో హరనాథ్ కన్నుమూశారు. అలా వెండితెర అందగాడి జీవితం విషాదంగా ముగిసింది.
