కోట శ్రీనివాసరావుకు ఆస్కార్ అరుదైన గౌరవం


సినిమా ప్రపంచంలో నోబెల్ పురస్కారం గా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక తాజాగా కన్నుల పండుగగా ముగిసింది. 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ చాటిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్రాలను అవార్డులతో సత్కరించారు. తారల తళుకుబెళుకుల మధ్య అత్యంత ఉత్సాహంగా, జోష్‌తో సాగిన ఈ అవార్డుల వేడుకలో భారతీయ సినిమాకు విశేష సేవలందించి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిన సినీ ప్రముఖులను ఆస్కార్ కమిటీ స్మరించుకొన్నది. 2025 సంవత్సరంలో మరణించిన భారతీయ సినిమా ప్రముఖులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించింది.

భారతీయ సినిమా రంగానికి విశేష సేవలు అందించి స్వర్గస్తులైన ఈ ప్రముఖుల ఫోటోలను ఆస్కార్స్ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన జాబితాలో తెలుగు నటుడు కోట శ్రీనివాసరావుకు అరుదైన గుర్తింపు తన మరణానంతరం ఆస్కార్ నుంచి లభించడం మరువరానిది. విశేషంగా భావించాల్సిందే అని సినీ అభిమానులు, ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

స్వర్గీయ కోట శ్రీనివాసరావు విషయానికి వస్తే.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల ప్రేక్షకులకు అత్యంత సుపరిచితులు. కేవలం సినిమా నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా రాణించారు. 1978 సంవత్సరంలో ప్రాణం ఖరీదు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మూడు మూళ్లు, దేవాంతకుడు చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటన చిత్రంలో కాశయ్య పాత్రతో ప్రజల నీరాజనాలు అందుకొన్నారు. ఆ తర్వాత ఎన్నో విలక్షణమైన పాత్రలు, విభిన్నమైన చిత్రాలతో నాలుగు దశాబ్దాలపాటు సినీ రంగానికి సేవలు అందించారు.

తన సినీ జీవితంలో సుమారుగా 750కి పైగా చిత్రాల్లో నటించారు. దాదాపు తొమ్మిది నంది అవార్డులు అందుకొన్నారు. భారతీయ సినిమాకు విశేష సేవలు అందించినందుకు గాను.. 2015 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకొన్నారు. ఆయన జూలై 13వ తేదీ 2025 న స్వర్గస్తులయ్యారు. ఆయన లేని లోటును పూడ్చలేనిదని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ క్రమంలో ఆస్కార్ సంస్థ కూడా ఆయనకు జోహార్లు అర్పించడం భారతీయులుగా గర్వపడాల్సిన విషయమని సినీ అభిమానులు పేర్కొంటున్నారు.

Scroll to Top