
అక్కినేని నాగార్జున కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన 100వ చిత్రం ‘కింగ్ 100’ శరవేగంగా రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాలో లో హీరోయిన్గా టబు నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడైంది. షూటింగ్ లొకేషన్ నుంచి క్లాప్ బోర్డ్ ఫోటోను షేర్ చేస్తూ ఆమె ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత ‘నిన్నే పెళ్లాడతా’ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై కనిపించబోతుండటంతో ఆసక్తి నెలకొంది. రా. కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో నాగ్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారని, వారిలో సీనియర్ నటి టబు ఒకరని చాలా రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడీ విషయాన్ని టబు కన్ఫార్మ్ చేసేశారు. ఈ సినిమాలో తాను భాగమైనట్లు స్వయంగా ఆమెనే ప్రకటించారు.
నాగార్జున 100వ సినిమాలో నటిస్తున్నట్లు టబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఒక చైర్ పై #ఖింగ్100 మూవీ క్లాప్ బోర్డ్ పెట్టి ఉన్న ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీనికి అన్నపూర్ణ స్టూడియోస్ ని ట్యాగ్ చేయడంతో పాటుగా నాగార్జున పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టారు. దీంతో ఈ సినిమాలో టబు ఒక హీరోయిన్ గా నటిస్తున్నారనే సంగతి స్పష్టమైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇదే తొలి అధికారిక ప్రకటన. అందుకే అక్కినేని అభిమానులు ఆనందపడుతున్నారు.
నాగార్జున – టబు జోడీది మంచి హిట్ కాంబినేషన్. ‘సిసింద్రీ’ సినిమాలో ‘ఆటాడుకుందారా అందగాడా’ అంటూ నాగార్జున తో కలిసి ఆడి పాడిన టబు.. ‘నిన్నే పెళ్లాడతా’ వంటి క్లాసిక్ మూవీలో జంటగా నటించారు. ఆ తర్వాత ‘ఆవిడా మా ఆవిడే’ చిత్రంలో కలిసి నటించారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. తన కెరీర్ లో మైలురాయి 100వ సినిమా కావడంతో, ఇందులో నటించాలని టబు కోరుకుందని నాగార్జున ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకప్పుడు తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో యూత్ ఫేవరేట్ గా మారిన ఈ జంట.. ఇన్నేళ్ల తర్వాత ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కింగ్ 100’ మూవీలో టబు తో పాటుగా మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. నాగార్జున సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లు ఇప్పటికే రివీల్ అయిపోయింది. సుస్మితా భట్ మరో కథానాయిక అని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
