
తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసి సాటిలేని మేటినటిగా గుర్తింపు పొందారు షావుకారు జానకి. దాదాపు ఏడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 400లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కొన్నాళ్లుగా వద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం (ఆగస్ట్ 21)న 94 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుల్లో షావుకారు జానకి ఒకరు. ఏడున్నర దశాబ్దాలకు పైగా విస్తరించిన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు.
షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి అలనాటి రంగస్థల, సినీ కథానాయికగా ప్రసిద్ధి పొందారు. రెండు వందలకి పైగా చిత్రాల్లో కథానాయిక పాత్రలు పోషించారు. ఆమె తెలుగు, తమిళ భాషల్లో ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్ మొదలైన నటుల సరసన కథానాయికగా నటించారు. ఆమె చెల్లెలు కృష్ణకుమారి కూడా సినిమా నటి. భారత ప్రభుత్వం ఆమెను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
జానకి చిన్ననాటే రంగస్థల నాటకాలలో పలు పాత్రలు పోషిస్తూ నటిగా కెరీర్ ప్రారంభించింది. తన 11వ యేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఆమె మొట్టమొదటి చిత్రం షావుకారు (1950), ఇది ఆమె ఇంటి పేరైపోయింది. ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 396 చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, ఒక మలయాళం సినిమాలోనూ నటించింది. తెలుగు కథానాయకి కృష్ణకుమారి ఆమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది. ఆమె సత్యసాయిబాబా భక్తురాలు.
1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన జానకి, 1950లో వచ్చిన విజయా ప్రొడక్షన్స్ వారి‘షావుకారు’ సినిమాతో తెరంగేట్రం చేశారు. మొదటి సినిమానే ఘన విజయం సాధించడంతో ఆ చిత్ర పేరే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. అంతకు ముందు 1949లో రక్షరేఖ అనే సినిమాలో చంద్రికగా నటించినా అంత గుర్తింపు రాలేదు. తరువాత ఆమె షావుకారు జానకిగా ప్రసిద్ధురాలయ్యారు. అప్పటి అందరు ప్రముఖ కథా నాయకుల సరసన నటించి అనేక పురస్కారాలు పొందారు. తెలుగులో ఆమె సినిమాలలో ప్రసిద్ధమైనవి కొన్ని – షావుకారు, డాక్టర్ చక్రవర్తి (1964), మంచి మనసులు (1962), రోజులు మారాయి (1955).
కథానాయికగానే కాకుండా సహయ నటిగా కూడా ఆమె ఎన్నో మెప్పించే పాత్రలు చేశారు. ‘సంసారం ఒక చదరంగం’, ‘శుభాకాంక్షలు’, ‘బావగారూ బాగున్నారా?’, ‘దేవి’, ‘రావోయ్ చందమామ’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కంచె’ వంటి అనేక హిట్ సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు. 90 ఏళ్లు దాటినా నటనపై ఆమెకున్న మక్కువ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలోనూ ఆమె కనిపించారు.
1955లో వచ్చిన కన్యాశుల్కం సినిమాలో బాల వితంతువు బుచ్చమ్మగా ఆంక్షల మధ్య నలిగిపోయే పాత్రలో కళ్లతోనే ఆమె పలికించిన అమాయకత్వం, ఆర్తి ఆరోజుల్లోనే ప్రక్షకుల్ని కట్టిపడేసింది. అంతకు ఐదేళ్ల ముందు తొలి చిత్రం షావుకారు సినిమాలో ఎన్టీఆర్ సరసన సబ్బులుగా ఒదిగిపోయిన తీరు.. అక్కాచెల్లెలు సినిమాలో పాండవులు పాండవులూ తుమ్మెద అంటూ వేసిన స్టెప్పులూ ఆమెను తలచుకోగానే మదిలో మెదలుతాయి! బతుకుదెరువు కోసం నటనారంగాన్ని ఎంచుకొని ఉండొచ్చు.. కానీ, ఆ తర్వాత తనదైన నటనతో నటనారంగాన్నే వేలు పట్టుకొని నడిపించారామె! శంకరమంచి జానకిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే తన ఇంటి పేరును షావుకారుగా మార్చుకొని.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన జానకి లేని లోటు సినీరంగాన్ని ఎవరూ పూడ్చలేనిది.
