ఉత్కంఠతో మెప్పించే ‘M4M’!


నిర్మాతగా పేరు తెచ్చుకున్న మోహన్ వడ్లపట్ల, మెగా ఫోన్ పట్టి దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M’. అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే 15కి పైగా అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం, ఇప్పుడు థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమైంది.

కథ:
హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. అయితే ఇవి మామూలు హత్యలు కావు. హంతకుడు ప్రతి మృతదేహాన్ని ప్రపంచ ప్రసిద్ధ చిత్రలేఖనాల తరహాలో అలంకరించి వదిలేస్తాడు. రాజా రవివర్మ నుంచి పికాసో వరకు.. గొప్ప కళాఖండాలను మృతదేహాలతో పునర్నిర్మించే ఈ వికృత చేష్ట పోలీసులకు సవాల్‌గా మారుతుంది. ఈ కేసును ఛేదించడానికి ఏసీపీ కృష్ణ రంగంలోకి దిగగా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాధ తనదైన శైలిలో విచారణ మొదలుపెడుతుంది. హంతకుడి మోటివ్ ఏంటి? నిషేధించబడిన ‘M4M’ పుస్తకానికి, ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.

కొత్త ప్రయోగం:
హత్యలను పెయింటింగ్స్‌తో ముడిపెట్టడం అనేది ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని ఒక కొత్త ప్రయోగం. మృతదేహాలను కళాఖండాలుగా చూపించడం ప్రేక్షకుడికి ఒకింత భయం, మరికొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అమెరికన్ నటి జో శర్మ రాధ పాత్రలో ఒదిగిపోయారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ సినిమాలో ప్రధాన ఆకర్షణ. ఏసీపీగా సంబీత్ ఆచార్య గంభీరమైన నటనను కనబరిచారు. రెడ్ వి-రాప్టర్ కెమెరాతో సంతోష్ షానమోని అందించిన విజువల్స్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. వసంత్ ఇసైపెట్టై బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్‌ను అణువణువునా పండించింది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల అనవసరమైన హంగులకు పోకుండా, కథను నేరుగా పాయింట్‌లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్‌లు ఊహాతీతంగా ఉంటాయి.

విశ్లేషణ:
సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ అంటే కేవలం ‘హంతకుడు ఎవరు?’ అనే దాని చుట్టూ తిరుగుతుంది. కానీ ‘M4M’ లో ఎందుకు చంపుతున్నాడు అనే పాయింట్ చాలా బలంగా ఉంది. Lovers-II వంటి పెయింటింగ్‌లను క్రైమ్ సీన్స్‌లో రీ-క్రియేట్ చేసిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ వంటి అనుభవజ్ఞులైన నటులు సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. సస్పెన్స్, మర్డర్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడే వారైతే.. ‘M4M’ ఒక కొత్త రకమైన థ్రిల్‌ను ఇస్తుంది.

Scroll to Top