
అమెరికా ఎన్నికల్లో సత్తా చూపుతున్న భారతీయులు
***********************************
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రిఫరెండంగా భావిస్తున్న మధ్యంతర ఎన్నికల పోలింగ్ తాజాగా ముగియగా వస్తున్న ఫలితాలో భారతీయుల సత్తా ఏమిటో మరోసారి రుజువౌతోంది. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన పలువురు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటివరకు ఇద్దరు భారత సంతతి వ్యక్తులు అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి సుహాస్ సుబ్రమణ్యం మరోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన ఘనవిజయం సాధించారు. ఫ్లోరిడా నుంచి భారత సంతతికే చెందిన పియా దాండియా విజయం సాధించారు. రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బేరా కూడా తిరిగి కాంగ్రెస్‌కు ఎన్నికకానున్నారని తెలుతోంది.
భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ పార్టీ నేత సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా రాష్ట్రంలో 10వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి అమెరికా ప్రతినిధుల సభకు (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) మళ్లీ ఎన్నికయ్యారు. ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డేవ్ బెక్విత్పై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. లేటెస్ట్ నివేదికల ప్రకారం సుహాస్‌కు 61.5 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. బెక్విత్కు 36.4 శాతం ఓట్లు పోలయ్యాయి. చివరిసారిగా 2024లో ఇదే నియోజకవర్గం నుంచి చట్టసభకు వెళ్లిన సుహాస్ తాజా విజయంతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
సుహాస్ సుబ్రమణ్యం ప్రస్తుత వయసు 40 సంవత్సరాలు. అమెరికా టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో భారత సంతతి దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే సామాజిక సేవ, ప్రజా సమస్యలపై ఆసక్తి పెంచుకున్నారు. ఈయన గతంలో వర్జీనియా శాసన సభలో కూడా పనిచేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో టెక్నాలజీ పాలసీ సలహాదారుగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో మరో భారత సంతతి డెమోక్రటిక్ పార్టీ నేత పియా దాండియా 51 శాతానికిపైగా ఓట్లు పొంది ఘనవిజయం సాధించారు. ఫ్లోరిడా 22వ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె ఫ్లోరిడా నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించడం విశేషం. రిపబ్లికన్ పార్టీకి చెందిన కేసీ అస్కర్పై ఆమె గెలుపొందారు. దాండియా విషయానికి వస్తే ఈమె గతంలో హర్లేమ్లో స్కూల్ టీచర్‌గా, హైస్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. వైట్‌హౌస్ ఫెల్లోగానూ సేవలు అందించారు. యాపిల్ సంస్థలో కూడా పనిచేశారు. ఈమె ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో జీవన వ్యయాలు, ఆరోగ్య సేవలు, విద్య వంటి అంశాల్ని ప్రస్తావించారు. సాధారణంగా ఈ నియోజకవర్గం రిపబ్లికన్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తుంటారు. అయినా సవాళ్లకు ఎదురొడ్డి డెమోక్రటిక్ పార్టీ నుంచి గెలుపొందడం విశేషం.
వీరితో పాటు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మరికొందరు భారత సంతతి నేతలు పోటీలో ఉన్నారు. కాలిఫోర్నియా 17వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి రో ఖన్నా (డెమోక్రటిక్ పార్టీ), వాషింగ్టన్ నుంచి చాలా కాలంగా చట్టసభలో కొనసాగుతున్న ప్రమీలా జయపాల్ (డెమోక్రటిక్ పార్టీ), కాలిఫోర్నియా నుంచి అమీ బేరా కూడా మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
