నోబుల్ శాంతి బహుమతి విజేత నవీ పిళ్లై  


భారతీయ మూలాలున్న దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతమ్‌ ‘నవీ’ పిళ్లైకి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా భావించే నోబెల్ శాంతి బహుమతి (2026) ఈ ఏడాదికి దక్షిణాఫ్రికాకు చెందిన 85 ఏళ్ల భారత సంతతి మహిళ నవనీతమ్ నవీ పిళ్లైను ఎంపిక చేశారు. శాంతి, అంతర్జాతీయ చట్టాలను ప్రోత్సహించడానికి కృషి చేసినందుకు గాను నోబెల్ శాంతి పురష్కారానికి నవీ పిళ్లైని ఎంపిక చేసినట్లు నార్వే నోబెల్‌ కమిటీ వెల్లడించింది.
దశాబ్దాలుగా మానవహక్కుల కోసం పోరాడుతున్న పిళ్లై.. యూఎస్ మానవహక్కుల విభాగం హైకమిషనర్‌గానూ పనిచేశారు. ఆ పదవిలో 2008 నుంచి 2014 వరకు పిళ్లై కొనసాగారు. దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆమె.. ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచారు.

నోబెల్ కమిటీకి ఈ ఏడాది బహుమతి కోసం 287 నామినేషన్లు అందగా.. వాటిలో ఎక్కువ భాగం మానవతా, మానవహక్కుల సంస్థలకు సంబంధించినవే. సాధారణంగా శాంతి సుస్థిరత, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం పెంపు, ఆ లక్ష్యాలను బలోపేతం చేసేందుకు కృషిచేసే వ్యక్తులు, సంస్థలను అవార్డు ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటుంది.

నవనీతమ్‌ అంతర్జాతీయంగా మానవ హక్కుల కోసం విశేషంగా కృషి చేశారు. ఈమె పూర్వీకులు తమిళనాడుకు చెందిన వారు కాగా.. చాలా ఏళ్ల క్రితం అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. వారు 1890లో దక్షిణాఫ్రికాలోని చక్కెర తోటలలో పనిచేయడానికి ఒప్పంద సేవకులుగా భారతదేశం నుంచి వెళ్లారు. నవనీతమ్‌ పిళ్లై తల్లిదండ్రులు శాంతమ్మ నాయుడు, నారాయణస్వామి నాయుడు. నవనీతం పిళ్లై 1941 సెప్టెంబర్ 23న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో భారతీయ తమిళ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి బస్సు డ్రైవర్‌గా పనిచేసేవారు. పేదరికం, జాతి వివక్ష తీవ్రంగా ఉన్న సమయంలో స్థానిక భారతీయ సమాజం అందించిన ఆర్థిక సహకారంతో ఆమె చదువుకున్నారు. 1963లో నటాల్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. 1965లో న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 1982లో అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి మాస్టర్ ఆఫ్ లాస్ పట్టా సాధించారు. 1988లో డాక్టర్ ఆఫ్ జ్యురిడికల్ సైన్స్ డిగ్రీ పొందారు. హార్వర్డ్‌లో న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పొందిన తొలి దక్షిణాఫ్రికా వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1967లో నటాల్ ప్రావిన్స్‌లో సొంతంగా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఆ ప్రాంతంలో న్యాయవాద వృత్తిని చేపట్టిన తొలి శ్వేతేతర మహిళగా చరిత్ర సృష్టించారు. అపార్థీడ్ పాలనలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్తలు, రాజకీయ ఖైదీలకు న్యాయసహాయం అందించారు. జైళ్లలో ఖైదీలపై జరుగుతున్న హింస, మానవ హక్కుల ఉల్లంఘనలపై పోరాడారు. రాబెన్ ఐలాండ్‌లో ఖైదీల హక్కుల పరిరక్షణకు కృషి చేశారు.

మహిళలపై గృహహింసను నిరోధించడం, బాధితులకు న్యాయసహాయం అందించడం వంటి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. 1995లో దక్షిణాఫ్రికా హైకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నెల్సన్ మండేలా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ నియామకం జరిగింది. ఈ పదవిని చేపట్టిన తొలి శ్వేతేతర మహిళగా గుర్తింపు పొందారు. న్యాయవ్యవస్థలో సమానత్వం, వివక్ష రహిత విధానాల కోసం కృషి చేశారు. 1995లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన రువాండా అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1999 నుంచి 2003 వరకు ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. యుద్ధ నేరాలు, మారణహోమాలు, మానవాళిపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణలో కీలక పాత్ర పోషించారు.

1998లో వెలువడిన జీన్-పాల్ అకాయేసు కేసు తీర్పు అంతర్జాతీయ న్యాయచరిత్రలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కేసులో అకాయేసును మారణహోమం సహా పలు నేరాల్లో దోషిగా నిర్ధారించారు. నిర్దిష్ట సమూహాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో జరిగిన అత్యాచారం, లైంగిక హింస మారణహోమ నేరాలుగా పరిగణించవచ్చని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. యుద్ధాలు, సంఘర్షణల సమయంలో మహిళలపై జరిగే లైంగిక హింసకు సంబంధించి అంతర్జాతీయ న్యాయవ్యవస్థలో కొత్త ప్రమాణాలు ఏర్పడటానికి ఈ తీర్పు దోహదపడింది.

2003లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. నెదర్లాండ్స్‌లోని హేగ్ కేంద్రంగా పనిచేసే ఈ కోర్టులో 2008 వరకు సేవలందించారు. యుద్ధ నేరాలు, మానవాళిపై నేరాలు, అంతర్జాతీయ న్యాయసూత్రాల అమలుకు సంబంధించిన అంశాల్లో తన అనుభవాన్ని ఉపయోగించారు. 2008 సెప్టెంబర్ 1న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2014 వరకు ఈ పదవిలో కొనసాగారు. భావప్రకటన స్వేచ్ఛ, మహిళల హక్కులు, మైనారిటీల రక్షణ, వివక్ష నిర్మూలన కోసం గళమెత్తారు. ఎల్‌జీబీటీక్యూ+ వర్గాల హక్కుల పరిరక్షణకు మద్దతుగా నిలిచారు.

శ్రీలంక అంతర్యుద్ధం, సిరియా సంక్షోభం వంటి అంతర్జాతీయ పరిణామాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర దర్యాప్తులు జరగాలని కోరారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినవారిపై జవాబుదారీతనం ఉండాలని స్పష్టం చేశారు.

జాతి వివక్షకు వ్యతిరేకంగా న్యాయవాదిగా ప్రారంభమైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ న్యాయవ్యవస్థలో కీలక బాధ్యతలు చేపట్టే స్థాయికి చేరింది. అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించడం, మహిళల హక్కులను కాపాడటం, అంతర్జాతీయ చట్టాల అమలును బలోపేతం చేయడం కోసం కృషి చేశారు. న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాడేవారికి ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నవీ పిళ్లై జీవితం, అంతర్జాతీయ న్యాయరంగంలో ఆమె చేసిన సేవలు మానవ హక్కుల పరిరక్షణ ప్రాముఖ్యతను చాటిచెబుతున్నాయి.

శాంతి, అంతర్జాతీయ చట్టాలను ప్రోత్సహించడానికి నవనీతమ్ ‘నవి’ పిళ్లే చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆమెకు నోబెల్ శాంతి బహుమతి వరించినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్ యోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ వెల్లడించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, వివాదాలు పెరుగుతున్న ఈ సమయంలో.. అలాగే అంతర్జాతీయ న్యాయస్థానాలు, న్యాయమూర్తులు రాజకీయ దాడులకు గురవుతున్న తరుణంలో… బలప్రయోగం లేదా హింసను ఉపయోగించకుండా వివాదాలను పరిష్కరించుకోవడం అనేది అంతర్జాతీయ న్యాయసూత్రాల పైనే ఆధారపడి ఉంటుందని గుర్తుచేయాలని నోబెల్ కమిటీ భావిస్తోంది’’ అని తమ ప్రకటనలో పేర్కొంది.
‘‘యుద్ధ నేరస్థులను బాధ్యులను చేస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా చూసే అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ మాత్రమే ప్రశాంతమైన ప్రపంచానికి పునాదిగా నిలుస్తుంది’’ అని వ్యాఖ్యానించింది.

నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా భావిస్తారు. ఈ ఏడాదితో ఈ బహుమతి ప్రదానోత్సవం 125వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది నామినేషన్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ , సూడాన్‌లోని అత్యవసర సహాయక బృందాలు, ఉక్రెయిన్‌లోని పిల్లల హక్కుల రక్షణ సంస్థ, రెండు ప్రముఖ అంతర్జాతీయ న్యాయస్థానాలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గతేడాది వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోను ఈ నోబెల్ శాంతి బహుమతి వరించింది. దక్షిణ అమెరికా దేశంలో ప్రజాస్వామ్యం కోసం చేసిన పోరాటానికి గాను మచాడో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.

Scroll to Top